Let's talk: editor@tmv.in
అమెరిక‌న్ల‌నే నియ‌మించుకోండి!

అమెరిక‌న్ల‌నే నియ‌మించుకోండి!

Venkatesh Balusula
30 సెప్టెంబర్, 2025

హెచ్‌1బీ వీసా దుర్వినియోగాన్ని అరిక‌ట్టేందుకు కంపెనీల్లో అమెరిక‌న్ల‌నే నియ‌మించుకోవాల‌ని అమెరికా కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. "హెచ్-1బీ దుర్వినియోగం ముగించండి. అమెరికన్లను నియమించండి" అని కార్మిక‌ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అమెరిక‌న్ల క‌ల కోస‌మే తాము పోరాడుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇటీవ‌ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1బీ వీసా ద‌ర‌ఖాస్తు రుసుము ల‌క్ష‌ డాలర్లకు పెంచిన విష‌యం తెలిసిందే. దానికి అనుగుణంగానే తాజా ప్ర‌క‌ట‌న విడుద‌లైన‌ట్లు తెలుస్తోంది.

హెచ్‌1బీ వీసా ద‌ర‌ఖాస్తు రుసుము పెంపు నైపుణ్యం గల కార్మికులను ప్రభావితం చేస్తుంద‌న్న ఆందోళ‌న‌లున్నాయి. హెచ్ 1బీ వీసా మూడేళ్లు చెల్లుబాట‌వుతుంది. మరో మూడేళ్లు పునరుద్ధరించవచ్చు. ఈ నిర్ణ‌యం అమెరికా కంపెనీల్లో పోటీత‌త్వం, ఉత్ప‌త్తిపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని ఆర్థిక వేత్త‌లు పేర్కొంటున్నారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లట్నిక్ ట్రంప్ నిర్ణ‌యంపై ప్ర‌శంస‌లు కురిపించారు. కొత్త వీసాల‌తో విదేశీ కార్మికులు అమెరికాకు గణనీయ ప్రయోజనం ఇవ్వాలని ప్రకటించారు. అమెరికన్ల ఉద్యోగాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను దోచుకునే పద్ధతులు ముగిస్తామని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు ల‌ట్నిక్ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు.

అందులో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సంతకం చేసిన సంద‌ర్భం గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొత్త‌గా ప్ర‌వేశ పెట్టిన గోల్డ్ కార్డ్ వీసా కార్యక్రమంతో వ్యక్తులకు 1 మిలియన్ డాలర్లు, వ్యాపారాలకు 2 మిలియన్ డాలర్లు ఫీజు నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు. హెచ్ 1బీ వీసా ద‌ర‌ఖాస్తుల‌కు ల‌క్ష‌ డాలర్లు ఫీజు విధిస్తుంది. ఈ సంద‌ర్భంగా ల‌ట్నిక్ గ‌త జో బైడెన్ పాల‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అమెరిక‌న్ల ఆదాయానికి గండి కొడుతూ గ‌త నాలుగేళ్లుగా అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌తో దేశాన్ని నింపేశార‌న్నారు. ప్ర‌స్తుత‌ ట్రంప్ ప్రభుత్వం ఆ విపత్కర ఎజెండాను పూర్తిగా మారుస్తోంద‌ని చెప్పారు. ఈ కార్యక్రమాల‌తో అమెరికాలో పని చేసే వారు దేశానికి గణనీయ ప్రయోజనం ఇవ్వాల‌ని కోరారు. అమెరికన్ల ఉద్యోగాలు తీసుకొని ఆర్థిక వ్యవస్థను దోచుకునే పద్ధతి ముగుస్తుంద‌ని చెప్పారు. ట్రంప్ వ‌ల‌స విధానాల‌ను మళ్లీ సరిచేస్తున్నార‌ని పేర్కొన్నారు. దీంతో అమెరికాకు చాలా ప్రయోజనం చేకూరుతుంద‌ని త‌న పోస్టులో రాసుకొచ్చారు.

ట్రంప్ ప్రభుత్వం వ‌ల‌స నియమాలు మ‌రింత కఠిన‌త‌రం చేస్తోంది. హెచ్1బీ వీసా ద‌ర‌ఖాస్తు రుసుము పెంచింది. ఇది ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 21 నుంచే అమ‌లులోకి వ‌చ్చింది.దీని వ‌ల్ల అమెరికాకు విదేశీ కార్మికులు తక్కువ సంఖ్య‌లో వ‌స్తారు. దీంతో అమెరికన్లకు ఉద్యోగాలు ఎక్కువ సంఖ్య‌లో దొరుకుతాయ‌ని భావిస్తున్నారు. కానీ ఆర్థికవేత్తలు ఇది కంపెనీల పోటీతత్వం తగ్గిస్తుంది చెబుతున్నారు. గోల్డ్ కార్డ్ వీసాతో ధనికులు మాత్రమే అమెరికాకు వ‌చ్చే అవకాశం క‌లుగుతుంది. నైపుణ్యవంత‌మైన‌ సామాన్య విదేశీయులు అమెరికాకు దూరమవుతారు. వ‌ల‌స‌ల విధానంలో గ‌త పాల‌కుల‌ను విమర్శించడం పూర్తిగా రాజకీయ ఎత్తుగడగా తెలుస్తోంది. అమెరికా నిర్ణ‌యం భారతీయ ఐటీ కంపెనీలు, నైపుణ్యవంతులైన యువత‌ భవిష్యత్తుపై తీవ్ర‌ ప్రభావితం చూపుతోంది. భారత్‌ నుంచి 70 శాతం ప్ర‌జ‌లు హెచ్ 1బీ వీసాలు వినియోగించుకుంటున్నారు. ఈ మార్పు భారత ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల‌పై గణనీయమైన‌ ప్రభావం చూప‌నుంది. ఇప్ప‌టికే అమెరికా నిర్ణ‌యంపై భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇది మానవతాపరమైన స‌మ‌స్య‌లు కలిగించవచ్చని హెచ్చరించింది. దీనిపై అమెరికాతో చర్చలు ప్రారంభ‌మ‌య్యాయి. ఇక ఇదే త‌రుణంలో భార‌త యువ‌త నైపుణ్యాలు ఉప‌యోగించుకునేందుకు జర్మనీ, యూకే, కెనడా, చైనా వంటి దేశాలు వీసాల కేటాయింపుల్లో వెసులుబాట్లు క‌ల్పిస్తూ ఆహ్వానం ప‌లుకుతున్నాయి. అమెరికాతో చ‌ర్చ‌లు ఏమేర‌కు ఫ‌లితాన్నిస్తాయో, హెచ్‌1బీలో ఏమైనా మార్పులు చేస్తారో వేచి చూడాలి.

అమెరిక‌న్ల‌నే నియ‌మించుకోండి! - Tholi Paluku