Let's talk: editor@tmv.in
అమెరికా-దక్షిణ కొరియా అణు జలాంతర్గామి డీల్‌పై ఉత్తర కొరియా తీవ్ర హెచ్చరిక

అమెరికా-దక్షిణ కొరియా అణు జలాంతర్గామి డీల్‌పై ఉత్తర కొరియా తీవ్ర హెచ్చరిక

Shaik Mohammad Shaffee
19 నవంబర్, 2025

దక్షిణ కొరియా అణుశక్తితో నడిచే జలాంతర్గాములను నిర్మించడానికి అమెరికా ఆమోదం తెలపడంపై ఉత్తర కొరియా మంగళవారం తీవ్రంగా స్పందించింది. ఈ చర్య కొరియా ద్వీపకల్పంతో పాటు ఆసియా ప్రాంతమంతా అణు డొమినో దృగ్విషయానికి దారితీస్తుందని హెచ్చరించింది. ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ద్వారా ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. గత వారం విడుదలైన, దక్షిణ కొరియా-యూఎస్ మధ్య కుదిరిన వాణిజ్యం, భద్రతా ఒప్పందాలకు సంబంధించిన ఉమ్మడి ప్రకటనను ప్యాంగ్యాంగ్ తీవ్రంగా ఖండించింది. ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య శత్రు వైఖరిని బయటపెట్టాయని ఆరోపించింది.

యూఎస్-దక్షిణ కొరియా ఒప్పందం ఏమిటి?

గత నెలలో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశంలో కుదిరిన ఒప్పంద వివరాలను రెండు దేశాలు శుక్రవారం వెల్లడించాయి. ఇందులో ఉత్తర కొరియా అణు ఆయుధాలను నిర్వీర్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వైట్‌హౌస్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో, అమెరికా దక్షిణ కొరియా అణు శక్తి సబ్ మెరైన్లను నిర్మించేందుకు అనుమతి ఇచ్చిందని, ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఇంధనం సహా ఇతర అంశాలపై సన్నిహితంగా సహకరిస్తామని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, భారత్ లకే అణు శక్తితో నడిచే వ్యూహాత్మక సబ్ మెరైన్లు ఉన్నాయి.

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ మాట్లాడుతూ ఈ జలాంతర్గాములు చైనా నౌకాదళాన్ని ఎదుర్కోవడంలో అలాగే అణు సామర్థ్యం పెంచుకుంటున్న ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ముప్పును నిరోధించడంలో కీలకమని పేర్కొన్నారు.

ఉత్తర కొరియా ఆందోళన

ఉత్తర కొరియా ఈ చర్యను తమ భద్రతకు తీవ్ర ముప్పుగా పరిగణించింది. ఈ ఒప్పందంతో పాటు రెండు దేశాలు కలిసి నిర్వహించిన భారీ స్థాయి సైనిక విన్యాసాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయని ఆరోపించింది. అణు జలాంతర్గామిని సొంతం చేసుకోవడం అనేది దక్షిణ కొరియా 'సొంత అణ్వాయుధీకరణకు' ఒక వ్యూహాత్మక చర్య అని ఉత్తర కొరియా ఆరోపించింది.

ఒక దేశం అణు సామర్థ్యాన్ని పెంచుకుంటే, దానికి పోటీగా పొరుగు దేశాలు కూడా అదే బాట పట్టడం వల్ల ఆయుధ పోటీ చెలరేగుతుందని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఈ ఒప్పందం ద్వారా యూఎస్, దక్షిణ కొరియా తమ శత్రుత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు రుజువైందని ఉత్తర కొరియా పేర్కొంది.

దక్షిణ కొరియా వివరణ

దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి కాంగ్ యూ-జంగ్ స్పందిస్తూ, తమకు ఉత్తర కొరియా పట్ల ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. యూఎస్‌తో తాము చేసుకున్న సహకారం కేవలం జాతీయ భద్రతా ప్రయోజనాలను రక్షించుకోవడానికి మాత్రమే ఉద్దేశించినదని తెలిపారు.

అయితే అమెరికా తమను ఒక అణు రాజ్యంగా గుర్తించనంత కాలం, కిమ్ జోంగ్ ఉన్ నాయకత్వంలోని ఉత్తర కొరియా వాషింగ్టన్‌తో చర్చల్లో పాల్గొనడానికి సుముఖంగా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో గతంలో మూడు సార్లు సమావేశమైనప్పటికీ, ఇద్దరి మధ్య ఎలాంటి అణు ఒప్పందం కుదరలేదు.