
అమెరికాపై లేని విమర్శలు మాపై ఎందుకు?
ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలపై ఇజ్రాయెల్ చేసిన దాడిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిలో ఖతార్ భద్రతా సిబ్బంది సహా ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో హమాస్ ముఖ్య నేతతో పాటు చర్చల్లో కీలకంగా వ్యవహరించే వ్యక్తి కూడా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. బందీల విడుదల, యుద్ధం ముగింపు కోసం ప్రయత్నిస్తుంటే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించుకున్నారు. బిన్ లాడెన్ విషయంలో అమెరికా చేసిందే తామూ చేశామని, అమెరికాపై లేని విమర్శలు తమపై ఎందుకని ప్రశ్నించారు.
నెతన్యాహుకు ట్రంప్ ఫోన్ కాల్
ఈ దాడిపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఇజ్రాయెల్, గాజా సమస్యల పరిష్కారంలో ఖతార్ మధ్యవర్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. ఈ ఘటన అనంతరం ట్రంప్ నెతన్యాహుకు ఫోన్ చేసి ఆరా తీసినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. ఫోన్ సంభాషణలో ట్రంప్ ఈ దాడులు విజయవంతమయ్యాయా అని ప్రశ్నించగా, దానికి నెతన్యాహు "తెలియదు" అని సమాధానమిచ్చారు. ఈ దాడుల గురించి తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇజ్రాయెల్, గాజా యుద్దం ఆపడం, శాంతి బహుమతి సాధించడం తన లక్ష్యమని ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో శాంతియుతంగా జరగాల్సిన చర్చలను తాజా దాడులు కష్టతరంగా మార్చాయి.
ఖతార్ విదేశాంగ శాఖ ఆగ్రహం
ఈ దాడిని సమర్థించుకునేందుకు నెతన్యాహూ, అమెరికా 9/11 తర్వాత చేపట్టిన చర్యల్ని ప్రస్తావించారు. అల్ ఖైదాపై అమెరికా ఎలా ప్రతీకారం తీర్చుకుందో, తామూ అదే చేసినట్లు చెప్పారు. బిన్ లాడెన్‌ను చంపినప్పుడు ఎవరు తప్పుపట్ట లేదని, ఇప్పుడు ఇజ్రాయెల్‌ను ఎందుకు విమర్శిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే సహించేది లేదని, వారిని అప్పగించకపోతే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నెతన్యాహు వ్యాఖ్యలపై ఖతార్ విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్, అమెరికా కోరితేనే ఖతార్‌లో హమాస్‌కు కార్యాలయం ఇచ్చినట్లు గుర్తు చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం మధ్య వర్తిత్వం కూడా చేస్తున్నామని స్పష్టం చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ తమను ఉగ్రవాదులకు మద్దతుదారులుగా చిత్రీకరించడం ఏమిటని ప్రశ్నించింది. ఈ దాడి, మాటలు రెండు కూడా ఖతార్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడింది. ఇజ్రాయెల్ చర్యలపై పశ్చిమ దేశాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య మధ్యవర్తిత్వానికి కీలకంగా వ్యవహరిస్తున్న ఖతార్‌పై దాడి జరగడంతో చర్చలపై తీవ్ర ప్రభావం పడింది. ఖతార్ ఇప్పటికే నెతన్యాహుకు కఠిన పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యుద్దం ఇప్పట్లో ముగిసేలా లేదని స్పష్టం అవుతోంది.
