
అమెరికాకు తగ్గుతున్న చైనా ఎగుమతులు
చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. సెప్టెంబర్‌లో గతేడాదితో పోలిస్తే 27 శాతం ఎగుమతులు తగ్గాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా చైనా ఎగుమతులు ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సోమవారం విడుదలైన కస్టమ్స్ గణాంకాల ప్రకారం చైనా ప్రపంచ ఎగుమతులు 328.5 బిలియన్ డాలర్లకు చేరి, గతేడాదితో పోలిస్తే 8.3 శాతం పెరిగాయి. ఇది ఆర్థికవేత్తల అంచనాలను మించిపోయింది. ఆగస్టులో ఈ పెరుగుదల 4.4 శాతంగా ఉంది. దిగుమతులు కూడా 7.4 శాతం పెరిగాయి. ఇది ఆగస్టులో 1.3 శాతం పెరుగుదల కంటే గణనీయంగా ఎక్కువ అని స్పష్టమవుతోంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ బలహీనత, రియల్ ఎస్టేట్ రంగం క్షీణత వంటివి ఎగుమతులు, దిగుమతులను ప్రభావితం చేస్తున్నాయి.
ఆరు నెలల్లో 33 శాతం తగ్గుదల
అమెరికాకు చైనా ఎగుమతులు గత ఆరు నెలలుగా తగ్గుతున్నాయి. ఆగస్టులో ఇవి 33 శాతం పడిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు, తయారీదారులను అమెరికాకు తరలించాలనే లక్ష్యంతో కొత్త సుంకాలు, ఇతర ప్రతీకార చర్యలతో ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో చైనా తన ఉత్పత్తులకు ఇతర ప్రాంతాల్లో మార్కెట్లను విస్తరించింది. సెప్టెంబర్‌లో ఆగ్నేయ ఆసియాకు ఎగుమతులు 15.6 శాతం, లాటిన్ అమెరికాకు 15 శాతం, ఆఫ్రికాకు 56 శాతం పెరిగాయి. చైనా కస్టమ్స్ ఏజెన్సీ ఉపమంత్రి వాంగ్ జున్ మాట్లాడుతూ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని, వాణిజ్యంలో అనిశ్చితి, సవాళ్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాల్గవ త్రైమాసికంలో వాణిజ్యాన్ని స్థిరీకరించడానికి మరింత కృషి చేయాలన్నారు. చైనా ఎగుమతులు తక్కువ ధరలు, ప్రత్యామ్నాయ ఎంపికల కొరత వల్ల ఇప్పటికీ బలంగా ఉన్నాయని నాటిక్స్ సీనియర్ ఆర్థిక వేత్త గ్యారీ ఎన్జీ పేర్కొన్నారు. కానీ సుంకాల పెంపు కంటే ఎగుమతుల నియంత్రణలు ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. సరఫరా గొలుసులను అడ్డుకునే నియంత్రణలు పెరిగితే, దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ఇటీవల ట్రంప్ చైనా వస్తువులపై 100 శాతం అదనపు సుంకం విధిస్తామని, కీలక సాఫ్ట్‌వేర్‌పై ఎగుమతి నియంత్రణలు విధిస్తామని బెదిరించారు. దీనికి ప్రతిగా చైనా అమెరికా నౌకలపై కొత్త పోర్ట్ ఫీజులను ప్రకటించింది. అమెరికా సైతం చైనా నౌకలపై పోర్ట్ ఫీజులు విధించాలని ప్రణాళికలు రూపొందిస్తుండటంతో, చైనా లిథియం ఐయాన్ బ్యాటరీలు, అరుదైన ఖనిజాల ఎగుమతులపై నియంత్రణలు పెంచుతోంది. ఈ ఘటనలన్నీ అక్టోబర్ చివరలో జరగాల్సిన ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశానికి ఇబ్బందులు ఏర్పరుస్తున్నాయి.
పోర్టు ఫీజుల పెంపుతో తీవ్ర నష్టాలు
ఏ దేశమైనా తన సముద్ర తీరంలోని నౌకాశ్రయాలను వినియోగించుకునే విదేశీ నౌకలపై చార్జీలు వసూలు చేస్తుంది. దీనినే పోర్టు ఫీజులు అంటారు. ఈ ఫీజు ధర సాధారణంగా నౌకలు ఉపయోగించే సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది. డాక్ వద్ద నిలిపి ఉంచడం, సరుకు ఎక్కించడం, దింపడం, నౌక నిర్వహణ సేవలు, భద్రతా పర్యవేక్షణ మొదలైనవి దీని పరిధిలోకి వస్తాయి. చైనా అమెరికా నౌకలపై కొత్త పోర్ట్ ఫీజులు ప్రకటించిన నేపథ్యంలో అమెరికన్ రిజిస్ట్రేషన్ గల నౌకలు చైనా పోర్టులను ఉపయోగిస్తే, వాటికి అదనపు చార్జీలు వసూలు చేస్తారు. దీంతో అమెరికా కంపెనీల ఖర్చులు పెరుగుతాయి. అమెరికా నౌకలు చైనా పోర్టుల్లో సరుకు ఎక్కించడానికి, దింపడానికి ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా రవాణా ఖర్చు పెరిగి లాభాలు తగ్గుతాయి. ఇది అమెరికా చైనా నుండి దిగుమతి చేసుకునే కంపెనీలు, చైనాకు ఎగుమతి చేసే వ్యాపారాలపై ప్రభావం చూపుతుంది. చైనా నిర్ణయంతో అమెరికా వ్యాపారాల కోసం ఇతర దేశాల పోర్టుల వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది.
