
అమీన్‌పూర్‌లో రెండో రోజు కొనసాగిన హైడ్రా ఆపరేషన్
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల పరిరక్షణ లక్ష్యంగా హైడ్రా చేపట్టిన భారీ ఆపరేషన్ రెండో రోజు కూడా విజయవంతంగా కొనసాగింది. శనివారం ఉదయం ప్రారంభమైన ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ, ఆదివారం నాటికి తుది దశకు చేరుకుంది. అమీన్‌పూర్ పరిధిలోని ఖాళీగా ఉన్న 861 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేసే ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. హైడ్రా అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.ఈ భూమి విలువ మార్కట్లో రూ. 15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
భూ కబ్జాదారుడు ముఖీం సోదరుడు అజీమ్ అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేసే పని 90 శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు. అయితే, ఈ భవనం పక్కనే సామాన్యులకు చెందిన అపార్ట్‌మెంట్లు ఉండటంతో, వాటికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా హైడ్రా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ సున్నితమైన ఆపరేషన్ కారణంగా కూల్చివేత ప్రక్రియకు కొంత సమయం పడుతున్నప్పటికీ, భద్రతకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
హైడ్రా చర్యల పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భూ కబ్జాదారుల ఆగడాలతో భయం భయంగా గడిపిన తమకు, ఇప్పుడు ప్రభుత్వం, హైడ్రా రాకతో పూర్తి భరోసా కలిగిందని వారు పేర్కొన్నారు. సామాన్యుల ఇళ్లను కూల్చబోమని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో ప్రజల్లో ఉన్న ఆందోళనలు తొలగిపోయాయి.వందల ఎకరాలను ఆక్రమించి, వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన గుండాల భరతం పడుతుండటంతో స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదు, ఇది సామాన్యులకు భరోసా అని పలువురు స్థానికులు ఈ సందర్భంగా కొనియాడారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ, ఆక్రమణదారుల చెర నుంచి భూములను విడిపిస్తున్న హైడ్రా పనితీరుపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి వరకు కొనసాగిన ఈ ఫెన్సింగ్ ఆక్రమణల తొలగింపు పనులు, ఆదివారం నాటికి ఒక కొలిక్కి వచ్చాయి.
