Let's talk: editor@tmv.in
అమెరికాలో కుటుంబ పునరేకీకరణ పథకాలకు ముగింపు

అమెరికాలో కుటుంబ పునరేకీకరణ పథకాలకు ముగింపు

Pinjari Chand
14 డిసెంబర్, 2025

వలసదారుల కోసం అమల్లో ఉన్న కుటుంబ పునరేకికరణ అనుమతి (ఫ్యామిటీ రీయూనిఫికేషన్ పారోల్–ఎఫ్ఆర్పీ) పథకాలను ముగిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. మానవతా పారోల్ విధానాన్ని దుర్వినియోగం చేశారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) వెల్లడించింది. ఈ మేరకు ఫాక్స్ న్యూస్ కథనం ప్రచురించింది.

ఈ నిర్ణయం కొలంబియా, క్యూబా, ఈక్వడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హైతీ, హోండురాస్ దేశాల నుంచి వచ్చే వలసదారులు, వారి తక్షణ కుటుంబ సభ్యులకు వర్తిస్తుందని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది.

సరైన తనిఖీలు లేకుండా విదేశీయులు సంప్రదాయ పారోల్ ప్రక్రియను దాటవేసేలా చేసిన మానవతా అనుమతి దుర్వినియోగానికి ఈ ప్రభుత్వం ముగింపు పలుకుతోంది. పారోల్‌ను కాంగ్రెస్ ఉద్దేశించినట్లుగా కేసు-నిర్దిష్టంగా మాత్రమే అమలు చేస్తాం. ఎఫ్ఆర్పీ పథకాల రద్దు సాధారణ ఆలోచనతో కూడిన విధానాలకు, ‘అమెరికా ఫస్ట్’ దృక్పథానికి తిరిగి రావడమే అని డీహెచ్ఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

కుటుంబాల పునరేకికరణ అనుమతి కావాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ, మోసం నివారణ, జాతీయ భద్రత, ప్రజా భద్రతల పరిరక్షణ ఫెడరల్ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది. ఎఫ్ఆర్పీ కింద పారోల్ పొందినవారు అమెరికాలో తమ కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం పొందిన మాట నిజమేనని ఫెడరల్ రిజిస్టర్ నోటీసులో పేర్కొంది. అయితే, పథకాల పరిధి, ప్రభావాన్ని సమగ్రంగా సమీక్షించిన అనంతరం, అలాగే అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు అనుగుణంగా, జాతీయ భద్రతా ఆందోళనలు, మోసాలు జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం నిర్ణయించిందని నోటీసులో వివరించింది. అందువల్లే ఎఫ్ఆర్పీ పథకాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

ఇదే సందర్భంలో ఇథియోపియా పౌరులకు ఇచ్చిన టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (టీపీఎస్) ను కూడా ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశ పరిస్థితులను సమీక్షించి, సంబంధిత అమెరికా ప్రభుత్వ విభాగాలతో సంప్రదించిన తర్వాత, ఇథియోపియా ఇక టీపీఎస్ అర్హత ప్రమాణాలను తీర్చడం లేదని నిర్ణయించాం అని హోంల్యాండ్ సెక్రటరీ క్రిస్టీ నోమ్ ఫెడరల్ రిజిస్టర్ నోటీసులో తెలిపారు. సహజ విపత్తులు, సాయుధ ఘర్షణలు లేదా అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశాల పౌరులకు టీపీఎస్ మంజూరు చేస్తారు. దీనివల్ల వారికి ఉద్యోగ అనుమతి, తాత్కాలికంగా దేశ బహిష్కరణ నుంచి రక్షణ లభిస్తుంది.

కుటుంబ పునరేకికరణ అంటే

ఇది అమెరికా ప్రభుత్వం అమలు చేసిన ఒక మానవతా వలస విధానం. దీని ద్వారా అమెరికాలో ఇప్ప

టికే చట్టబద్ధంగా నివసిస్తున్న వ్యక్తి (పౌరుడు లేదా శాశ్వత నివాసితుడు) తన భార్య/భర్త, పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులను

సాధారణ వీసా ప్రక్రియ పూర్తయ్యేలోపే తాత్కాలికంగా అమెరికాలోకి తీసుకురావడానికి అవకాశం ఉండేది.

ముఖ్యాంశాలు

• ఇది శాశ్వత వీసా కాదు

• ఇది తాత్కాలిక అనుమతి మాత్రమే

• మానవతా కారణాల మీద ఇస్తారు

• వీసా కోసం సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితిని తగ్గించడమే లక్ష్యం

ఏ విధంగా దరఖాస్తు చేసేవారు

అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యుడు ప్రభుత్వానికి దరఖాస్తు చేసేవాడు, ప్రభుత్వం అర్హత పరిశీలించి, తాత్కాలికంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు అనుమతించేది. తర్వాత వారు సాధారణ వీసా ప్రక్రియను కొనసాగించేవారు. కుటుంబాలను త్వరగా కలపడానికి ఇచ్చే తాత్కాలిక ప్రవేశ అనుమతే కుటుంబ పునర్మిళన పారోల్.

అమెరికాలో కుటుంబ పునరేకీకరణ పథకాలకు ముగింపు - Tholi Paluku