Let's talk: editor@tmv.in
అమిత్ షాకు లెక్కలు రావేమో: ఒవైసీ

అమిత్ షాకు లెక్కలు రావేమో: ఒవైసీ

Aravind Maryada Reddy
13 అక్టోబర్, 2025

కేంద్రహోంమంత్రి అమిత్ షాకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చురకలు అంటించారు. అమిత్ షాకు లెక్కలు రావా? అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ముస్లింల జనాభా తక్కువగా ఉందని.. కేవలం చొరబాటు దారుల వల్లే ఎక్కువ జనాభా ఉన్నట్టు షా వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుపట్టారు. మొదటి జనాభా లెక్కల నుండి 2011 జనాభా లెక్కల వరకు ముస్లిం జనాభా 4.4 శాతం పెరిగిందని పేర్కొన్నారు. అమిత్ షాను ఎద్దేవా చేస్తూ, అతని గణితం "బలహీనంగా" ఉందని వ్యాఖ్యానించారు. అమిత్ షా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని తప్పుపట్టారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక సముదాయం జనాభా గణనీయంగా పెరుగుతోందని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. ముస్లింల జనాభా తగ్గడం నిజమైతే హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలని మోహన్ భగవత్ ఎందుకు అంటారని ప్రశ్నించారు.

చొరబాట్లు ఎందుకు ఆపలేదు ?

బంగ్లాదేశ్ సహా పొరుగున ఉన్న దేశాల నుంచి చొరబాట్లు పెరిగిపోయాయని బీజేపీ నేతలు పదే పదే చెబుతుంటారని అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చొరబాట్లను ఎందుకు ఆపలేకపోతున్నదని ఒవైసీ ప్రశ్నించారు. "ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ముస్లింల సంతానోత్పత్తి రేటు అత్యధికంగా తగ్గింది. ఎవరైనా చొరబాటు జరిగితే, మీరు మంత్రిగా ఉండి వారిని ఎందుకు ఆపలేకపోయారు? బెంగాలీ మాట్లాడే భారతీయ ముస్లిమ్‌ను బంగ్లాదేశీ అని పిలవడం తప్పు," అని ఆయన అన్నారు.

అమిత్ షా ఏమన్నారు?

1951 నుండి 2011 జనాభా లెక్కల వరకు ముస్లిం జనాభా ఒక శతాబ్దానికి 24.6 శాతం రేటుతో పెరిగిందని, కానీ అదే సమయంలో హిందూ జనాభా 4.5 శాతం తగ్గిందని ఇటీవల అమిత్ షా వ్యాఖ్యానించారు. చొరబాటు కారణంగా ముస్లిం జనాభా పెరిగిందని షా ఆరోపించారు. "1951, 1971, 1991, 2011లో జనాభా లెక్కలు నిర్వహించబడ్డాయి. 1951 జనాభా లెక్కలలో హిందువులు 84 శాతం, ముస్లింలు 9.8 శాతం ఉన్నారు. 1971లో హిందువులు 82 శాతం, ముస్లిం జనాభా 11 శాతం ఉంది. 1991లో హిందువులు 81 శాతం, ముస్లిం సముదాయం 12.12 శాతం ఉంది, అయితే 2011లో మనం 89 శాతం ఉన్నాము, ముస్లింలు 14.2 శాతం ఉన్నారు. నేను కేవలం రెండు మతాల జనాభా గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను చొరబాటు గురించి మాట్లాడాలనుకుంటున్నాను..." అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

ఖండించిన ఒవైసీ

ఈ ఆరోపణలను తాజాగా ఒవైసీ ఖండించారు. అమిత్ షా, అసదుద్దీన్ ఒవైసీ భారతదేశంలో ముస్లిం జనాభా పెరుగుదలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఉన్నాయి. కానీ వాస్తవ డేటాను పరిశీలిస్తే ఎవరి మాటలు ఎంతవరకు నిజమో అర్థం చేసుకోవచ్చు.

పెరుగుదలకు కారణాలు

అయితే ముస్లిం జనాభా పెరుగుదలకు చొరబాట్లే కారణమని అమిత్ షా అంటున్నారు. కానీ చొరబాట్ల వల్ల జరిగే పెరుగుదల స్వల్పమే. అయితే సంతానోత్పత్తి వంటి ఇతర కారణాలు కూడా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణను హిందువులు కఠినంగా పాటించారు. కానీ ముస్లిం జనాభాలో మతపరమైన ఆచారాల కారణంగా వారు జనాభా నియంత్రణను పాటించలేదు. పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమయ్యే అవకాశం ఉంది.

చొరబాట్లు

బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు (అస్సాం, వెస్ట్ బెంగాల్, త్రిపుర)లో. ఇది స్థానిక జనాభా నిష్పత్తిని ప్రభావితం చేస్తుంది. రాజకీయ, ఆర్థిక సమస్యలను సృష్టిస్తుంది. అంచనాల ప్రకారం, 1-2 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉండవచ్చు. కానీ ఈ విషయం అధికారికంగా ధృవీకరించబడలేదు. అయితే దేశవ్యాప్తంగా ముస్లింల జనాభాకు కేవలం చొరబాటుదారులే కారణమని చెప్పలేం. అందుకే అనేక ఇతర కారణాలు ఉన్నాయి.

