Let's talk: editor@tmv.in
అమెరికాకు కీలక ఖనిజాల ఎగుమతికి చైనా గ్రీన్ సిగ్నల్

అమెరికాకు కీలక ఖనిజాల ఎగుమతికి చైనా గ్రీన్ సిగ్నల్

Shaik Mohammad Shaffee
10 నవంబర్, 2025

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ అమెరికాకు గాలియం, జెర్మేనియం వంటి కీలకమైన ద్వంద్వ వినియోగ పదార్థాల ఎగుమతి నియంత్రణ చర్యలలో కొంత భాగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఇటీవల ఇరు దేశాధినేతల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఫలితంగా చూడవచ్చు.

చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ తాత్కాలిక నిలిపివేత 2024 నాటి ప్రకటన నంబర్ 46 యొక్క రెండవ నిబంధనకు వర్తిస్తుంది. ఈ నిబంధన గతంలో ఈ ముఖ్యమైన పదార్థాలను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని ప్రధానంగా నిషేధించింది.

ఈ తాత్కాలిక ఉపశమనం ముఖ్యంగా గాలియం, జెర్మేనియం, ఆంటిమోనీ, సూపర్‌హార్డ్ మెటీరియల్స్ వంటి కీలక ఖనిజాలకు వర్తిస్తుంది. సెమీకండక్టర్లు, ఫైబర్ ఆప్టిక్స్, రక్షణ పరికరాల తయారీలో ఈ ఖనిజాలు అత్యంత కీలకం. ఈ నిబంధనను నవంబర్ 9, 2025 నుండి నవంబర్ 27, 2026 వరకు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నిలిపివేత కేవలం రెండవ నిబంధన కింద ఉన్న లైసెన్సింగ్, సమీక్షా పరిమితులను మాత్రమే ప్రభావితం చేస్తుంది. అయితే, అమెరికా సైనిక వినియోగదారులకు, సైనిక అవసరాల కోసం ద్వంద్వ వినియోగ వస్తువుల ఎగుమతిని నిషేధించే మొదటి నిబంధన మాత్రం యథాతథంగా అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

గ్లోబల్ టైమ్స్ ప్రకారం, 2024 డిసెంబర్‌లో చైనా ఎగుమతి నియంత్రణ చట్టం కింద విడుదలైన ప్రకటనలో చైనాకు చెందిన ద్వంద్వ వినియోగ వస్తువులను అమెరికా సంస్థలకు నిబంధనలను ఉల్లంఘిస్తూ బదిలీ చేసే ఏ సంస్థ లేదా వ్యక్తి అయినా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

అక్టోబర్ 30న దక్షిణ కొరియాలోని బుసాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఇరు దేశాల మధ్య ఒక ముఖ్యమైన వాణిజ్య, ఆర్థిక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఫలితంగానే తాజా ఎగుమతి ఆంక్షల ఉపసంహరణ జరిగింది.

వైట్ హౌస్ నవంబర్ 1న విడుదల చేసిన వివరాల ప్రకారం, ఈ ఒప్పందం కింద చైనా అరుదైన ఖనిజాలు, ఇతర ముఖ్యమైన పదార్థాల ఎగుమతి నియంత్రణలను నిలిపివేయడానికి, మార్చి 4 నుండి అమెరికా ఉత్పత్తులపై విధించిన ప్రతికార టారిఫ్‌లు, టారిఫ్-యేతర చర్యలను ముగించడానికి, అలాగే అమెరికా సోయాబీన్లు, జొన్న, కలప ఉత్పత్తుల భారీ స్థాయి కొనుగోళ్లను పునఃప్రారంభించడానికి అంగీకరించింది. అలాగే తమ దేశంలోని నెక్స్‌పెరియా ప్లాంట్ల నుండి వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడానికి, సెమీకండక్టర్ సరఫరా గొలుసులోని అమెరికా కంపెనీలను లక్ష్యంగా చేసుకున్న దర్యాప్తులను నిలిపివేయడానికి కూడా చైనా అంగీకరించింది.

దీనికి ప్రతిగా, అమెరికా చైనాపై విధించిన ఫెంటనిల్ నియంత్రణకు సంబంధించిన కొన్ని దిగుమతి సుంకాలను ఈ సంవత్సరం నవంబర్ 10 నుంచి 10 శాతం తగ్గిస్తుంది. సెక్షన్ 301 సుంక మినహాయింపులను వచ్చే ఏడాది నవంబర్ 10 వరకు పొడిగిస్తుంది. సముద్ర, నౌకా నిర్మాణ రంగాలపై జరుగుతున్న దర్యాప్తులకు సంబంధించిన ప్రతీకార చర్యలను ఒక సంవత్సరం పాటు నిలిపివేస్తుంది.

అసలేంటి వివాదం?

చైనా–అమెరికా మధ్య ఉన్న ఈ వివాదం ప్రధానంగా టెక్నాలజీ, వాణిజ్య ఆధిపత్యం చుట్టూ తిరుగుతోంది. 2018లో అమెరికా చైనా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించడంతో వాణిజ్య యుద్ధం మొదలైంది. అమెరికా, చైనా కంపెనీలు అమెరికా టెక్నాలజీని సైనిక ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నాయని ఆరోపించి, చిప్ ఎగుమతులను నిలిపివేసింది. దానికి ప్రతిగా చైనా గాలియం, జెర్మేనియం, గ్రాఫైట్ వంటి కీలక పదార్థాలపై ఎగుమతి నియంత్రణలు పెట్టింది. ఈ పదార్థాలు చిప్ తయారీకి అవసరమైనవిగా ఉండటంతో ప్రపంచ టెక్ రంగం దెబ్బతింది. అయితే ఇటీవల అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే చైనా గాలియం, జెర్మేనియం ఎగుమతి నిషేధాలను తాత్కాలికంగా నిలిపివేయడానికి అంగీకరించింది.

అమెరికాకు కీలక ఖనిజాల ఎగుమతికి చైనా గ్రీన్ సిగ్నల్ - Tholi Paluku