
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన అమీర్‌పేటలో ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో శుక్రవారం ఉదయం ఆరు అంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనేక ఐటీ కోచింగ్ సెంటర్లు, దుకాణాలతో నిండి ఉన్న ఈ భవనంలో మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే, అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సుమారు 100 మందిని నిచ్చెనలు, మెట్ల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 10:30 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని లిఫ్ట్ సమీపంలో ఉన్న ఎలక్ట్రిక్ డక్ట్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. అక్కడున్న ఇన్సులేషన్ మెటీరియల్ తగలబడటంతో భవనం మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో పైఅంతస్తుల్లో ఉన్న విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
తెలంగాణ అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు, హైడ్రా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. అమీర్‌పేట్ ప్రాంతం సాఫ్ట్‌వేర్ కోర్సులు అందించే అనేక కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందినది. గత నెలలో నాంపల్లిలో నాలుగు అంతస్తుల ఫర్నిచర్ దుకాణ భవనంలో అగ్నిప్రమాదం జరిగి ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతిచెందిన ఘటన గుర్తుండగానే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
హైడ్రా కమిషనర్ పర్యవేక్షణ
ఈ సంఘటనా స్థలాన్ని సందర్శించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ, మంటలతో పాటు మెట్ల మార్గం వద్ద విద్యుత్ కేబుళ్లు తగలబడటంతో భారీగా పొగ కమ్ముకుంది. రెండో అంతస్తులో చిక్కుకున్న వారిని హైడ్రా సిబ్బంది రోప్ ల్యాడర్ల సాయంతో కిందికి దించారు. మొత్తం 50 మందికి పైగా ఉన్నవారిని సురక్షితంగా బయటకు తరలించారు. ఇదే సమయంలో మరిన్ని రెండు డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాయని తెలిపారు. ఫైర్, పోలీసు శాఖల సిబ్బంది కూడా సమన్వయంతో పనిచేశారు. మంటలను అదుపులోకి తేవడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ పరిశీలించి అగ్నిప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. హైడ్రా అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య, ఏడీఎఫ్‌వో మోహనరావు కూడా పరిస్థితిని సమీక్షించారు. ఫైర్, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, పోలీసు శాఖలతో కలిసి ఇటీవలే తనిఖీలు నిర్వహించి కొన్ని దుకాణాలను సీజ్ చేసిన విషయాన్ని కమిషనర్ గుర్తుచేశారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే చట్టాల్లో మార్పులు సూచిస్తామని ఆయన తెలిపారు. నెలరోజుల తర్వాత మళ్లీ సంయుక్త తనిఖీలు చేపడతామని పేర్కొన్నారు. ప్రజలు కూడా అగ్ని భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
