Let's talk: editor@tmv.in
అమెరికాతో పాకిస్థాన్ కీలక రక్షణ ఒప్పందం

అమెరికాతో పాకిస్థాన్ కీలక రక్షణ ఒప్పందం

Yekkirala Akshitha
9 అక్టోబర్, 2025

ఆయుధాల కొనుగోలు, రక్షణపరమైన అంశాల్లో దాయాది పాకిస్థాన్ దూకుడుగా వ్యవహరిస్తోంది. కొన్ని రోజుల క్రితం సౌదీ అరేబియాతో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న పాక్ తాజాగా అమెరికాతోనూ మరో ఆయుద ఒప్పందం చేసుకోబోతున్నది. ఈ మేరకు అమెరికా రక్షణశాఖ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వాషింగ్టన్ నుంచి ఏఐఎం -120 అడ్వాన్స్‌డ్ మీడియం-రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైళ్లు ఇస్లామాబాద్‌కు చేరుకోనున్నాయి. మే 2030 నాటికి ఈ మిసైళ్లు పాకిస్థాన్ కు చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇటువంటి మిసైళ్లు పాకిస్థాన్‌తో పాటు మరో 35 దేశాలకు అమెరికా విక్రయించబోతున్నట్టు సమాచారం.

ఇరు దేశాల అధ్యక్షులు భేటీ తర్వాత

కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మధ్య జరిగిన సమావేశం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఈ ఒప్పందం మొత్తం విలువ 2.51 బిలియన్ డాలర్లు‌పైగా ఉంటుందని ఒక అంచనా. ఈ మిసైళ్ల ఉత్పత్తి అరిజోనాలోని టక్సన్‌లో జరగనున్నది. పాకిస్థాన్‌తోపాటు యునైటెడ్ కింగ్‌డమ్, పోలాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమన్, జపాన్, నార్వే, హంగరీ, దక్షిణ కొరియా, తైవాన్, లిథువేనియా వంటి దేశాలు కూడా ఈ ఒప్పందంలో భాగస్వామ్యంగా ఉన్నాయి.

గతంలోనూ పాక్ తో ఒప్పందాలు

కొత్త ఒప్పందానికి సంబంధించిన కచ్చితమైన సంఖ్యలు ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ.. పాకిస్తాన్ గతంలో 2006 ఒప్పందం కింద యునైటెడ్ స్టేట్స్ ఏఐఎం-120సీ-5 ఏఎంఆర్ఏఏఎం మిసైళ్లను కొనుగోలు చేసింది. మొదటి దశలో 2010లో ఈ మిసైళ్లు పాకిస్థాన్‌కు చేరుకున్నాయి.

ఇవి పాకిస్తాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌లకు అమర్చడానికి ఉద్దేశించబడ్డాయి. ఏఐఎం-120డీ-3 వేరియంట్ ఒప్పందం కింద రాబోయే అధునాతన ఆయుధాలు పాకిస్తాన్ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయనున్నాయి. అయితే మిసైళ్ల సంఖ్యపై ఇంకా కచ్చితమైన సమాచారం లేదు. పాకిస్తాన్ తన ఎఫ్-16 ఫైటర్ జెట్‌లను అప్‌గ్రేడ్ చేయాలని చూస్తోంది. ఎందుకంటే ఏఐఎం-120 ఏఎంఆర్ఏఏఎమ్ మిసైళ్లు ప్రత్యేకంగా ఈ విమానాలకు అనుకూలంగా ఉంటాయి.

పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్ 1950ల నుండి రక్షణ సహకారాన్ని కొనసాగిస్తున్నాయి. మ్యూచువల్ డిఫెన్స్ అసిస్టెన్స్ ఒప్పందం కింద ఒప్పందాలు జరిగాయి. సైనిక సామగ్రి, శిక్షణ పాకిస్థాన్‌కు అందింది. సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో ఆపరేషన్ సైక్లోన్ కింద ఎఫ్-16 ఫైటర్ జెట్ విక్రయాలతో సహా మద్దతు పెరిగింది.

అమెరికాతో పాకిస్థాన్ కీలక రక్షణ ఒప్పందం - Tholi Paluku