Let's talk: editor@tmv.in
అమెరికాలో ఐదేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్‌ అధికారులు

అమెరికాలో ఐదేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్‌ అధికారులు

Shaik Mohammad Shaffee
24 జనవరి, 2026

అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు టెక్సాస్‌లో ఐదేళ్ల చిన్నారిని నిర్బంధ కేంద్రానికి తరలించడంపై రాజకీయంగా పెను దుమారం రేగుతోంది. ఈ ఘటనపై అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది అత్యంత దారుణమైన చర్య అని, చిన్నారిని ఒక పావులా వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

అది క్రూరమైన చర్య: కమలా హారిస్

ఈ ఉదంతంపై కమలా హారిస్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, "ఆ పసిపిల్లాడు తన కుటుంబంతో ఇంట్లో ఉండాలి. కానీ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆ చిన్నారిని ఒక పావులా వాడుకుంటూ టెక్సాస్ నిర్బంధ కేంద్రంలో ఉంచారు. ఇది నన్ను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది, ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించాలి" అని పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలు అమెరికా విలువలకు విరుద్ధంగా ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్బంధంపై అధికారుల వివరణ

హారిస్ చేసిన విమర్శలపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ ట్రిషియా మెక్‌లాఫ్లిన్ స్పష్టతనిస్తూ.. తాము పిల్లాడిని పావులా వాడుకోలేదని స్పష్టం చేశారు. జనవరి 20న జరిగిన ఈ ఆపరేషన్ కేవలం చిన్నారి తండ్రిని అరెస్టు చేసేందుకే చేపట్టామని, అయితే ఆ సమయంలో తండ్రే పిల్లాడిని వదిలి వెళ్లారని వెల్లడించారు. ఇంట్లోనే ఉన్న పిల్లాడి తల్లికి బాధ్యతలు అప్పగించేందుకు అధికారులు పలుమార్లు ప్రయత్నించారని, ఆమెను అరెస్ట్ చేయబోమని హామీ ఇచ్చినప్పటికీ, పిల్లాడిని తీసుకునేందుకు ఆమె నిరాకరించిందని వివరించారు.

మరోవైపు, పిల్లాడి భద్రతను దృష్టిలో ఉంచుకుని తండ్రి కోరిక మేరకే వారిద్దరినీ కలిపి ఉంచామని మెక్‌లాఫ్లిన్ పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న ఆందోళనకారుల అరుపుల వల్ల పిల్లాడు భయపడటంతో, రక్షణ దృష్ట్యా తండ్రీకొడుకులను 'డిల్లే' నిర్బంధ కేంద్రానికి తరలించాల్సి వచ్చిందని తెలిపారు. అక్కడ ఆ చిన్నారికి ఇబ్బంది కలగకుండా అతడికి ఇష్టమైన ఆహారం, సంగీతం వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేశామని ఆమె సమర్థించుకున్నారు.

నిబంధనల అమలు.. వెసులుబాటు

వలస నిబంధనల అమలులో భాగంగానే ఈ చర్యలు ఉన్నాయని మెక్‌లాఫ్లిన్ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి దేశం విడిచిపోవాలా లేదా సురక్షిత వ్యక్తుల వద్ద ఉంచాలా అనే నిర్ణయాన్ని వారికే వదిలేస్తామని చెప్పారు. 'సీబీపీ హోమ్ యాప్' ద్వారా స్వచ్ఛందంగా వెళ్లే వారికి ఉచిత విమాన టికెట్‌తో పాటు 2,600 డాలర్ల ఆర్థిక సాయం అందిస్తామని, తద్వారా భవిష్యత్తులో మళ్ళీ చట్టబద్ధంగా వచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

చట్టబద్ధంగానే వచ్చాం: బాధిత కుటుంబం

మరోవైపు బాధిత కుటుంబం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఆ చిన్నారి కుటుంబం ఈక్వెడార్‌కు చెందినదని, 2024 డిసెంబరులో టెక్సాస్‌ సరిహద్దు అధికారుల వద్ద ఆశ్రయం కోసం చట్టబద్ధంగానే దరఖాస్తు చేసుకున్నారని వారి న్యాయవాది మార్క్ ప్రోకోష్ తెలిపారు. వీరు అక్రమ వలసదారులు కాదని, చట్టబద్ధ మార్గంలోనే ఉన్నారని స్పష్టం చేశారు. మరోవైపు విద్యాసంస్థల సమీపంలో ఇటువంటి ఆపరేషన్లు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని, ఇది పిల్లల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోందని ప్రీస్కూల్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

రాజకీయ రంగు పులుముకున్న వలసల వివాదం

ఈ ఉదంతం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్యను గట్టిగా సమర్థించారు. ప్రభుత్వం కేవలం నిబంధనలను ఉల్లంఘించిన తండ్రిని మాత్రమే లక్ష్యంగా చేసుకుందని, దేశ చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ సర్కార్ అమలు చేస్తున్న కఠిన ఇమిగ్రేషన్ విధానాలకు ఇది నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.