
‘అమరావతి ఎకనామిక్ రీజియన్’ అమలుకు ప్రత్యేక కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంతో పాటు పరిసర జిల్లాల సమగ్ర ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది జిల్లాల పరిధిలో ప్రణాళికలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమన్వయం చేసేందుకు 'అమరావతి ఎకనామిక్ రీజియన్' (ఏఈఆర్) అమలు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలోకి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలు వస్తాయి. ఈ తొమ్మిది జిల్లాలను అంతర్జాతీయంగా పోటీ పడేలా సమగ్ర ఆర్థిక ప్రాంతాలుగా మార్చడమే ఈ చొరవ యొక్క ముఖ్య ఉద్దేశమని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రత్యేక ఆర్థిక మండలి ద్వారా కేవలం పరిపాలనా సరిహద్దులకే పరిమితం కాకుండా, ప్రాంతాల సరిహద్దులు దాటి సమగ్ర మౌలిక సదుపాయాల ప్రణాళికలను రూపొందించనున్నారు. అమరావతి కేంద్రంగా జరగబోయే ఆర్థిక వృద్ధి కేవలం రాజధానికే పరిమితం కాకుండా, ఈ 9 జిల్లాల్లోని అన్ని నగరాలు, పట్టణాలు ఎదుగుతున్న పారిశ్రామిక కేంద్రాలకు విస్తరించేలా ఈ కమిటీ చూస్తుంది. దేశీయ, ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడం, రవాణా అనుసంధానతను మెరుగుపరచడం, పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్కులు, ఇన్నోవేషన్ హబ్‌ల స్థాపన ద్వారా భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాల అభివృద్ధి నమూనాను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
కమిటీ నిర్మాణం - బాధ్యతలు
ఈ అమలు కమిటీకి 'అమరావతి ఎకనామిక్ రీజియన్' (ఏఈఆర్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్ ఇందులో మెంబర్-కన్వీనర్‌గా ఉంటారు. వీరితో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ కమిటీలో సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ప్రాజెక్టుల పురోగతి, వస్తున్న పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక 'డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్'ను ఏర్పాటు చేయనున్నారు. జవాబుదారీతనాన్ని పెంచడానికి, పనులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా చూడటానికి ఈ కమిటీ ప్రతి నెలా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తుంది.
ఈ కమిటీ కేవలం ప్రణాళికలకే పరిమితం కాకుండా, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య తలెత్తే భూ సమస్యలు, అనుమతుల జాప్యం వంటి అడ్డంకులను తొలగించడానికి ఒక ఉమ్మడి వేదికగా పనిచేస్తుందని సురేష్ కుమార్ వివరించారు. అలాగే కేంద్ర మంత్రిత్వ శాఖలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి వనరులను సమీకరించడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
