
అమరావతిలో ఏప్రిల్ 14న తొలి క్వాంటం కంప్యూటర్ల ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. రాష్ట్రాన్ని అత్యాధునిక సాంకేతిక కేంద్రంగా (టెక్ హబ్) తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ నిర్మిత ఓపెన్-యాక్సెస్ క్వాంటం కంప్యూటర్లు “అమరావతి 1ఎస్, అమరావతి 1క్యూ” లను ఏప్రిల్ 14న ‘వరల్డ్ క్వాంటం డే’ సందర్భంగా ఆయన జాతికి అంకితం చేయనున్నారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సన్నాహకంగా ఏప్రిల్ 10 నుంచే అమరావతిలో సాంకేతిక సందడి మొదలుకానుంది. ఈ సందర్భంగా క్వాంటం కంప్యూటింగ్ సామర్థ్యాన్ని చాటిచెప్పేలా వివిధ రకాల డెమోలు, వర్క్‌షాపులు సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. దేశీయంగా క్వాంటం హార్డ్‌వేర్ అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఒక పటిష్టమైన పునాది వేస్తుందని ముఖ్యమంత్రి కార్యదర్శి పి.ఎస్. ప్రద్యుమ్న వెల్లడించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రక్షణ, ఆరోగ్యం, సెమీకండక్టర్లు, క్రయోజెనిక్స్ వంటి కీలక రంగాల్లో ఈ కంప్యూటర్ల సేవలు విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి.
‘అమరావతి క్వాంటం వ్యాలీ తో అంతర్జాతీయ ఖ్యాతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ అమరావతి క్వాంటం వ్యాలీ ’ ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి క్వాంటం హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద అభివృద్ధి చేసిన అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్ (ఏక్యూఆర్ఎఫ్) దేశంలోనే తొలి క్వాంటం హార్డ్‌వేర్ టెస్ట్‌బెడ్స్‌గా సేవలు అందించనున్నాయి. ఇప్పటి వరకు మన దేశంలో ఇలాంటి పూర్తి స్థాయి సదుపాయాలు లేకపోవడంతో పరిశోధకులు విదేశీ సాంకేతికతపై ఆధారపడాల్సి వచ్చేది. ఇకపై పరిశోధన, ధృవీకరణ ప్రమాణీకరణ ప్రక్రియలు ఇక్కడే నిర్వహించుకునే వీలుంటుంది.
ఈ క్వాంటం సిస్టమ్స్‌లో విశేషమేమిటంటే ఇందులో వాడిన సుమారు 80 శాతానికి పైగా భాగాలు దేశీయంగానే రూపొందించారు. అత్యంత క్లిష్టమైన మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ (పరమ శూన్య ఉష్ణోగ్రత) వద్ద పనిచేసేలా కేబుల్స్, యాంప్లిఫైయర్లు వంటి హార్డ్‌వేర్‌ను మన శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టులో ఐబిఎం, టిసిఎస్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు ఐఐఎస్‌సి, డిఆర్‌డిఓ వంటి ప్రభుత్వ పరిశోధన సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి.
విద్యార్థులకు ‘ఓపెన్ యాక్సెస్’ వరం
సాధారణంగా విదేశాల నుంచి వచ్చే క్వాంటం కంప్యూటర్లు ‘బ్లాక్ బాక్స్’ తరహాలో ఉండి, వాటి అంతర్గత పనితీరును తెలుసుకునే వీలుండదు. అయితే అమరావతి క్వాంటం కంప్యూటర్లు విద్యార్థులు, శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లకు ‘ఓపెన్ యాక్సెస్’ కల్పిస్తున్నాయి. దీనివల్ల ప్రయోగాలు చేసేందుకు కొత్త ఆవిష్కరణలు చేపట్టేందుకు యువతకు అద్భుతమైన అవకాశం లభించనుంది. సాంకేతికతతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఇప్పటికే 60,000 మందికి శిక్షణ ఇవ్వగా వీరిలో మహిళల భాగస్వామ్యం 51 శాతం ఉండటం విశేషం. రాబోయే ఐదేళ్లలో 45 లక్షల మందికి క్వాంటం రంగంలో శిక్షణ ఇవ్వాలని అందులో 10 లక్షల మందికి ఐబిఎం ద్వారా శిక్షణ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటం వంటి మార్పులకు అనుగుణంగా మనం సిద్ధం కాకపోతే సాఫ్ట్‌వేర్ రంగంలో వెనకబడిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
