
అమెరికాలో ఉన్మాది ఘాతుకం.. ఆరుగురి కాల్చివేత
అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రంలో ఓ 24 ఏళ్ల యువకుడు ఉన్మాదంతో ఊగిపోయి తన సొంత కుటుంబ సభ్యులతో సహా ఆరుగురిని పొట్టనబెట్టుకున్నాడు. క్లే కౌంటీ పరిధిలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ కాల్పుల ఘటనలు అమెరికాను ఒక్కసారిగా వణికించాయి. మృతుల్లో ఏడేళ్ల పసిపాపతో పాటు ఒక చర్చి పాస్టర్ కూడా ఉండటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. నిందితుడిని డారికా ఎం. మూర్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
సొంత కుటుంబంపైనే తొలి దాడి
పోలీసుల కథనం ప్రకారం.. సీడర్‌బ్లఫ్ గ్రామీణ ప్రాంతంలో ఈ హింస మొదలైంది. నిందితుడు మూర్ తొలుత తన తండ్రి, మామ, సోదరుడిని అతి సమీపం నుంచి కాల్చి చంపాడు. సొంత కుటుంబీకులనే కనికరం లేకుండా హతమార్చిన నిందితుడు, అనంతరం తన సోదరుడి కారును దొంగిలించి అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. 2017లో ఎనిమిది మంది మరణించిన ఘటన తర్వాత మిసిసిపీలో జరిగిన అతిపెద్ద సామూహిక హత్యకాండ ఇదేనని అధికారులు చెబుతున్నారు.
చిన్నారిపై కనికరం లేని క్రూరత్వం
తొలి ఘాతుకం తర్వాత నిందితుడు బ్లేక్ రోడ్‌లోని మరో ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఒక మహిళపై తుపాకీ గురిపెట్టి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో కోపంతో ఊగిపోయిన మూర్.. అక్కడ ఉన్న ఏడేళ్ల బాలికను కాల్చాడు. ఆ చిన్నారి నిందితుడికి వరుసకు చెల్లెలు (సెకండ్ కజిన్) అవుతుంది. అక్కడే ఉన్న మరో ఏడేళ్ల లోపు బాబు తలపైనా తుపాకీ పెట్టి కాల్చబోయాడు. అయితే అదృష్టవశాత్తూ తుపాకీ పేలకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో మరో చిన్నారి, తల్లి కూడా ఉన్నారు.
చర్చి పాస్టర్‌ను వదలని తూటాలు
అక్కడితో ఆగని నిందితుడు కారులో సైలోమ్-గ్రిఫిత్ రోడ్‌లోని మూడవ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ నివసిస్తున్న ఇద్దరు సోదరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. మరణించిన ఆ ఇద్దరిలో ఒకరు స్థానిక చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే మూడు వేర్వేరు చోట్ల ఆరుగురిని పొట్టనబెట్టుకున్న ఈ ఉన్మాది చేష్టలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి.
పోలీసుల అదుపులో నిందితుడు
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నిందితుడు డారికా మూర్ పోలీసులకు చిక్కాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న వెంటనే అతడిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్ కేసులు నమోదు చేశారు. విచారణ పూర్తయ్యాక, నేర తీవ్రతను బట్టి ఇవి క్యాపిటల్ మర్డర్ (మరణశిక్ష పడే అవకాశం ఉన్న నేరం) గా మారే అవకాశం ఉందని క్లే కౌంటీ షెరీఫ్ ఎడ్డీ స్కాట్ వెల్లడించారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిందితుడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. క్లే కౌంటీ కోర్టు రికార్డుల ప్రకారం అతడిపై ఒక్క కేసు కూడా నమోదై లేదు. "ఈ యువకుడు ఎప్పుడూ మా నిఘా నీడలో లేడు. కానీ తన సొంత కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఏడేళ్ల చిన్నారిని చంపడానికి అసలు ఎలాంటి కారణం ఉండగలదు?" అని షెరీఫ్ ఎడ్డీ స్కాట్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు, ఒక పాస్టర్, ఒక చిన్నారి ఇలా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. "ఇది మాటల్లో చెప్పలేని పెను విషాదం. ఒకవైపు తమ వారిని కోల్పోయిన బాధ, మరోవైపు తమ కుటుంబ సభ్యుడే ఈ పని చేశాడని తెలియడం ఆ కుటుంబాలకు తట్టుకోలేని విషయం" అని అధికారులు పేర్కొన్నారు. నిందితుడు ఒక్కడే ఈ దాడులకు పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడులకు గల కచ్చితమైన కారణం ఏంటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
