
అమరావతి కాబోయే మినీ ఆర్థిక రాజధాని
అమరావతి ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, భీమా కంపెనీల కొత్త కార్యాలయాలకు శంకుస్థాపనతో వార్తల్లో నిలిచింది. ప్రముఖంగా కేంద్ర ఆర్ధిక మంత్రి చేతులమీదుగా ఈ బృహత్తర కార్యం జరిగింది.
శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకోగానే ఆమెకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పయ్యావుల కేశవ్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల కొత్త కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, నాబార్డ్ వంటి ఆర్థిక సంస్థలకు సంబంధించిన ఈ ప్రాజెక్టుల ద్వారా అమరావతికి మొత్తం రూ.1,328 కోట్ల పెట్టుబడి రానుంది. ఈ ప్రాంతంలో 6,541 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. వివరాల్లో కి వెళ్తే..
మొదటి చారిత్రక సంఘటన అన్న కేంద్ర ఆర్ధిక మంత్రి
ఒకేసారి జరిగిన 15 ప్రభుత్వ బ్యాంకుల, బీమా కంపెనీల శంకుస్థాపనల అనంతరం ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, "శాస్త్రీయ సంప్రదింపులతో ప్రారంభమైన అమరావతికి ఆర్థిక మద్దతు అవసరం, ఆ లక్ష్యంతోనే 15 ఆర్థిక సంస్థలకు ఈ రోజు పునాది వేశాము." అని అన్నారు.
అన్ని ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఒకే ఆర్థిక వీధిలో సమావేశమవడం అనేది భారతదేశంలోని ఏ రాష్ట్ర రాజధానిలోనూ జరగలేదు. ఇది నిజంగా మొదటి చారిత్రక సంఘటన అని ఆమె అభివర్ణించారు.ఈ ఆర్థిక సంస్థల అధిపతులందరూ ఒక్క రోజులో ఒక్క వేదికపై హాజరైనందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, నిలిచిపోయిన రాజధాని ప్రాజెక్టును తిరిగి ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి కృషిని ఆమె 'బ్రహ్మ యజ్ఞం' (అత్యంత కష్టతరమైన పని)తో పోల్చుతూ ప్రశంసించారు. భవిష్యత్తులో ఒక ఆర్ధిక రాజధాని గా అమరావతి నిలిచే అవకాశం ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఈ అభివృద్దికి ప్రధానమంత్రి మద్దతు ఉందని కూడా ఆమె బలంగా చెప్పారు.
"వివరణాత్మక ప్రణాళికతో ఒక కొత్త రాజధానిని నిర్మించడం అనేది సాధారణ విజయం కాదు. ఇది అతి త్వరలో చాలా శ్రేయస్సు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన రాజధానిగా ఉద్భవిస్తుందని నేను చాలా నమ్మకంగా ఉన్నాను," అని ఆమె అన్నారు.
ముఖ్య మంత్రి చంద్రబాబు స్పందిస్తూ..
శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గత పాలకుల విధ్వంసంతో ఆగిపోయిన అమరావతి రాజధాని పనుల్ని ప్రధాని మోదీ పునఃప్రారంభించారు. రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులకు ధన్యవాదాలు. ప్రపంచంలో స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పూలింగ్ విధానంలో భూముల పొందిన ప్రాంతం అమరావతి . కేంద్రం రూ.15 వేల కోట్లను రాజధాని పునర్నిర్మాణానికి కేటాయించింది. రూ.1,334 కోట్లతో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకం అన్నారు. బ్యాంకులు, బీమా కంపెనీల ఏర్పాటుతో 6,556 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పేరిట బ్యాంకులు, ఆర్ధిక సంస్థల కోసం అమరావతిలో స్థలం కేటాయించామన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ, కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఆప్కాబ్, నాబార్డ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లు ఇక్కడికి వచ్చాయి. ఈ సంస్థలన్నీ తమ ప్రధాన కార్యాలయాలను అద్భుతంగా నిర్మించాలని కోరుతున్నానన్నారు. ప్రతీ ఇంట్లో మహిళలే ఆర్ధిక మంత్రులు. మన దేశానికి కూడా మహిళా ఆర్ధిక మంత్రే ఉన్నారు అని నిర్మల సీతారామన్ ను కొనియాడారు.
దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఆమె అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. దేశాన్ని ప్రధాన మంత్రి అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే...ఆర్థికమంత్రి ఆదేస్థాయిలో సహకరిస్తున్నారన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ఆర్ధిక వ్యవస్థ పెరగటంతో పాటు సామాన్యులకూ లబ్ది కలిగిందన్నారు.
