
అమర్త్యసేన్‌కు ఎస్ఐఆర్ నోటీసు
పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ అమర్త్య సేన్‌కు బుధవారం ఎన్నికల సంఘం (ఈసీ) విచారణ నోటీసు జారీ చేసింది. జనవరి 16న ఆయన నివాసంలోనే విచారణ జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అమర్త్య సేన్‌కు సంబంధించిన నోటీసును శాంతినికేతన్ (బోల్పూర్)లో ఉన్న ఆయన కుటుంబ సభ్యుడికి అందజేశారు. అయితే, సేన్‌కు ఒక్కటే నోటీసు జారీ చేశామని పశ్చిమ బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ఎన్యూమరేషన్ ఫారమ్‌లో తార్కిక వ్యత్యాసాలు కనిపించడంతో విచారణకు పిలిచినట్లు తెలిపారు. 85 ఏళ్లు దాటినందున, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సంబంధిత బూత్ స్థాయి అధికారి (బీఎల్వో) ఆయన నివాసానికి వెళ్లి విచారణ చేపడతారని చెప్పారు. సేన్ బంధువు నోటీసు అందుకున్నట్లు ధ్రువీకరించి, ఈ విషయాన్ని ఆయనకు తెలియజేస్తామని తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్యూమరేషన్ ఫారమ్‌లో సేన్, ఆయన తల్లి వయస్సుల మధ్య వ్యత్యాసం 15 సంవత్సరాల కన్నా తక్కువగా నమోదు కావడం వల్ల ఈ లాజికల్ డిస్క్రిపెన్సీ ఏర్పడింది.
ఇదో డ్రామా
ఈ పరిణామంపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. నోబెల్ విజేతకు నోటీసు ఇవ్వడం షేమ్ ఫుల్ డ్రామా అంటూ విమర్శించింది. ప్రముఖ వ్యక్తులకు ఎస్ఐఆర్ నోటీసులు ఇవ్వడం బెంగాల్ ప్రజల పట్ల అవమానమని టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీతో పాటు ఎన్నికల సంఘం ఖండించాయి. సోషల్ మీడియా వేదికగా టీఎంసీ స్పందిస్తూ ఇది బీజేపీ–ఈసీ కలసి చేపట్టిన బాంగ్లా-విరోధి అజెండాలో భాగమని ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమర్త్య సేన్‌ను అనుమానాల కిందకు తేవడం సరికాదని పేర్కొంది. ఇదిలా ఉండగా, ఓటర్ల పేర్లలోని అక్షర దోషాలు వంటి చిన్న సాంకేతిక లోపాలను బీఎల్‌ఓలు పరిపాలనా పరంగా సరిదిద్దవచ్చని, వాటితో ఓటరు అర్హతలు లేదా హక్కులపై ఎలాంటి ప్రభావం ఉండదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
