Let's talk: editor@tmv.in
అమెరికాలో అక్రమ ఫార్మసీల గుట్టురట్టు.. 200 వెబ్‌సైట్ డొమైన్లు సీజ్

అమెరికాలో అక్రమ ఫార్మసీల గుట్టురట్టు.. 200 వెబ్‌సైట్ డొమైన్లు సీజ్

Shaik Mohammad Shaffee
6 ఫిబ్రవరి, 2026

భారత్ కేంద్రంగా సాగుతున్న ఒక భారీ అంతర్జాతీయ నేర ముఠా నెట్‌వర్క్‌ను అమెరికా ఫెడరల్ అధికారులు ఛేదించారు. అక్రమ ఆన్‌లైన్ ఫార్మసీల పేరుతో అమెరికా పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సుమారు 200కి పైగా వెబ్‌సైట్ డొమైన్‌లను డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) సీజ్ చేసింది. 'ఆపరేషన్ మెల్ట్‌డౌన్' పేరుతో చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌లో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు పలు సంచలన విషయాలను అధికారులు వెల్లడించారు.

కల్తీ మందులతో ఆరుగురి మృతి

ఈ అక్రమ ఆన్‌లైన్ ఫార్మసీలు సరఫరా చేసిన కల్తీ మందుల వల్ల అమెరికాలో ఇప్పటివరకు కనీసం ఆరుగురు మరణించగా, మరో నలుగురు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వాలిడ్ ప్రిస్క్రిప్షన్లు (వైద్యుల సూచనలు) లేకుండానే లక్షలాది ఆర్డర్లను ఈ ముఠాలు పూర్తి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. 2022 నుంచి ఈ నేరపూరిత సంస్థలపై నిఘా ఉంచిన డీఈఏ రాకీ మౌంటెన్ ఫీల్డ్ డివిజన్, ఎట్టకేలకు వీటి మూలాలను భారత్‌లో ఉన్నట్లు గుర్తించింది.

భారత ప్రభుత్వంతో కలిసి దర్యాప్తు

ఈ అంతర్జాతీయ నేర ముఠాలను పట్టుకునేందుకు అమెరికా డీఈఏ.. భారత ప్రభుత్వానికి చెందిన దర్యాప్తు సంస్థలతో కలిసి చురుగ్గా పనిచేస్తోంది. ప్రమాదకరమైన మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు, నేరగాళ్లను గుర్తించి వారి నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసేందుకు రెండు దేశాల అధికారులు ఉమ్మడి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వల్ల అమెరికన్ల ప్రజారోగ్యానికి పెను ముప్పు పొంచి ఉందని డీఈఏ ఆందోళన వ్యక్తం చేసింది.

నకిలీ ముసుగులో విషం

ఈ ఆన్‌లైన్ ఫార్మసీలు చూడ్డానికి చాలా ప్రొఫెషనల్‌గా, అమెరికాలోనే ఉన్నట్లుగా భ్రమింపజేస్తాయి. తాము ఎఫ్‌డీఏ ఆమోదించిన మందులనే అమ్ముతున్నామని నమ్మించి, అసలు మందుల స్థానంలో ఫెంటానిల్, మెథాంఫేటమిన్ వంటి ప్రమాదకర రసాయనాలతో చేసిన నకిలీ మాత్రలను సరఫరా చేస్తున్నాయి. అమాయక కస్టమర్లు తమకు అసలైన మందులే అందుతున్నాయని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

20 వేల మంది కస్టమర్లకు లేఖలు

దర్యాప్తులో భాగంగా ఈ వెబ్‌సైట్ల ద్వారా మందులు కొనుగోలు చేసిన వేలమంది కస్టమర్లను అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు సుమారు 20,000 మందికి పైగా పౌరులకు డీఈఏ లేఖలు పంపింది. జనవరి 27 నుంచి దేశవ్యాప్తంగా సాగిన ఈ దాడుల్లో నలుగురిని అరెస్ట్ చేయడంతో పాటు ఐదు ఇమ్మీడియట్ సస్పెన్షన్ ఆర్డర్లు (ఐఎస్ఓ) జారీ చేశారు.