Let's talk: editor@tmv.in
అమరావతి రాజధానిగా చట్టబద్ధత… ఏపీ కేబినెట్ ఆమోదం

అమరావతి రాజధానిగా చట్టబద్ధత… ఏపీ కేబినెట్ ఆమోదం

Panthagani Anusha
28 మార్చి, 2026

రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన 1383వ (ప్రస్తుత ప్రభుత్వంలో 46వ) మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. పరిపాలన, న్యాయ, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ తీసుకున్న ఈ నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సమావేశం సాగిందని ఆయన పేర్కొన్నారు.

అమరావతి చట్టబద్ధ హోదా కోసం కీలక అడుగు

రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధాని అంశం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తింపునకు కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5ను సవరించాలని కేంద్రాన్ని కోరేలా శాసనసభలో తీర్మానం తీసుకురానున్నారు. సెక్షన్ ప్రకారం, హైదరాబాద్‌ను 10 సంవత్సరాల పాటు రెండు రాష్ట్రాల సాధారణ రాజధానిగా పేర్కొన్నారు. అయితే ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు స్వంత రాజధాని అంశంపై స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది.

శాసనసభ సమావేశంలో తీర్మానం

నేడు శాసనసభ సమావేశంలో ఈ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం పొందే అవకాశం ఉంది. తీర్మానం ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా పంపించి, చట్ట సవరణకు చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తారు.

న్యాయ వ్యవస్థ బలోపేతం: 1,730 కొత్త పోస్టుల సృష్టి

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సుమారు 8.9 లక్షల కేసుల సత్వర పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైకోర్టు చేసిన ప్రతిపాదనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టులను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ కోర్టుల నిర్వహణ కోసం 1,730 కొత్త పోస్టులను సృష్టించేందుకు అనుమతి ఇచ్చింది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మానవ వనరులను పెంచడం ద్వారా న్యాయ విచారణలో జాప్యాన్ని తగ్గించి సామాన్యులకు సత్వర న్యాయం అందించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

పోలవరం నిర్వాసితులకు అండ: పరిహారం పెంపు

బహుళార్థక సాధక ప్రాజెక్టు అయిన పోలవరం నిర్వాసితుల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. భూమి కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చే పరిహారాన్ని ఎకరాకు రూ. 4.2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల దాదాపు రూ. 565 కోట్ల అదనపు భారం పడనున్నప్పటికీ, నిర్వాసితుల సంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చారు. అదేవిధంగా హంద్రీ-నీవా పనుల కోసం రూ. 606 కోట్లు, పుంగనూరు బ్రాంచ్ కాలువ ఆధునీకరణకు రూ. 169.8 కోట్లు కేటాయించి సాగునీటి రంగానికి ఊతమిచ్చారు.

సామాజిక న్యాయం: వడ్డెరలకు క్వారీ లీజుల్లో ప్రాధాన్యత

వృత్తి పనివారైన వడ్డెరల ఆర్థికాభివృద్ధి కోసం మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్ మినరల్ పాలసీ-2025 కింద 15 శాతం క్వారీలను వడ్డెరలకే రిజర్వ్ చేయాలని నిర్ణయించారు. క్వారీ లీజుల కేటాయింపులో వీరికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రీమియం మరియు సీనరేజ్ ఫీజుల్లో 50 శాతం భారీ రాయితీని ప్రకటించారు. ఇది వడ్డెర కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎంతో దోహదపడనుంది.

విద్యా రంగంలో సంస్కరణలు: కోచింగ్ సెంటర్లపై నియంత్రణ

ప్రైవేట్ కోచింగ్ సంస్థల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేస్తూ, విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణకు ‘ఏపీ కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్-2026’ ముసాయిదాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం కోచింగ్ సెంటర్లలో మౌలిక సదుపాయాలు, బోధన పద్ధతులపై నిఘా పెరగనుంది. అదేవిదంగా కుప్పంలో బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌కు అదనపు సిబ్బందిని కేటాయించి విద్యా ప్రమాణాలను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు.

ఆర్థిక ఊరట: పన్ను మాఫీ సబ్సిడీలు

పట్టణ ప్రజలకు ఊరటనిస్తూ ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం మాఫీని మార్చి 31, 2026 వరకు అమలు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా గృహావసరాలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వాడుతున్న వినియోగదారులకు ‘దీపం-2’ పథకం తరహాలో రాయితీని వర్తింపజేయనున్నారు. ఇంధన రంగంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు గడువును రెండేళ్లు పొడిగిస్తూ అమరావతి ప్రాంతంలో విద్యుత్ ఛార్జీలను 15 శాతం నుండి 2.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.