Let's talk: editor@tmv.in
అమీర్‌పేట ముంపు సమస్యకు హైడ్రా పరిష్కారం

అమీర్‌పేట ముంపు సమస్యకు హైడ్రా పరిష్కారం

Gaddamidi Naveen
18 అక్టోబర్, 2025

ప్రతి వర్షాకాలంలో ముంపుతో ఇబ్బందులు పడే అమీర్‌పేట ప్రాంతానికి ఈసారి హైడ్రా శాఖ పరిష్కారం చూపనుంది. కొద్దిపాటి వర్షానికే రహదారులు జలమయం కావడం, వాహన రాకపోకలు అడ్డంకులు ఎదుర్కోవడం, ప్రజలకు ఇబ్బందులు కలగడం వంటి పరిస్థితులు ఇక దూరంకానున్నాయి. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో అమీర్‌పేటలో పూడుకుపోయిన నాలాల శుభ్రత పనులు పూర్తిచేయడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.

హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఈ పనులను స్వయంగా పర్యవేక్షించారు. మైత్రివనం జంక్షన్, గాయత్రీనగర్ ప్రాంతాలను సందర్శించి, వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా పూడుకుపోయిన పైపులైన్లను శుభ్రపరచడం జరుగుతోందని తెలిపారు. మొత్తం 6 పైపులైన్లలో మూడు పైపులు పూర్తిగా పునరుద్ధరించబడ్డాయని . మిగిలిన మూడు పైపులలో పూడిక తొలగింపు పనులు కొనసాగుతున్నాయని. రాబోయే వర్షాకాలానికి ముందు ఈ పనులు పూర్తిచేయాలని కమిషనర్ సూచించారు.

అమీర్‌పేట ఓ న‌మూనా

అమీర్‌పేటలోని సారథీ స్టూడియోస్‌, మధురానగర్ వైపు నుంచి వచ్చే వర్షపు నీరు ప్రధాన జంక్షన్ వద్ద చేరుతుంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్త, మట్టి కారణంగా పైపులు మూసుకుపోయి ఉండటం వల్ల నీరు నిలిచిపోయేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు హైడ్రా బృందం భారీ స్థాయిలో పూడికతీత చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 45 ట్రక్కుల మట్టిని తొలగించామని అధికారులు వెల్లడించారు. ఈ మట్టిని సేఫ్ డంపింగ్ యార్డులకు తరలించినట్లు తెలిపారు. ఈ చర్యలతో 10 సెంటీమీటర్ల వర్షం పడినా నీరు నిలవకుండా ముందుకు సాగుతోందని తెలిపారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, “అమీర్‌పేటలో అమలు చేసిన ఈ మోడల్ నగరంలోని ఇతర ముంపు ప్రాంతాలకు కూడా దారి చూపుతుంది. నాలాలు శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిరంతర చర్యగా కొనసాగిస్తే వర్షాకాలం సమస్యలను సులభంగా ఎదుర్కొనవచ్చు” అని తెలిపారు. గాయత్రీనగర్ ప్రాంతంలో మిగిలిన పైపులైన్లలో మట్టిని తొలగించి నీటి ప్రవాహం అడ్డంకులు లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. 15 సెంటీమీటర్ల వర్షం పడినా ముంపు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కాలనీ అసోసియేషన్ సభ్యులు హైడ్రా బృందం చేపట్టిన శుభ్రతా పనుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో అమీర్‌పేట ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని స్థానికులు పేర్కొన్నారు. హైడ్రా అధికారులు ఈ విధానాన్ని నగరంలోని మరిన్ని ముంపు ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని నిర్ణయించాయ‌ని అలాగే నాలాల శుభ్రత, పైపులైన్ల పూడికతీత వంటి చర్యలతో నగరవ్యాప్తంగా వర్షాకాల ముంపు సమస్యలను నియంత్రించాలనే లక్ష్యంతో హైడ్రా ముందుకు సాగుతోందని హైడ్రా క‌మిష‌నర్ తెలిపారు.

గత ముంపు పరిస్థితులు (2019–2023 మధ్య)

2020- 2022లో అమీర్‌పేట జంక్షన్, మైత్రివనం, శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రహదారులు 3 నుంచి 4 అడుగుల వరకు నీటమునిగాయి. వాహనాలు, బైకులు, ఆటోలు నీటిలో చిక్కుకుని దెబ్బతిన్న ఘటనలు పలు సార్లు చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల్లో అండర్‌గ్రౌండ్ పార్కింగ్‌లోకి నీరు చేరి కార్లు దెబ్బతిన్నాయి — ముఖ్యంగా మైత్రివనం సమీపంలోని కమర్షియల్ బిల్డింగ్స్ వద్ద జ‌రిగింది. వ్యాపార సముదాయాల్లో లక్షల రూపాయల నష్టం చోటుచేసుకుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ షాపులు, గార్మెంట్స్ షాపులు నీటిలో మునిగిపోయాయి.

ప్రమాదాలు - ఇబ్బందులు

2021 జూలైలో వర్షం సమయంలో ఒక ఆటో డ్రైవర్ ముంపు నీటిలో చిక్కుకుని గాయపడిన ఘటన జిహెచ్ఎంసి రికార్డుల్లో ఉంది. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి, అమీర్‌పేట – పంజాగుట్ట – ఎర్రమంజిల్ రోడ్ దాదాపు 3 గంటలపాటు మూసివేయాల్సి వచ్చింది. అలాగే వర్షం తర్వాత కాలరా, డెంగ్యూ లాంటి ఆరోగ్య సమస్యలు పెరిగినట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

అమీర్‌పేట ముంపు సమస్యకు హైడ్రా పరిష్కారం - Tholi Paluku