
అమెజాన్ రహస్యం బయటపడుతుంది
అమెజాన్ అరణ్యం అనేది భూమికి గుండె లాంటిది. మనం ఊపిరి పీల్చుకునే ప్రతి శ్వాసలో ఆ అరణ్యం తన వాటా కలిపి ఉంటుంది. వాన కురిసే రాగం, గాలి వీచే శబ్దం, పక్షుల కిలకిలారావం అన్నీ కలిసిపోతూ ఒక మహా సంగీతాన్ని వినిపిస్తాయి. ఈ అడవి కేవలం చెట్ల సమూహం కాదు, ఇది మనిషి జీవనానికి ఆధారం. ప్రతి చెట్టు ఒక సైనికుడిలా నిలబడి, గాలిలో ఉన్న కార్బన్‌ను తనలో బంధించి భూమిని రక్షిస్తోంది. కానీ ఈ సైన్యం లోపల ఒక మార్పు మొదలైంది. పెద్ద పెద్ద చెట్లు మరింత ఎత్తుగా, మరింత బలంగా పెరుగుతున్నాయి. ఆ దృశ్యం ఒకవైపు ఆనందం కలిగిస్తే, మరొకవైపు ఒక తెలియని భయం కూడా కలిగిస్తోంది. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడూ తనలోనే ఒక రహస్యాన్ని దాచిపెడుతుంది, ఆ రహస్యం బయటపడే సమయం దగ్గర పడుతోందని అనిపిస్తోంది.
గత 30ఏళ్లగా అమెజాన్ చెట్లు పెద్దవవుతున్నాయి, మరింత ఎత్తుగా నిలుస్తున్నాయి, మరింత మందంగా కాండాలు పెరుగుతున్నాయి. ఒక పెద్ద పరిశోధన తెలిపింది.. ఈ మార్పు వెనుక కారణం వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డైఆక్సైడ్ అని. మనం కాలుష్యాన్ని పెంచిన కొద్దీ, ఈ చెట్లు ఆ కార్బన్‌ను తీసుకుని తన పెరుగుదలకు వాడుకుంటున్నాయి. అంటే మన తప్పును ప్రకృతి తన శక్తితో సరిచేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ ప్రకృతి చేసే ప్రయత్నం శాశ్వతం కాదన్నది మనం మర్చిపోవద్దు.
పరిశోధకులు చెప్పిన ప్రకారం, ప్రతి దశాబ్దానికి చెట్ల పరిమాణం సుమారు 3శాతం పెరిగింది. అంటే వందల సంవత్సరాల వయసున్న పెద్ద చెట్లు మరింత బలంగా నిలుస్తున్నాయి. అరణ్యం లోపల 188 ప్రాంతాలను పరిశీలించి, వందలాది శాస్త్రవేత్తలు ఈ ఫలితాన్ని నిర్ధారించారు. చిన్నవైనా, పెద్దవైనా, అన్ని రకాల చెట్లు ఈ పెరుగుదలలో భాగస్వాములయ్యాయి. ఇది వింటే ఒక ఆశ, ఒక సంతోషం కలుగుతుంది. కానీ సంతోషం వెనుక దాగిన చేదు నిజాన్ని కూడా మనం చూడాలి. పెద్ద చెట్లు బలంగా పెరుగుతున్నప్పటికీ, చిన్న మొక్కలు తగ్గిపోతున్నాయి. అరణ్యానికి క్రింది పొరలో పెరుగుతున్న మొక్కల సంఖ్య తగ్గిపోతోంది. ప్రతి దశాబ్దానికి చిన్న మొక్కల సంఖ్య ఒక శాతం పైగా తగ్గుతోంది, అరణ్యపు క్రింది అంతస్తులోని జీవం 3శాతం పైగా తగ్గుతోంది.
పెద్ద చెట్లు పెరుగుతూనే ఉంటే బాగానే కనిపించవచ్చు. కానీ అరణ్యపు భవిష్యత్తు చిన్న మొక్కల మీదే ఆధారపడి ఉంటుంది. చిన్నవే పెద్దవిగా మారతాయి, అవే కొత్త విత్తనాలు పుట్టిస్తాయి. అవే భవిష్యత్తులో అమెజాన్‌కు రక్షకులవుతాయి. చిన్న మొక్కలు తగ్గిపోతే, కొన్నేళ్ల తర్వాత పెద్ద చెట్లకు కూడా వారసులు ఉండకపోవచ్చు. అప్పుడు అమెజాన్ బలం క్రమంగా తగ్గిపోవచ్చు. ఇప్పటికే అమెజాన్‌లో కరువులు, పొడిగాలులు, తుఫానులు ఎక్కువవుతున్నాయి. వేడిగాలులు పెరుగుతున్నాయి. ఇలాంటివి చెట్ల వృద్ధిని అడ్డుకోవచ్చు, మరీ మరణాలకూ కారణం కావచ్చు. అప్పుడు ఈ రోజున మనకు కనిపిస్తున్న 'పెరుగుతున్న చెట్లు' అనే శుభవార్త ఒక దుర్వార్తగా మారిపోవచ్చు.
మరోవైపు ప్రపంచ నాయకులు కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, వాతావరణ మార్పును నియంత్రించడానికి వాగ్దానాలు చేస్తున్నారు. కానీ వాగ్దానాలు మాత్రమే సరిపోవు. అమెజాన్ అరణ్యం తన వంతు శక్తితో పోరాడుతోంది, కానీ అది శాశ్వతంగా కొనసాగలేని పోరాటం. మనం ఇప్పుడు ఏం చేస్తామన్నదే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చెట్లు తమకిష్టమున్నంతకాలం పెరుగుతూనే ఉంటాయి, కానీ మనం వారిని రక్షించకపోతే ఒక రోజు అవి చనిపోయతాయి కూడా. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మరి.