ప్రధాన ఎగుమతులు ఇవే
వాణిజ్య గణాంకాల ప్రకారం చైనా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వాటిలో ఎలక్ట్రానిక్ పరికరాలు అతి పెద్ద వాటా కలిగి ఉన్నాయి. వీటిలో కంప్యూటర్లు, టెలీఫోన్లు, బ్యాటరీలు, ఇతర ఎలక్ట్రానిక్ భాగాలున్నాయి. వీటితో పాటు మెషినరీ భాగాలు, యంత్రాలు, రియాక్టర్లు, బాయిలర్లు, ఫర్నీచర్, ఇంటీరియర్ డెకార్ వస్తువులు, లైటింగ్ ఉపకరణాలు
భారీ ఎత్తున ఎగుమతి అవుతుంటాయి. క్రీడా సంబంధిత పరికరాలు, ఆట బొమ్మలు, ప్లాస్టిక్ పదార్థాలు, ప్లాస్టిక్ భాగాలు, దుస్తులు సైతం ఎగుమతి అయ్యేవి. ప్రస్తుత వాణిజ్య పరిస్థితుల నేపథ్యంలో పలు ఉత్పత్తుల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. వీటిలో దుస్తులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, యంత్ర భాగాలు, ఫర్నీచర్ వర్గాల్లో ఎగుమతులు తగ్గినట్లు తెలుస్తోంది.
సుంకాల పెంపుతో ప్రభావం
ప్రస్తుతం చైనా ఎగుమతులపై అమెరికా 50 నుంచి 60 శాతం మధ్య సుంకాలు వసూలు చేస్తోంది. ట్రంప్ చైనా ఉత్పత్తులపై వంద శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సుంకాల పెంపు, చైనా ఎగుమతుల తగ్గుదల వంటివి అమెరికాపై పలు మార్గాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉత్పత్తుల ధరలు పెరిగి వినియోగదారులకు భారంగా మారనుంది. చైనా ఉత్పత్తులపై సుంకాల పెంపుతో ఆ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం ఆర్థిక భారంగా మారుతుంది. ఫలితంగా స్థానికంగా ఆయా వస్తువుల ధరలు పెరిగి, వినియోగదారులకు కొనుగోలు ఖర్చు తీవ్రమవుతుంది. కొన్ని కంపెనీలు చైనా ఉత్పత్తుల స్థానంలో ఇతర దేశాల ఉత్పత్తులను వాడినా, రవాణా, నాణ్యత మార్పులతో ధరపై ప్రభావం ఉంటుంది. అమెరికాలో వివిధ ముడి సరుకుల లభ్యత, వస్తు సరఫరా ఆలస్యమై పలు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చైనా ఉత్పత్తులపై ఆధారపడి ఉన్న అమెరికన్ కంపెనీల లాభాలు తగ్గిపోతాయి. ఇది ఉత్పత్తి, ఉద్యోగాలపై ప్రభావం చూపుతుంది. మరోవైపు అమెరికా స్థానికంగా యాంత్రిక భాగాలు, ఎలక్ట్రానిక్ కంపెనీల స్థాపనకు ప్రయత్నించే అవకాశం ఉంది. అలాగే స్థానిక ఉత్పత్తులను వినియోగించాలనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేయవచ్చు.
