
అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచండి: ఏపీ సీఎం
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని కేవలం ఒక కాంట్రాక్టు పనులుగా భావించవద్దని ఇది చరిత్రలో భాగస్వామ్యం అయ్యే గొప్ప అవకాశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రీన్ ఫీల్డ్ రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమీక్షించారు. సుమారు రూ.57,821 కోట్ల విలువైన పనులు ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిగేలా పనుల వేగాన్ని మరింత పెంచాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
లక్ష్యాలకు తగ్గట్టుగా పని చేయాల్సిందే
కాగా రాజధానిలో ప్రస్తుతం రూ.50,943 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇప్పటికే పట్టాలెక్కాయని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో 20 వేల మంది కార్మికులు, నిపుణులు శ్రమిస్తున్నారని తెలిపారు. అయితే కొన్ని సంస్థలు ఆశించిన స్థాయిలో పురోగతి చూపకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి వారం రూ. 941 కోట్ల విలువైన పనులు పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించిన సీఎం వార, నెల వారీ లక్ష్యాలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా కార్మికుల కొరత ఉందన్న కాంట్రాక్టర్ల వాదనపై స్పందిస్తూ స్థానిక నైపుణ్యాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని యంత్రాల వినియోగాన్ని పెంచాలని సూచించారు.
ప్రతిష్టాత్మక భవనాలపై ప్రత్యేక దృష్టి
అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ప్రతిష్టాత్మక భవనాలతో పాటు ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎల్‌పీఎస్ సౌకర్యాలు, గృహనిర్మాణం రహదారుల నిర్మాణ పనులపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేదని భరోసా ఇస్తూనే పనుల్లో నాణ్యత వ్యయ నియంత్రణ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. హరిత ఇంధనం, ఆధునిక సాంకేతికతను జోడించి దేశానికే ఆదర్శంగా అమరావతిని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ఇటీవల రాజధాని ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ సామాగ్రి భద్రతలో నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సమర్థులైన ప్రాజెక్ట్ మేనేజర్లను నియమించాలని ఆదేశించారు. అదేవిధంగా ఇసుక, గ్రావెల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆటంకాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా రాజధానిని ప్రజలకు అంకితం చేసేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
