Let's talk: editor@tmv.in
అమృత్ భారత్‌ కోచ్‌లు అద్భుతంగా ఉన్నాయి: రైల్వే మంత్రి

అమృత్ భారత్‌ కోచ్‌లు అద్భుతంగా ఉన్నాయి: రైల్వే మంత్రి

Pinjari Chand
6 ఏప్రిల్, 2026

భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టనున్న తదుపరి తరం అమృత్ భారత్ కోచ్‌ల నమూనాను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆదివారం పరిశీలించారు. ఏప్రిల్‌ 4న రూపొందించిన ఈ నమూనా కోచ్‌లు ప్రయాణికుల సౌకర్యం, అందం, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే విధంగా రూపొందించారు. ఈ కోచ్‌లలో అంతర్గత అలంకరణకు ప్రత్యేక రంగుల థీమ్‌లను ఉపయోగించారు. పీవీసీ ఫ్లోరింగ్‌, సీట్లు, బెర్త్ రెక్సిన్‌, స్నాక్ టేబుల్స్‌, కర్టెన్లు, లావేటరీ ప్రాంతాలు వంటి భాగాల్లో సమన్వయ రంగులను ఉపయోగించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని పదార్థాలు హెచ్‌ఎల్‌–3 అగ్ని భద్రత ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. కొత్త రంగుల డిజైన్ కోచ్‌లకు ఆధునికమైన, ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తూనే నిర్వహణకు సులభంగా ఉండేలా తీర్చిదిద్దారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవం అందించడమే లక్ష్యంగా భారతీయ రైల్వేలు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

మరో ప్రాజెక్టుకు ఆమోదం

ఇదిలా ఉండగా, పశ్చిమ రైల్వేలో కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరో కీలక ప్రాజెక్టుకు భారతీయ రైల్వేలు ఆమోదం తెలిపాయి. అహ్మదాబాద్‌, రత్లాం డివిజన్‌లలో 4×48 ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) బ్యాక్‌బోన్ ఏర్పాటు చేయడానికి రూ.398.36 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు ‘కవచ్’ రైల్వే భద్రతా వ్యవస్థ అమలుకు అవసరమైన కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తం 1929 రూట్ కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో అహ్మదాబాద్ డివిజన్‌లో 1456 కిమీ, రత్లాం డివిజన్‌లో 473 కిమీ ఉన్నాయి. ఈ చర్యలతో రైల్వే కమ్యూనికేషన్ వ్యవస్థ సామర్థ్యం, విశ్వసనీయత మరింత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు.