Let's talk: editor@tmv.in
అమరావతి ‘సెల్ఫ్ ఫైనాన్స్’ ప్రాజెక్ట్ అనేది పచ్చి అబద్ధం: సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి ‘సెల్ఫ్ ఫైనాన్స్’ ప్రాజెక్ట్ అనేది పచ్చి అబద్ధం: సజ్జల రామకృష్ణారెడ్డి

Shaik Mohammad Shaffee
13 ఏప్రిల్, 2026

అమరావతి ఒక ‘సెల్ఫ్ ఫైనాన్స్’ ప్రాజెక్ట్ అని, ప్రభుత్వం వద్ద ఉన్న 5 వేల ఎకరాల భూమి విలువ రూ.50 వేల కోట్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు ప్రజలను కాకి లెక్కలతో నమ్మించే ప్రయత్నం చేస్తూ అడ్డంగా దొరికిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, అమరావతి ప్రాజెక్టుపై చంద్రబాబు చేస్తున్న వాదనలను గణంకాలతో సహా తిప్పికొట్టారు.

వడ్డీ భారమే రూ. 4 లక్షల కోట్లు!

చంద్రబాబు చెబుతున్న లెక్కలే నిజమని అనుకున్నా, అభివృద్ధి తర్వాత ఎకరం విలువ రూ.20 కోట్లు కావడానికి కనీసం 15 నుండి 20 ఏళ్లు పడుతుందని లోకేష్, చంద్రబాబులే అంటున్నారని సజ్జల గుర్తు చేశారు. "అప్పటి వరకు తెచ్చిన అప్పులపై వడ్డీయే రూ.3 లక్షల కోట్లకు పైగా అవుతుంది. ఆ వడ్డీ కట్టడానికి కూడా మళ్లీ అప్పులు చేయాల్సిందే. ఇది రాష్ట్రంపై పెను భారం కాదా?" అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ‘ఎండమావి’ జన్‌ కంటే, దశలవారీగా తక్కువ ఖర్చుతో రాజధానిని అభివృద్ధి చేసే జగన్ ‘మావిగన్’ మోడలే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు.

సజ్జల అమరావతి లెక్కలు

చంద్రబాబు చెబుతున్నట్లు అమరావతి స్వయంశక్తితో నడిచే ప్రాజెక్ట్ కాదని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం దగ్గర ఉన్న 5 వేల ఎకరాలను గజం రూ.7,500 చొప్పున అమ్మినా కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే వస్తాయని, కానీ అప్పుడే అంతకు మించి ఖర్చు చేశారని తెలిపారు. పైగా అక్కడ ఎకరం విలువ రూ.10 కోట్లు అని బాబు చెబుతుంటే, ప్రభుత్వ రికార్డుల ప్రకారం అది కేవలం రూ.2.91 కోట్లు మాత్రమే ఉంది. అంటే లేని లాభాలను ఉన్నట్లుగా చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అప్పుల ఊబిలో రాష్ట్రం

అమరావతి కోసం ఇప్పటికే రూ.50 వేల కోట్లకు పైగా కాంట్రాక్టులు ఇచ్చారని, మౌలిక సదుపాయాల కోసం మరో రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని సజ్జల వివరించారు. ఈ రూ.2 లక్షల కోట్ల అప్పుపై ఏటా రూ.15 వేల నుండి 20 వేల కోట్ల వరకు కేవలం వడ్డీయే కట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ భారీ అప్పుల భారం వల్ల రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింటుందని, అమరావతి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న చంద్రబాబు వైఖరిని ప్రజలు గమనించాలని ఆయన కోరారు.