అమరావతికి రాబోయే కాలంలో మరిన్ని ప్రాజెక్టులు
ఈ సందర్భమగా చంద్రబాబు కొత్త ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ, ఇటీవల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థ ఓ కాస్మోస్ ప్లానెటోరియం నిర్మాణానికి ఒప్పందం జరిగింది. ప్లానెటోరియం ఏర్పాటు చేసేందుకు అమరావతిలో స్థలం కూడా కేటాయించామన్నారు.
ధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థ, గతంలో విభజన వల్ల జరిగిన నష్టాల నుంచి ఇప్పుడే గాడిన పడుతున్నాం. ఇంకా ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి సాధించగలం అన్న విశ్వాసం మాకు ఉంది. త్వరలోనే సీడ్ యాక్సెస్ రహదారి కూడా పూర్తి అవుతుంది. 2028 కల్లా నిర్మాణాలు పూర్తి అవుతాయి. 7 జాతీయ రహదారులు, రైల్వేలైన్లు అమరావతికి కనెక్టు అవుతాయి. అమరావతి పూర్తిగా గ్రీన్, బ్లూ సిటీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. భారతదేశం గర్వపడేలా అమరావతిని నిర్మాణం చేస్తాం. ఇప్పటికే విట్, ఎస్ఆర్ఎం, బిట్స్ పిలానీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతికి వచ్చాయి. క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ద్వారా ఆర్ధిక లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగేలా ప్రణాళిక చేశామన్నారు. 2047కి భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. అందులో ఏపీది కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ, ఆశ వదులుకున్న పోలవరాన్ని మళ్లీ రీస్ట్రక్చర్ చేసేందుకు కేంద్రం సహకరించింది. రూ.400 కోట్లతో కట్టిన డయాఫ్రాం వాల్ ధ్వంసం అయితే మళ్లీ రూ.1,000 కోట్లు ఇచ్చి డయాఫ్రాం వాల్ నిర్మాణం చేసేందుకు నిధులిచ్చారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అలాగే 2028 నాటికి కూడా అమరావతి నిర్మాణాలు పూర్తి అవుతాయన్నారు.
పరిశ్రమలు రాకుండా పారిపోయిన ఏపీకి మళ్లీ కూటమిపై భరోసాతో పెట్టుబడులు వస్తున్నాయి. రూ.1.37లక్షల కోట్ల పెట్టుబడులతో గూగుల్ విశాఖకు వస్తోంది. గోదావరి, కృష్ణా నదుల నుంచి వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయి. పోలవరం నుంచి నల్లమల సాగర్ లింక్ ద్వారా నీళ్లు తీసుకెళ్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలు వాడుకుని దేశసంపద పెంచేలా రాయలసీమకు నీళ్లు పారించాలని భావిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి ఆదుకోవాలని ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్టటంలో ఈ నీరు కీలకం అవుతుంది. ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. పూర్వోదయ ప్రాజెక్టు కింద ఉదారంగా నిధులు ఇస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. కేంద్ర సహకారం వల్ల చాలా వరకూ రాష్ట్రం రికవర్ అవుతోంది. ఆర్ధికంగా అన్నీ రంగాలలో నిలదొక్కుకుని దేశప్రగతికి, సంపదకు బ్యాక్ బోన్ గా ఏపీ నిలబడుతుందని హామీ ఇస్తున్నానన్నారు. కేంద్ర సహకారంతో అమరావతి ఇక అన్ స్టాపబుల్ అని వ్యాఖ్యానించారు.
బ్యాంకులు వేస్తున్న ఈ పునాదులు అమరావతి ఆర్ధిక భవిష్యత్ నిర్మాణానికి కీలకమన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ తన స్పందనని తెలియజేస్తూ, జరుగుతున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఆర్ధిక లావాదేవీల కేంద్రంగా అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేయటం శుభసూచికం అన్నారు. బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట ఉండటం అరుదు. అది అమరావతి సాధించింది. ఈ కేంద్ర కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండటం ఆర్ధికంగా అందరికీ ప్రయోజనం కూడా అన్నారు. రూ.1334 కోట్ల వ్యయంతో ఈ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. బ్యాంకులు వేస్తున్న ఈ పునాదులు అమరావతి ఆర్ధిక భవిష్యత్ నిర్మాణానికి కీలకంగా మారనున్నాయన్నారు.
సీఎం చంద్రబాబుపై ఉన్న విశ్వాసంతో రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు. అమరావతి పునర్నిర్మాణం కోసం, పోలవరం కోసం, స్టీల్ ప్లాంట్ కోసం నిధులు ఇచ్చి సహకరించిన కేంద్రానికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ను అడుగడుగునా ఆదుకుంటున్న ప్రధాని మోదీ, కేంద్ర ఆర్ధిక మంత్రికి ధన్యవాదాలు అంటూ ముగించారు.
