
అమరావతిలో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
అమరావతి రాజధాని పరిధిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో తొలిసారిగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. విశాల విస్తీర్ణంలో సుందరంగా అభివృద్ధి చేసిన ఈ ప్రాంతం పచ్చదనం విశాల ప్రాంగణాలు అత్యుత్తమ మౌలిక వసతులతో వేడుకలకు ప్రత్యేక శోభనిచ్చేలా అలంకరించారు.
ఈ వేడుకల సందర్భంగా శనివారం ఉదయం పరేడ్ ఫుల్‌డ్రెస్ రిహార్సల్‌ను ఘనంగా నిర్వహించారు. రిహార్సల్‌ను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జే. శ్యామలరావు పరిశీలించారు. జంగారెడ్డి గూడెం ఏఎస్పీ, పరేడ్ కమాండర్ ఆర్. సుస్మిత నుంచి డీజీపీ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ పరేడ్‌లో ఇండియన్ ఆర్మీ, ఏపీఎస్పీ, సీఆర్పీఎఫ్, కేరళ ఆర్మ్డ్ పోలీస్, ఎన్‌సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, యూత్ రెడ్ క్రాస్ తదితర విభాగాలకు చెందిన కంటింజెంట్లు పుల్‌డ్రెస్‌లో కవాతు ప్రదర్శనలు ఇచ్చాయి. వివిధ బెటాలియన్ల కమాండర్లు సమన్వయంతో రిహార్సల్‌ను విజయవంతంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖలకు చెందిన మొత్తం 22 శకటాలను ప్రదర్శించారు. ‘వందేమాతరం 150 వసంతాలు’ ఇతివృత్తంతో సాంస్కృతిక శాఖ ‘జీరో పావర్టీ’ లక్ష్యంతో ప్రణాళికా శాఖ–సెర్ఫ్, జనాభా నిర్వహణ–మానవ వనరుల అభివృద్ధి అంశాలతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య, స్త్రీ–శిశు సంక్షేమ శాఖలు శకటాలను రూపొందించాయి. అదేవిదంగా నైపుణ్యం–ఉపాధి, నీటి భద్రత, రైతు–వ్యవసాయ సాంకేతికత ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, ఖర్చు తగ్గింపు–శక్తి, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్ వంటి ఇతివృత్తాలతో సంబంధిత శాఖలు శకటాలను ప్రదర్శించాయి.
ఈ ఫుల్‌డ్రెస్ రిహార్సల్‌కు గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, పోలీస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు. అమరావతిలో జరగనున్న ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపునిచ్చేలా ఉండనున్నాయని అధికారులు తెలిపారు. కాగా నేడు ఉదయం నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, గౌరవ హైకోర్టు న్యాయాధిపతులు, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తదితర ప్రముఖులు అతిథులుగా పాల్గొననున్నారు.
