Let's talk: editor@tmv.in
అమరావతి లో రెండవదశ పూలింగ్ మొదలు

అమరావతి లో రెండవదశ పూలింగ్ మొదలు

Dantu Vijaya Lakshmi Prasanna
8 జనవరి, 2026

రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు సీఆర్డీఏ అథారిటీ అనుమతి ఇచ్చినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. బుధవారం నుంచి యండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యిందని వెల్లడించారు.

సచివాలయంలోని ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 57వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి వివరించారు. అమరావతిలో రైల్వే ట్రాక్, ఇంటర్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ నిర్మాణాల కోసం 7 గ్రామాల్లో దశలవారీగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. ల్యాండ్ పూలింగ్ అనంతరం రెండు వరుసల రహదారులు, అండర్‌గ్రౌండ్ కేబుల్స్, వాటర్ లైన్లు వంటి మౌలిక వసతుల కల్పన పనులు ప్రారంభిస్తామన్నారు.

వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి గ్రామాల్లో 9,097.56 ఎకరాల పట్టాభూమి, 7.01 ఎకరాల అసైన్డ్ భూమి, అలాగే పల్నాడు జిల్లాలోని నాలుగు గ్రామాల్లో 7,465 ఎకరాల పట్టాభూమి, 97 ఎకరాల అసైన్డ్ భూమి కలిపి మొత్తం 16,666.57 ఎకరాలను ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. రైతులకు ప్లాట్లు, మౌలిక వసతులు కల్పించిన అనంతరం మిగిలే సుమారు 2,500 ఎకరాల భూమిని స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్‌లకు వినియోగించనున్నట్లు తెలిపారు.

కృష్ణా నది తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం ఒక ఎకరా భూమిని టూరిజం పాలసీ కింద కేటాయించేందుకు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే వాస్తు ప్రకారం వీధి శూల ఉన్న 112 కమర్షియల్ ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు అనుమతి లభించిందన్నారు. అయితే ఈ వెసులుబాటు అసలు లబ్ధిదారులకే వర్తిస్తుందని, ప్లాట్ విక్రయించిన వారికి ఇది వర్తించదని స్పష్టం చేశారు.

సీడ్ యాక్సిస్ రోడ్, మంగళగిరి రోడ్ కనెక్టివిటీ మధ్యలో ఉన్న 4.5 ఎకరాల భూమిని రైతులు ఇప్పటివరకు ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వకపోవడంతో, భూ సేకరణకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరిలో స్టీల్ బ్రిడ్జి పూర్తవుతుందని, అందుకు అనుగుణంగా రోడ్డు నిర్మాణం వేగవంతం చేస్తామన్నారు.

అమరావతిలో ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ చేసిన 34 వేల ఎకరాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, 4,026 అధికారుల భవనాలు, ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు నిర్ణీత గడువులో పూర్తిచేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేలా స్మార్ట్ ఇండస్ట్రీస్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని నాలుగు గ్రామాలను రాజధాని పరిధిలోకి తీసుకోవడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. స్వచ్ఛందంగా రైతులు ల్యాండ్ పూలింగ్‌కు ముందుకు వస్తున్నారని అన్నారు.

ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ 57వ సీఆర్డీఏ సమావేశంలో ఐదు కీలక అంశాలకు ఆమోదం లభించిందని, ముఖ్యంగా ఏపీ సీఆర్డీఏలో 754 పోస్టుల నోటిఫికేషన్, అనాథ చిన్నారులకు పెన్షన్లు, మెరీనా అభివృద్ధి, 112 వీధి శూల ప్లాట్ల మార్పు వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

కాగా, ఇప్పటివరకు భూమి పూలింగ్‌లో భూమి ఇచ్చిన రైతులందరికీ ఇంకా పూర్తిగా ప్లాట్లు కేటాయించలేదు. అమరావతిలో మొదటి దశలో సుమారు 34,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్నారు. ఈ భూమి ఇచ్చిన రైతులకు ప్లాట్లు, రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్, నీటి వసతులు కల్పించిన తరువాతే ప్లాట్ల ఫిజికల్ హ్యాండోవర్ జరుగుతుంది.

ఈ విషయంపై మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో లేఅవుట్లు సిద్ధం అయ్యాయి. కొన్ని గ్రామాల్లో మాత్రమే ప్లాట్ల కేటాయింపు/హ్యాండోవర్ పూర్తయింది. చాలా మంది రైతులకు ఇంకా ప్లాట్లు పూర్తిగా అందలేదు. మౌలిక వసతుల పనులు (రోడ్లు, అండర్‌గ్రౌండ్ లైన్లు) పూర్తికాకపోవడం, లేఅవుట్లలో మార్పులు, రీడిజైన్, పరిపాలనా నిర్ణయాలు, ఆలస్యాల వల్ల ఈజాప్యం జరిగిందని, మిగతావారికి దశలవారీగా ఇవ్వనున్నట్లు తెలిపారు.