

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్
హైదరాబాద్ నగర శివార్లలో భూకబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ హైడ్రా మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో శనివారం ప్రభుత్వం భారీ స్థాయి కూల్చివేత, స్వాధీనం చర్యలను చేపట్టింది. హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖల సమన్వయంతో జరిగిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 861 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాల నుంచి కాపాడినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సర్వే నంబర్లు 1 నుంచి 220 వరకు విస్తరించిన ఈ భూమి మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంది. ఇది నైజాం కాలం నాటి రికార్డుల ప్రకారం ప్రభుత్వ ఆస్తిగా గుర్తించబడింది. విలీన ప్రక్రియ అనంతరం కూడా ఈ భూమి ప్రభుత్వ భూమిగానే నమోదు అయిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల ఆధారంగా అప్పటి జాయింట్ కలెక్టర్ ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించినట్లు సమాచారం.
అయితే, ఈ భూమిలో కొంత భాగంలో ఆక్రమణలు, అనధికార నిర్మాణాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా ఎం.ఏ. ముఖీం, అతని అనుచరులు ఈ భూమిపై గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపట్టారని అధికారులు చెబుతున్నారు. 2006లో నిర్మించిన గెస్ట్ హౌస్‌తో పాటు సుమారు 40 ఎకరాల పరిధిలో ఫామ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, గుర్రాల శాలలు, ఇతర నిర్మాణాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి భూమిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఇంకా, అనుమతి లేకుండా భూములను ప్లాట్లుగా విభజించి విక్రయాలు చేసినట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయంపై గతంలోనే కోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. 1998లోనే ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ ఆ ఆదేశాలను పట్టించుకోలేదని అధికారులు తెలిపారు. 2013లో కూడా హైకోర్టు భూమి స్వరూపాన్ని మార్చరాదని మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. శనివారం జరిగిన ఆపరేషన్‌లో అధికారులు పాత నిర్మాణాలను తొలగించారు. ముఖీం గెస్ట్ హౌస్‌తో పాటు ఫామ్ హౌస్ నిర్మాణాలు, గదులు, సౌకర్యాలు, గుర్రాల శాలలు, ఫెన్సింగ్ నిర్మాణాలను కూల్చివేశారు. అదే సమయంలో 2.20 ఎకరాల్లో ముఖీం సోదరుడు ఎం.ఏ. అజీం నిర్మించిన ఆరు అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను కూడా కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు.
భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగిన ఈ చర్యలో రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదల ఇళ్లను ఈ ఆపరేషన్‌లో మినహాయించామని అధికారులు స్పష్టం చేశారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే మైకుల ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. దీంతో పేద కుటుంబాలు ఆందోళన చెందకుండా సహకరించాయని సమాచారం. ఈ సందర్భంగా అధికారులు 861 ఎకరాల ఖాళీ ప్రభుత్వ భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇదే సమయంలో కొన్ని లే అవుట్ల యజమానులు మాత్రం తమ భూములకు సంబంధించి కోర్టులో కేసులు కొనసాగుతున్నాయని, న్యాయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం ఈ చర్యతో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ భూవ్యవహారాలకు చెక్ పెట్టిందని అధికారులు పేర్కొన్నారు. భూమి స్వరూపాన్ని మార్చకుండా, కోర్టు ఆదేశాలను అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆస్తిని రక్షించినట్లు స్పష్టం చేశారు.
హైకోర్టు స్టేతో నిలిచిన కూల్చివేతలు
అయితే ఈ ఆపరేషన్‌పై కొందరు బాధితులు కోర్టును ఆశ్రయించడంతో కీలక మలుపు తిరిగింది. తగిన నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేస్తున్నారని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం, తక్షణమే కూల్చివేతలను నిలిపివేయాలని స్టే ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు దినాల్లో ఇటువంటి చర్యలు చేపట్టవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను కోర్టు గుర్తు చేసింది.
భూ మాఫియా నుంచి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడాన్ని పలువురు సమర్థిస్తుండగా, ఈఎంఐలు కట్టుకుంటూ ఇళ్లు నిర్మించుకున్న మధ్యతరగతి కుటుంబాలు ఈ చర్యల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
