Let's talk: editor@tmv.in
అమెరికా‍-ఇండోనేషియా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు

అమెరికా‍-ఇండోనేషియా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు

Shaik Mohammad Shaffee
21 ఫిబ్రవరి, 2026

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'బోర్డ్ ఆఫ్ పీస్' (శాంతి మండలి) తొలి సమావేశం.. అంతర్జాతీయంగా సరికొత్త ఆర్థిక, వ్యూహాత్మక మార్పులకు వేదికైంది. ఈ భేటీ కోసం వాషింగ్టన్ వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో అమెరికా చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రెండు దేశాల మధ్య ఆర్థిక బంధంలో "కొత్త స్వర్ణయుగం" మొదలైందని వైట్ హౌస్ ఈ సందర్భంగా అభివర్ణించింది.

సుంకాల్లో భారీ సడలింపులు

ఈ ఒప్పందం ప్రకారం, ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండోనేషియా.. సుమారు 99 శాతం అమెరికన్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పూర్తిగా తొలగించేందుకు అంగీకరించింది. అయితే ఇండోనేషియా వస్తువులపై అమెరికా 19 శాతం సుంకాలను కొనసాగించనుంది. ఇదే విధమైన పన్ను రేటు కంబోడియా, మలేషియా దేశాలకూ వర్తిస్తుందని స్పష్టమైంది. దీనికి అదనంగా, అమెరికా ఉత్పత్తుల విక్రయాలకు ఆటంకంగా మారిన 'సుంకేతర' నిబంధనలను రద్దు చేయడంతో పాటు, స్మార్ట్‌ఫోన్ల నుంచి యుద్ధ విమానాల తయారీకి అవసరమైన కీలక ఖనిజాల ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసేందుకు కూడా ఇండోనేషియా సానుకూలత వ్యక్తం చేసింది.

38.4 బిలియన్ డాలర్ల ఒప్పందాలు

అమెరికా, ఇండోనేషియా దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు ఫలప్రదమవ్వడంతో ఉభయ దేశాల కంపెనీల మధ్య సుమారు 38.4 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 3.49 లక్షల కోట్లు) విలువైన 11 భారీ ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా వ్యవసాయ రంగంలో అమెరికా నుంచి సోయాబీన్స్, మొక్కజొన్న, పత్తి, గోధుమలను ఇండోనేషియా భారీగా కొనుగోలు చేయనుంది. సాంకేతిక, ఇంధన రంగాలలో కంప్యూటర్ చిప్‌ల తయారీకి జాయింట్ వెంచర్లు నెలకొల్పడంతో పాటు, చమురు క్షేత్రాల పునరుద్ధరణలో పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ముఖ్యంగా, స్మార్ట్‌ఫోన్ల నుండి యుద్ధ విమానాల తయారీ వరకు అత్యంత కీలకమైన ఖనిజాల సరఫరాలో చైనాపై ఉన్న ఆధారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా అమెరికా ఈ వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

గాజా భద్రతకు 'ఇండోనేషియా' సైన్యం

ఆర్థిక ఒప్పందాలతో పాటు గాజా శాంతి ప్రయత్నాల్లోనూ ఇండోనేషియా కీలక పాత్ర పోషించనుంది. గాజాలో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ స్థిరీకరణ దళం కోసం 8,000 మంది సైనికులను పంపుతామని ప్రబోవో ప్రకటించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. "ప్రెసిడెంట్ ప్రబోవో, మీరు గొప్ప పని చేస్తున్నారు" అని ప్రశంసించారు. యుద్ధానంతర గాజా పునర్నిర్మాణ ప్రణాళికకు మద్దతు తెలిపిన మొదటి ముస్లిం దేశం ఇండోనేషియా కావడం విశేషం.

విదేశాంగ విధానంలో మార్పులు

ఈ సమావేశానికి హాజరైన వియత్నాం నేత టో లామ్ పర్యటన దౌత్య వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. సాధారణంగా చైనా పర్యటన తర్వాతే ఇతర దేశాలకు వెళ్లే సంప్రదాయం ఉన్నప్పటికీ, ఈసారి ఆయన నేరుగా వాషింగ్టన్ రావడం గమనార్హం. ఆగ్నేయాసియా దేశాలైన ఇండోనేషియా, వియత్నాం, కంబోడియా.. అమెరికా-చైనా మధ్య పోటీలో 'నిజాయితీ గల మధ్యవర్తులు'గా వ్యవహరించేందుకు సిద్ధమని ఈ భేటీ ద్వారా స్పష్టమయింది.