
అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో గ్లోబల్ మార్కెట్లలో కలకలం
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో ప్రపంచ ఆర్థిక మార్కెట్లు సోమవారం కుదేలయ్యాయి. అమెరికా ఫ్యూచర్స్ సూచీలు 1 శాతం కంటే ఎక్కువ పతనమవ్వగా, అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. అయితే రక్షణ రంగ సంస్థలు, ఆయిల్ కంపెనీల షేర్లలో లాభాలు నమోదవడంతో ఆసియా మార్కెట్లలో నష్టాలు కొంత మేరకు పరిమితమయ్యాయి. అమెరికాలో ఎస్ అండ్ పీ 500, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ అవరేజ్ ఫ్యూచర్స్ 1.7 శాతం వరకు పడిపోయాయి. యూఎస్ బెంచ్‌మార్క్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 9 శాతం పెరిగి 73 డాలర్లకు చేరగా, బ్రెంట్ క్రూడ్ సుమారు 10 శాతం పెరిగి 80 డాలర్లకు చేరువైంది.
యూరప్ మార్కెట్ల పతనం
యూరప్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 2.2 శాతం క్షీణించి 24,737.47 వద్ద నిలిచింది.
పారిస్‌లోని సీఏసీ 40 1.9 శాతం పడిపోయి 8,413.91కి చేరింది.
బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌టీఎస్ఈ 100 1 శాతం తగ్గి 10,800.63 వద్ద ముగిసింది.
ఆసియాలో మిశ్రమ ధోరణి
ఆసియాలో ఎక్కువ మార్కెట్లు నష్టపోయాయి. అయితే షాంఘై మార్కెట్‌లో ఆయిల్ కంపెనీ షేర్ల పెరుగుదలతో సూచీ లాభాల్లో ముగిసింది. చైనా కంపెనీలు సిఎన్ఓఒసి, చైనా పెట్రోలియం అండ్ కెమికల్, పెట్రోచైనా షేర్లు 10 శాతం వరకు పెరిగాయి. షాంఘై కాంపోజిట్ సూచీ 0.5 శాతం పెరిగి 4,182.59 వద్ద ముగిసింది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ 2.1 శాతం పడిపోయింది. జపాన్ నిక్కీ 225 ప్రారంభంలో 2 శాతం క్షీణించినప్పటికీ, చివరికి 1.4 శాతం తగ్గి ముగిసింది. మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, ఐహెచ్ఐ కార్ప్ వంటి రక్షణ రంగ సంస్థల షేర్లు పెరిగాయి.
భారత్‌లో, ఇరాన్‌తో యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సెన్సెక్స్ 2.1 శాతం క్షీణించింది. తైవాన్ సూచీ 0.9 శాతం, సింగపూర్ 2.3 శాతం పడిపోయాయి. మధ్యప్రాచ్య పర్యాటకులకు ప్రధాన గమ్యస్థానమైన బ్యాంకాక్‌లో ఎస్ఈటీ సూచీ 3.1 శాతం క్షీణించింది.
పెరిగిన బంగారం, డాలర్ రేట్
అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధర 3.4 శాతం పెరిగి ఔన్సుకు 5,426 డాలర్లకు చేరింది. అమెరికా డాలర్ జపాన్ యెన్‌పై బలపడగా, యూరో విలువ తగ్గింది.
హార్ముజ్ జలసంధిపై ప్రభావం
పర్షియన్ గల్ఫ్ ప్రవేశ ద్వారం అయిన హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో సుమారు ఐదో వంతు రవాణా అవుతుంది. ఈ ప్రాంతంలో రెండు నౌకలపై దాడులు జరగడంతో చమురు ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఇరాన్ రోజుకు సుమారు 16 లక్షల బ్యారెళ్ల చమురు ఎగుమతి చేస్తోంది. సరఫరాలో అంతరాయం కలిగితే చైనా వంటి దేశాలు ప్రత్యామ్నాయ వనరుల కోసం వెతకాల్సి రావొచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు.
అమెరికా మార్కెట్ల నేపథ్యం
గత శుక్రవారం ఎస్అండ్‌పీ 500 0.4 శాతం, డౌ ఇండస్ట్రియల్స్ 1.1 శాతం, నాస్‌డాక్ 0.9 శాతం తగ్గాయి. అమెరికా హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 2.9 శాతానికి పెరగడం కూడా మార్కెట్లపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీనితో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలను ఆలస్యం చేసే అవకాశముందని భావిస్తున్నారు. యుద్ధం కొనసాగితే ఇంధన ధరలు మరింత పెరిగి, ఉత్పత్తి వ్యయాలపై ప్రభావం చూపి, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
