
అమరావతి క్వాంటం వ్యాలీ: 2030 నాటికి ప్రపంచ టాప్-5 క్వాంటమ్ హబ్‌గా ఏపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. 2030 నాటికి ప్రపంచంలోని టాప్-5 క్వాంటం కంప్యూటింగ్ హబ్‌లలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపడమే లక్ష్యంగా అమరావతి క్వాంటం వ్యాలీ కార్యాచరణను ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు
క్వాంటం టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్‌గా మార్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్ భాగాలు, హార్డ్‌వేర్, ఆల్గోరిథమ్స్ ఇతర సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. కాగా ఇప్పటికే మేధా టవర్స్‌లో తాత్కాలికంగా క్వాంటం కంప్యూటింగ్ మిషన్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.
'మేడ్ ఇన్ అమరావతి' నినాదంతో ముందుకు..
స్థానికంగానే క్వాంటం కంప్యూటర్ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు 'మేడ్ ఇన్ అమరావతి' కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ఇందులో భాగంగా క్రయోజనిక్స్, ఫోటోనిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. స్టార్టప్‌లు, బయో-ఫౌండ్రీల ద్వారా వినూత్న డిజైన్లు, పరిశోధనలను ప్రోత్సహించడం ద్వారా యువ శాస్త్రవేత్తలకు, పరిశ్రమలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేశంలోనే తొలి క్వాంటం పాలసీ ఏపీదే
అయితే దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర-నిర్దిష్ట 'క్వాంటం కంప్యూటింగ్ విధానాన్ని' రూపొందించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే గుర్తింపు పొందిందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సాంకేతిక విప్లవం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే కాకుండా, వేల సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
దిగ్గజ సంస్థల భాగస్వామ్యం
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జాతీయ క్వాంటం మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి, రాష్ట్ర క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్, ఐబీఎం డైరెక్టర్ అమిత్ సాంగ్హీలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన సీ-డాక్, సీ-డాట్, డీఆర్డీఓ, బార్క్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా క్వాంటం హార్డ్‌వేర్ ఎకోసిస్టమ్ ఏర్పాటులో ఈ సంస్థల సహకారం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
