
అమెరికాలో అగ్నిప్రమాదం.. హైదరాబాద్ యువతి మృతి
తెలంగాణ రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల సైబర్ సెక్యూరిటీ నిపుణురాలు అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు.సహజా రెడ్డి ఉదుమల మరణించడం కుటుంబాన్ని, తెలుగు సమాజాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది.
విజయనగరం ఆర్చ్‌బిషప్‌గా ఉన్న ఆమె మామ ఉదుమల బాలా తెలిపిన వివరాల ప్రకారం, సహజా రెడ్డి అమెరికాలో సైబర్ సెక్యూరిటీలో మాస్టర్స్ పూర్తి చేసి, అక్కడే కొన్ని నెలల క్రితం ఉద్యోగంలో చేరింది. డిసెంబరు 4 ఉదయం 11 గంటల ప్రాంతంలో (అమెరికా సమయం ప్రకారం) న్యూయార్క్ రాష్ట్రంలోని ఆల్బనీ ప్రాంతంలోని ఆమె నివాసంలో అగ్నిప్రమాదం సంభవించిందని ఆయన చెప్పారు.ఈ సంఘటనలో ఆమెకు తీవ్ర కాలిన గాయాలు కాగా, భవనంలోని మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారని ఆయన చెప్పారు.
చికిత్స కోసం ముందుగా ఆల్బనీలోని ఆసుపత్రికి తరలించిన సహజాను అనంతరం న్యూయార్క్‌కు మార్చారు. సుమారు 15 గంటల పాటు చికిత్స పొందిన ఆమె ప్రాణాలు నిలువలేదు.ఈ భవనంలో పలువురు తెలుగు విద్యార్థులు కూడా నివసిస్తున్నట్టు సమాచారం. సహజా మూడు సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. తెలంగాణలోని జనగామ జిల్లా ఆమె స్వగ్రామం కాగా, తండ్రి ఐటీ ఉద్యోగి, తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.కుటుంబ సభ్యుల తరఫున బాలా, సహజా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కష్ట సమయంలో అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ కుటుంబానికి అన్ని విధాలా సహకరిస్తోందని ఆయన తెలిపారు.