కేంద్రం ఆక్సిజన్ అందించిందన్న మంత్రి పయ్యావుల కేశవ్
ఈ కార్యక్రమంలో పయ్యావుల మాట్లాడుతూ, గత పాలకుల వల్ల ఐసీయూలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ఆక్సిజన్ అందించింది.దీనికి రాష్ట్ర ప్రజల తరపున కేంద్రానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాలతో దేశ ఆర్ధిక వ్యవస్థ అంతా ఏపీకి వచ్చినట్టు ఉంది. ఆర్ధిక వనరుల విషయంలో సీతారామన్ కాస్త కఠినంగానే ఉంటారు. మన ఇంట్లో అమ్మలాగే ఎప్పుడు ఏది అవసరమో, అప్పుడే నిధులు ఇస్తారన్నారు.ఇంత పెద్ద భారత దేశంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థను నిర్వహించటం మాటలు కాదు. మా రాజకీయ హెడ్ మాస్టర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఫలితాలు సాధించే విషయంలో కఠినంగానే ఉంటారని చమత్కరించారు. అందుకే ప్రతిఫలాలు ప్రజలకు అందిస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ కు ఇంధనం ధనమే అన్నారు. వందేభారత్ రైళ్లు, డిఫెన్స్ సెక్టార్, విద్య, వైద్య రంగాల్లో నిధుల కేటాయింపు పెరుగుతోంది. దేశం గుర్తు పెట్టుకునేలా కేంద్ర ఆర్ధిక మంత్రి సేవలు అందిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణల ప్రకటించినప్పుడు అత్యంత వేగంగా దానిని దేశవ్యాప్తంగా అమలు చేయటం ఆశ్చర్యపరిచింది. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి, విశాఖ ఉక్కుకు ఆర్ధిక సహకారం కేంద్రం అందిస్తోందని పయ్యావుల కేశవ్ అన్నారు.
ఆర్ధిక మంత్రి పై ప్రశంసలు - కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
కేంద్రమంత్రి పెమ్మసాని మాట్లాడుతూ, 8 మార్లు ఆర్ధిక మంత్రిగా బడ్జెట్లు ప్రవేశపెట్టిన చరిత్ర సాధించారు నిర్మలా సీతారామన్ అన్నారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను విలీనం చేసి ఖాయిలా ప్రమాదం నుంచి వాటిని కాపాడారు ఆమె, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారికి నిర్మలాసీతారామన్ స్పూర్తి అంటూ ఆర్ధిక మంత్రిని ప్రశంసించారు. 34 వేల ఎకరాలను రైతులు రాజధాని కోసం త్యాగం చేశారు. అమరావతి అంటే ఆంధ్రుల ఆత్మవిశ్వాసం, రాష్ట్ర భవిష్యత్ కల అంటూ పేర్కొన్నారు.
మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని ఇది నారా లోకేష్
దేవతల రాజధాని అమరావతిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయి. మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూశారు. ఒక్క వ్యక్తికోసం రూ.450 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో రైతులు పోరాడారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జై అమరావతి నినాదంతో ముందుకు వెళ్లామన్నారు. అమరావతిని ఆపడానికి అది ఎవరి ఇంట్లోనో లైట్ స్విచ్ కాదు. పవర్ ఫుల్ ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని ఇది అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పనులు పునఃప్రారంభించి జెట్ స్పీడ్ లో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ అంటూ ఆమెను ప్రశంసించారు.
ఈ శంకుస్థాపన సందర్భంగా, మంగళగిరి చేనేత వస్త్రాలు ధరించి ప్రమోట్ చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు అన్నారు. ఏపీ ఏ సాయం కోరినా ఆర్ధిక మంత్రి సహకారం అందిస్తున్నారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వటంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా ఆదుకున్నారు. భారత్ లో అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ విశాఖకు వస్తోంది. దీనికి అండగా ఆమె నిలిచారన్నారు. 15 బ్యాంకులు, బీమా కంపెనీలు రూ.1334 కోట్లతో తమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. రాజధానిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని బ్యాంక్ స్ట్రీట్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా లావాదేవీలకు ఈ కార్యాలయాలు పనిచేస్తాయన్నారు.
ఇదిలా వుండగా, అమరావతిలో జరిగే బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన నిర్మలా సీతారామన్ గురువారం రాత్రి ముఖ్యమంత్రితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిన్నర్ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని సిఎం నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ కు సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి స్వాగతం పలికారు.