ఇతర దేశాలకు ఎగుమతులతో లాభనష్టాలు
చైనా తన ఎగుమతులను ఇతర దేశాలకు పెంచితే కొన్ని ప్రయోజనాలతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి. చైనా అమెరికాపై ఆధారపడటం తగ్గించి ఇతర దేశాలతో వ్యాపారం పెంచుకుంటే అమెరికాతో సమస్యలు వచ్చినా పెద్దగా నష్టం ఉండదు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా వంటి ప్రాంతాల్లో చైనా ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల ఎగుమతుల మొత్తం పెరిగి ఆదాయం రెట్టింపవుతుంది. చైనా ఉత్పత్తులు తక్కువ ధరల్లో లభిస్తాయి కాబట్టి ఇతర దేశాల్లో స్థానిక ఉత్పత్తిదారులతో సులభంగా పోటీపడే అవకాశం ఉంది. దేశాల మధ్య దూరాల నేపథ్యంలో చైనా వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న దేశాలతో నేరుగా వ్యాపారం జరపకుండా మధ్యలో మరో దేశం ద్వారా సరుకులు రవాణా చేయాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధనలు పాటించడంలో పొరపాటు జరిగితే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దూరంగా ఉన్న దేశాలకు సరుకులు పంపడం వల్ల రవాణా ఖర్చులు పెరగడంతో పాటు, సమయం ఎక్కువై లాభాలు తగ్గిపోతాయి. చైనా ఎగుమతులు పెంచే దేశాలు కూడా సుంకాల విషయంలో కఠిన నిబంధనలు తీసుకురావచ్చు. ఇది వ్యాపారాన్ని కష్టతరం చేస్తుంది. చైనా ఉత్పత్తులు ఎక్కువగా పోటీ ఇస్తే, ఆ దేశాల్లోని స్థానిక తయారీదారులు ప్రభుత్వాల ద్వారా చైనాపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఇదే సమయంలో ట్రంప్ చైనా ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు అమలు చేస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రంగా మారుతుంది. ఇది ఈ రెండు దేశాలతో పాటు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతుంది.
చైనా, అమెరికా మధ్య వాణిజ్య ఘర్షణలు ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ట్రంప్ సుంకాలు పెంచుతుండటంతో చైనా ఎగుమతులు తగ్గుతున్నాయి. ఈ వాణిజ్య వ్యవహారాలను భారత్ ఆసక్తికరంగా గమనిస్తోంది. ఇప్పుడు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. ఉత్పత్తి, సరఫరా మార్గాలు, ఆర్థిక స్థిరత్వం, వాణిజ్య ఒప్పందాలు వంటి వాటిలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. మొత్తం పరిశ్రమ విధానాలు, ప్రత్యేక ఆర్థిక విభాగాలు, మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులతో చైనా ప్రపంచ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారింది. ఈ విధానాలు చైనా ఎగుమతులను 30 శాతం పెంచాయి. భారత్‌కు 'మేక్ ఇన్ ఇండియా' వంటి పథకాలున్నాయి. కానీ, వాటిని స్థానిక సరఫరా గొలుసులతో అనుసంధానం చేయాలి. చిన్న, మధ్య తరహా సంస్థలకు ఈ గొలుసుల్లో స్థానం ఇవ్వాలి. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్‌లో స్థానిక భాగాలు పెంచితే, అమెరికా సుంకాల నుంచి ప్రయోజనం పొందవచ్చు. అమెరికా సుంకాలు పెరిగిన తర్వాత చైనా ఎగుమతులను ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వైపు మళ్లించింది. దీని వల్ల చైనా ప్రపంచ ఎగుమతులు 8.3 శాతానికి పెరిగాయి. భారత్ సైతం ఎగుమతులను అమెరికా, యూరప్‌కు మాత్రమే పరిమితం చేయకూడదు. ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో కొత్త మార్కెట్లు తెరవాలి. చైనా తన కరెన్సీని వ్యూహాత్మకంగా నియంత్రించి, ఎగుమతుల పోటీతత్వాన్ని కాపాడుకుంది. సుంకాలు పెరిగినా, తక్కువ ధరలతో పోటీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్ రూపాయి విలువలో స్థిరత్వం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం ముఖ్యం. ఇది విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. మరోవైపు చైనా పోర్టు ఫీజులు పెంచినట్లు భారత్ కూడా వాణిజ్య సమతుల్యత కోసం ప్రత్యేక విధానాలు రూపొందించాలి. చైనా, అమెరికా వాణిజ్య యుద్ధంతో బహుళజాతి కంపెనీలు ఉత్పత్తిని భారత్, వియత్నాం వైపు మళ్లిస్తున్నాయి. చైనా నుంచి 15 నుంచి 20 శాతం వరకు మార్పు జరుగుతోంది. ఈ మార్పును భారత్ వివేకంగా వినియోగించుకోవాలి. చైనా ప్రత్యామ్నాయంగా మాత్రమే కాకుండా, సొంత ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయాలి. అమెరికా, యూరప్, చైనాతో సమతుల్య సంబంధాలు కొనసాగించాలి. భారత్‌ను సైతం అమెరికా సుంకాల పేరుతో బెదిరింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో ఈ మేరకు భారత్ వేగంగా చర్యలు తీసుకుంటే ఎలాంటి ఒత్తిళ్లనైనా జయిస్తూ, వేగవంతంగా బలమైన ఆర్థిక శక్తిగా ఎదగవచ్చు.
