
అమెరికాతో చర్చల ప్రసక్తే లేదు: ఇరాన్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ క్లిష్ట సమయంలో అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారీజానీ సోమవారం కుండబద్దలు కొట్టారు. ఒమన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ తిరిగి వాషింగ్టన్‌తో సంప్రదింపులు జరపనుందంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ఈ ప్రాంతాన్ని అరాచకంలోకి నెట్టేస్తున్నాయని లారీజానీ మండిపడ్డారు.
‘అమెరికా ఫస్ట్’ కాదు.. ‘ఇజ్రాయెల్ ఫస్ట్’
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై లారీజానీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "తన స్వయంకృత 'అమెరికా ఫస్ట్' నినాదాన్ని ట్రంప్ 'ఇజ్రాయెల్ ఫస్ట్'గా మార్చేశారు. ఇజ్రాయెల్ అధికార దాహం కోసం అమెరికా సైనికుల ప్రాణాలను బలి ఇస్తున్నారు" అని ఆయన విమర్శించారు. ఇరాన్ ఏనాడూ దూకుడుగా వ్యవహరించలేదని, ప్రస్తుతం తమ దేశం తనను తాను రక్షించుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా సైనికుల మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ ఆయన పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.
రంగంలోకి తాత్కాలిక నాయకత్వ మండలి
ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌లో పాలనా పగ్గాలను 'తాత్కాలిక నాయకత్వ మండలి' చేపట్టింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, జుడీషియరీ చీఫ్ ఘోలమ్ హొస్సేన్ మొహ్సేని-ఎజీ, అయతుల్లా అలీరెజా అరాఫీ సమక్షంలో ఈ మండలి రెండోసారి భేటీ అయింది. కొత్త సుప్రీం లీడర్ ఎన్నికయ్యే వరకు ఈ మండలి దేశ వ్యవహారాలను పర్యవేక్షించనుంది. అమెరికా-ఇజ్రాయెల్ చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ/రోరింగ్ లయన్'లో ఖమేనీతో పాటు పలువురు ఉన్నత భద్రతా అధికారులు మరణించడంతో ఈ అత్యవసర మండలిని ఏర్పాటు చేశారు.
అంతర్యుద్ధానికి ట్రంప్ పిలుపు
ఇరాన్ గడ్డపై దాడులు కొనసాగుతుండగానే, అక్కడి ప్రజలను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ఇరాన్ ప్రజలకు దొరికిన ఏకైక అవకాశం ఇదని, ఇటువంటి అవకాశం మళ్లీ రాకపోవచ్చని ఆయన శనివారం పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్‌లోని 24 ప్రావిన్సులపై జరిగిన దాడుల్లో ఇప్పటివరకు కనీసం 201 మంది మరణించినట్లు అల్ జజీరా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