వాస్తవ గణాంకాలు ఏం చెబుతున్నాయి

(1951 నుండి 2011 వరకు) భారత జనాభా లెక్కల ప్రకారం

హిందువుల జనాభా శాతం: 1951లో 84.1 శాతం, 2011లో 79.8 శాతం(సుమారు 4.3 శాతం తగ్గుదల).

ముస్లింల జనాభా శాతం: 1951లో 9.8శాతం, 2011లో 14.2శాతం(సుమారు 4.4 శాతం పాయింట్లు పెరుగుదల).

ముస్లిం జనాభా పెరుగుదల రేటు: (2001-2011) 24.7శాతం( జనాభా 138 మిలియన్ల నుండి 172 మిలియన్లకు పెరిగింది).

హిందూ జనాభా పెరుగుదల రేటు (2001-2011): సుమారు 16-17 శాతం(జనాభా 828 మిలియన్ల నుండి 966 మిలియన్లకు పెరిగింది).

జనగణన ఎందుకు వాయిదా పడుతోంది?

భారతదేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే జనగణన ఈసారి అసాధారణంగా ఆలస్యమవుతోంది. 2021లో జరగాల్సిన ఈ కార్యక్రమం ఇప్పుడు 2027కి వాయిదా పడింది. అధికారికంగా మొదట కారణం “కోవిడ్ మహమ్మారి” కారణం అని చెప్పినప్పటికీ అని చెప్పినా, దీని వెనుక పరిపాలనా, సాంకేతిక, రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

కోవిడ్-19 ప్రభావం

2020లో ప్రారంభమైన కరోనా మహమ్మారి కారణంగా మొదటి దశగా ఉన్న ఇళ్ల లెక్కింపుపూర్తిగా ఆగిపోయింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండడంతో భారీ స్థాయిలో సర్వేలు నిర్వహించడం అసాధ్యమైంది. అంతేకాక, వలస కార్మికుల ఊచకోతలతో జనాభా లెక్కల్లో గందరగోళం వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావించింది.

డిజిటల్ జనగణన సిద్ధత

2021 జనగణనను భారత్‌లో మొదటి డిజిటల్ జనగణనగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌లు అభివృద్ధి చేయడం ప్రారంభించింది. కానీ ఈ సాంకేతిక వ్యవస్థల అభివృద్ధి, భద్రతా పరీక్షలు, రాష్ట్రాల భాషా సమన్వయం వంటి అంశాలు ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకున్నాయి.

రాజకీయ కారణాలు

2024 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనగణన డేటాలోని జాతి, మతం, వలసలు, ఉద్యోగం వంటి అంశాలు రాజకీయంగా వివాదాస్పదం అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం దానిని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.. జనగణన ఆధారంగా వచ్చే నిధుల పంపిణీ, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై ప్రతిపక్షం విమర్శలు చేసే అవకాశం ఉందని కేంద్రం కొంత జాప్యం చేసిందని తెలుస్తోంది.

ఎన్పీఆర్ వివాదం

జనగణనతో పాటు జాతీయ జనాభా రిజిస్టర్ నవీకరణ కూడా జరగాల్సి ఉంది. కానీ 2019లోని పౌరసత్వ సవరణ చట్టం తర్వాత దీనిపై పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో కేంద్రం ఎన్‌పీఆర్ ప్రక్రియను నిలిపివేయడం వల్ల జనగణన కూడా ఆలస్యమైంది.

పరిపాలనా సమస్యలు

కొవిడ్ తర్వాత పలు రాష్ట్రాలు సిబ్బంది శిక్షణ, డిజిటల్ పరికరాల కొనుగోలు, బడ్జెట్ కేటాయింపులువంటి కారణాలతో సమయం కోరాయి. 2024లో దేశవ్యాప్తంగా పైలట్ సర్వే నిర్వహించి డిజిటల్ వ్యవస్థలను పరీక్షించారు. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం జనగణనను 2026 చివరలో ప్రారంభించి, 2027 మార్చి 1నాటికి మిగతా దేశంలో పూర్తి చేయాలని నిర్ణయించింది.

విశ్లేషకుల ఏమంటున్నారు?

ప్రభుత్వం సాంకేతిక అంశాలను సాకుగా చూపించి వాయిదా వేస్తున్నా, నిజమైన కారణం రాజకీయపరమైనదన్న అనుమానాలు ఉన్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటివరకు ఒక జనగణనకు మరో జనగణనకు మధ్య ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదు. 2011 తర్వాత 2027 వరకు మొత్తం 16 ఏళ్లు ఈ ప్రక్రియ వాయిదా పడింది.

అమిత్ షాకు లెక్కలు రావేమో: ఒవైసీ - Tholi Paluku