Let's talk: editor@tmv.in
అమరావతి నిర్మాణ వ్యయంపై పారదర్శకత ఎక్కడ? వంగవీటి నరేంద్ర

అమరావతి నిర్మాణ వ్యయంపై పారదర్శకత ఎక్కడ? వంగవీటి నరేంద్ర

Panthagani Anusha
8 ఏప్రిల్, 2026

రాజధాని అమరావతి నిర్మాణ ఖర్చుల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి వంగవీటి నరేంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న టెండర్ డేటాకు పొంతన లేదని ఆరోపించారు. ఒక చదరపు అడుగు నిర్మాణానికి రూ.7,000 మాత్రమే ఖర్చవుతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని కానీ వాస్తవానికి అది రూ. 12,000 నుంచి రూ. 14,000 వరకు ఉందని గణాంకాలతో వివరించారు.

సీఆర్డీయే భవన నిర్మాణాలకు సంబంధించి 2017, 2018 టెండర్లలో ప్రాజెక్ట్ విలువలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందని నరేంద్ర మండిపడ్డారు. ఏసీలు, లిఫ్టులు, జీఎస్టీ వంటి ఇతర హంగులన్నీ కలిపితే ఒక్కో చదరపు అడుగుకు రూ.8,816 ఖర్చవుతుండగా ప్రభుత్వం మాత్రం తక్కువ చేసి చూపిస్తోందని అన్నారు. ఈ వివరాలను ఆర్టీఐ ద్వారా కోరినా ఇవ్వడానికి నిరాకరించడం వెనుక ఉన్న మర్మమేమిటని ఆయన ప్రశ్నించారు. సెక్రటరీ టవర్స్ వంటి ప్రధాన భవనాల కాంట్రాక్టు విలువలు ప్రారంభంలో రూ.2,200 కోట్లుగా ఉండగా ఇప్పుడు అవి రూ. 7,724 కోట్లకు చేరాయని ఆయన గుర్తు చేశారు.

ప్రజలను తప్పుదోవ పట్టించే 'బిల్డప్' లెక్కలు

బిల్డప్ ఏరియాను వాస్తవంగా ఉన్న 52 లక్షల చదరపు అడుగుల నుండి కృత్రిమంగా 70 లక్షల చదరపు అడుగులకు పెంచి చూపించడం ద్వారా, చదరపు అడుగు ధరను తక్కువగా చూపుతూ ప్రజలను భ్రమల్లో ముంచుతున్నారని నరేంద్ర విమర్శించారు. "ఇలాంటి మోసపూరిత లెక్కల ఉద్దేశ్యం ఏమిటి? అసలు రాజధాని ఎప్పటికి పూర్తవుతుంది? అక్కడ ఎవరు నివసిస్తారు?" అని ఆయన నిలదీశారు. గతంలో ప్రకటించిన 'తొమ్మిది నగరాల' కాన్సెప్ట్ అటకెక్కిందని, కేవలం అసెంబ్లీ, సెక్రటరీ టవర్ల వంటి కొన్ని భవనాలకే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన ప్రాజెక్టులను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు.

విదేశీ సంస్థలకు దోచిపెడుతున్నారా?

డిజైన్లు, సలహాల పేరుతో సింగపూర్, జపాన్ వంటి విదేశీ సంస్థలకు కోట్లాది రూపాయలు చెల్లించడం కేవలం లాభాపేక్షతో కూడిన చర్యేనని నరేంద్ర విమర్శించారు. దీనికి విరుద్ధంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన 'మావిగాన్' (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) మోడల్ ద్వారా రూ. 20,000 కోట్లతోనే అత్యంత ఉపయోగకరమైన రాజధానిని అభివృద్ధి చేయవచ్చని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

కేంద్ర నిధులపై ద్వంద్వ వైఖరి

ఒకవైపు అమరావతిని 'సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ' (స్వీయ నిధుల రాజధాని) అని చెబుతూనే మరోవైపు కేంద్రం వద్ద నిధుల కోసం దేబిరించడం ప్రభుత్వ వ్యూహంలోని వైరుధ్యాన్ని తెలియజేస్తోందని నరేంద్ర ఎద్దేవా చేశారు. పార్లమెంటులో సైతం అమరావతిపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందని ఇది కేవలం కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే కడుతున్న రాజధానిలా కనిపిస్తోందని విమర్శించారు. భారీగా పెంచిన అంచనా వ్యయాలు, పారదర్శకత లేని టెండర్లతో అమరావతి ఒక మోసపూరిత భవనంలా మారుతోందని తక్షణమే ప్రభుత్వం దీనిపై ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.