
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 30 మంది భారతీయుల అరెస్ట్
అమెరికాలో అక్రమంగా నివసిస్తూ భారీ సెమీ-ట్రక్కులు నడుపుతున్న 30 మంది భారతీయులను అమెరికా సరిహద్దు భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులు కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఎల్ సెంట్రో సెక్టార్‌లో వాహన తనిఖీల సమయంలో జరిగాయని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) తెలిపింది.
అసలేం జరిగింది?
నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగిన తనిఖీల్లో మొత్తం 42 మంది అక్రమ వలసదారులు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌లతో ట్రక్కులు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 30 మంది భారతీయులు కాగా, మిగతావారు ఎల్ సాల్వడార్, చైనా, హైటి, మెక్సికో, రష్యా, సోమాలియా, టర్కీ, ఉక్రెయిన్ వంటి దేశాలకు చెందినవారు.
ఈ డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఎక్కువ భాగం కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి జారీ అయినవే. కొన్నింటిని ఫ్లోరిడా, న్యూయార్క్, పెన్సిల్వేనియా, ఇల్లినాయ్ వంటి ఇతర రాష్ట్రాలు ఇచ్చాయి. అయితే, అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారికి ఈ లైసెన్స్‌లు ఎలా జారీ అయ్యాయన్న అంశంపై విమర్శలు వస్తున్నాయి.
డిసెంబర్ 10, 11 తేదీల్లో ‘ఆపరేషన్ హైవే సెంటినల్’ పేరుతో ప్రత్యేకంగా చేపట్టిన సంయుక్త దాడుల్లో మరో 45 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో కూడా పలువురు భారతీయులు పట్టుబడ్డారు. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని కమర్షియల్ ట్రక్కింగ్ కంపెనీలనే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించారు.
ఇటీవలి కాలంలో జరిగిన ప్రమాదాలు ఇవే!
అమెరికాలో అక్రమంగా ఉంటూ ట్రక్కులు నడుపుతున్న కొందరు భారతీయుల వల్ల జరిగిన ఘోర ప్రమాదాలను అక్కడి అధికారులు ఉదాహరణలుగా చూపారు. రాజిందర్ కుమార్ అనే వ్యక్తి నడిపిన ట్రక్కు ఢీకొని ఇద్దరు అమెరికన్లు ప్రాణాలు కోల్పోగా, హర్జిందర్ సింగ్ వల్ల ఫ్లోరిడాలో ముగ్గురు మరణించారు. అలాగే జషన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి మద్యం మత్తులో ట్రక్కు నడిపి మరో ముగ్గురి మరణానికి కారణమయ్యాడు. కాలిఫోర్నియాలో ప్రతాప్ సింగ్ చేసిన ప్రమాదం వల్ల ఒక ఐదేళ్ల చిన్నారి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఇలాంటి ఘటనల వల్లే అక్రమంగా నివసిస్తూ డ్రైవింగ్ చేస్తున్న వారిపై ప్రభుత్వం ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటోంది.
సీబీపీ అధికారులు మాట్లాడుతూ, అక్రమ వలసదారులు భారీ ట్రక్కులు నడపడం అమెరికా రహదారి భద్రతకు పెద్ద ముప్పుగా మారిందని చెప్పారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా అమెరికా రహదారులను సురక్షితంగా మారుస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనలతో అక్రమ వలస, లైసెన్స్‌ల జారీ విధానం, రహదారి భద్రతపై అమెరికాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
