
అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో యూరప్ దేశాల్లో ఆందోళన
అమెరికా, ఇజ్రాయెల్ శనివారం ఇరాన్‌పై భారీ స్థాయిలో సైనిక దాడులు చేపట్టిన నేపథ్యంలో, యూరప్ దేశాలు తీవ్ర అప్రమత్తతతో పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ఉన్న తమ పౌరుల భద్రత, దౌత్యపరమైన స్పందన, భవిష్యత్ పరిణామాలపై యూరోపియన్ నాయకులు అత్యవసరంగా చర్చలు ప్రారంభించారు.
ఈ దాడుల అనంతరం, మధ్యప్రాచ్య ప్రాంతం మరింత ఉద్రిక్తంగా మారిందని యూరోపియన్ యూనియన్ అభిప్రాయపడింది. యూరప్‌కు చెందిన పలు దేశాలు ఇప్పటికే తమ పౌరులను అప్రమత్తం చేస్తూ, అవసరమైతే తరలింపు చర్యలకు సిద్ధమవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది సిబ్బందిని వెనక్కి పిలిపించే ప్రక్రియ ప్రారంభించింది.
అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్‌లోని కీలక సైనిక, వ్యూహాత్మక లక్ష్యాలు టార్గెట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అద్యక్షుడు ట్రంప్ ఇరానియన్ ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
“మీ ప్రభుత్వాన్ని మీరు స్వాధీనం చేసుకోండి” అంటూ ఆయన చేసిన పిలుపు, ఇరాన్‌లోని మతాధిపత్య పాలనకు ముగింపు పలకాలని అమెరికా కోరుకుంటోందన్న సంకేతంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ దాడులపై అమెరికా తన మిత్రదేశాలకు ముందస్తు సమాచారం ఇచ్చిందా లేదా అన్నది స్పష్టంగా లేదు. జర్మనీ ప్రభుత్వం మాత్రం, శనివారం ఉదయం మాత్రమే ఇజ్రాయెల్ దాడులపై తమకు సమాచారం అందిందని తెలిపింది. ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా “ఏదో జరుగుతుందని అంచనా వేశాం కానీ సమయం తెలియదు” అని వెల్లడించింది.
దీనిపై స్పందించిన యూరోపియన్ యూనియన్ అత్యున్నత దౌత్యాధికారి కాజా కల్లాస్, మధ్యప్రాచ్య పరిస్థితిని “అత్యంత ప్రమాదకరమైనది”గా అభివర్ణించారు.
“ఇరాన్ పాలక వ్యవస్థ వేలాది మందిని హతమార్చింది. వారి బాలిస్టిక్ క్షిపణులు, అణు కార్యక్రమాలు, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం ప్రపంచ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారాయి” అని ఆమె పేర్కొన్నారు. అయితే, ఉద్రిక్తతల మధ్య కూడా శాంతియుత పరిష్కారం కోసం ఇజ్రాయెల్, అరబ్ దేశాల నేతలతో చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఇరాన్‌పై ఇటీవల యూరోపియన్ యూనియన్ విధించిన కొత్త ఆంక్షలు కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. ఈ ఆంక్షలకు ప్రతిగా టెహ్రాన్ ప్రభుత్వం యూరోపియన్ దేశాలపై ప్రతీకార చర్యలు ప్రకటించింది. ఇదిలా ఉండగా, రెడ్ సీలో యూరోపియన్ యూనియన్ కొనసాగిస్తున్న సముద్ర భద్రతా మిషన్‌ను మాత్రం యథావిధిగా కొనసాగించాలని ఈ యూ నిర్ణయించింది.
జర్మనీ ప్రభుత్వం ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు మొత్తం మధ్యప్రాచ్య పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు జర్మనీ సంక్షోభ నిర్వహణ బృందం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఇప్పటికే భద్రతా శాఖ మంత్రులు, యూరోపియన్ భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ సమీప దేశాల్లో ఉన్న జర్మన్ పౌరులు విదేశాల్లో ఉన్న పౌరుల అధికారిక రిజిస్ట్రేషన్ వ్యవస్థలో నమోదు చేసుకోవాలని, స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని జర్మనీ ప్రభుత్వం సూచించింది.
మధ్యప్రాచ్యంలో సైనిక స్థావరాలు కలిగిన ఫ్రాన్స్ కూడా తమ పౌరులను అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఫ్రాన్స్ జూనియర్ రక్షణ మంత్రి అలిస్ రుఫో మాట్లాడుతూ, “ఇది చర్చల సమయం కాదు. సైనిక ఉద్రిక్తతలు యుద్ధ స్థాయికి చేరుతున్నాయి” అని అన్నారు. ఫ్రెంచ్ సైనిక దళాల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఫ్రాన్స్ సైన్యం స్పష్టం చేసింది.
ఇటలీ ప్రభుత్వం కూడా తమ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఉద్రిక్తతలను తగ్గించే ఏ ప్రయత్నానికైనా మద్దతుగా ప్రాంతీయ నేతలతో సంప్రదింపులు జరపనున్నట్లు ఆమె కార్యాలయం వెల్లడించింది. ఇరాన్‌లో పౌర, రాజకీయ హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలకు ఇటలీ తన మద్దతును పునరుద్ఘాటించింది.
అంతర్జాతీయంగా, స్విట్జర్లాండ్ కూడా స్పందిస్తూ, అన్ని పక్షాలు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, పౌరులు పౌర మౌలిక వసతులపై ఎలాంటి దాడులు జరగకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది.
మొత్తంగా, అమెరికా–ఇజ్రాయెల్ దాడులు మధ్యప్రాచ్యాన్ని మరోసారి యుద్ధ ముప్పు అంచుకు తీసుకొచ్చాయని, యూరప్ దేశాలు అప్రమత్తతతో పాటు దౌత్యపరమైన పరిష్కారాలపై కూడా దృష్టి సారిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
