Let's talk: editor@tmv.in
అమరావతిపై సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరి: ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు

అమరావతిపై సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరి: ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు

Panthagani Anusha
7 ఏప్రిల్, 2026

రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను తీవ్రంగా తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవ రావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం కోర్టులకు ట్రైబ్యునళ్ల ఒక మాట ప్రజలకు మరో మాట చెబుతూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు.

ఢిల్లీలో వందేళ్లు.. ఇక్కడ నాలుగేళ్లా?

అమరావతి నిర్మాణానికి 100 సంవత్సరాలు పడుతుందని ఢిల్లీ ట్రిబ్యునల్‌కు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం పేర్కొందని, కానీ ప్రజల ముందుకు వచ్చేసరికి 2028-29 నాటికి రాజధాని పూర్తవుతుందని మభ్యపెడుతున్నారని తూమాటి విమర్శించారు. ఒకవైపు ఆర్థిక మంత్రి జీతాలకే డబ్బులు లేవని చెబుతుంటే మరోవైపు లక్షల కోట్ల వ్యయంతో రాజధానిని తామే నిర్మిస్తామనడం కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమేనని ఎద్దేవా చేశారు.

మండలిని ఎందుకు పక్కన పెడుతున్నారు?

రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. రాజధానిపై శాసన మండలిలో చర్చ జరిగితే భూకుంభకోణాలు, కాంట్రాక్టుల అవినీతి బయటపడుతుందనే భయంతోనే ప్రభుత్వం చర్చను తప్పించుకుంటోందని అన్నారు. పార్లమెంట్‌లో ఉభయ సభల్లో చర్చలు జరిగినట్లుగా, ఇక్కడ మండలిని ఎందుకు భాగస్వామ్యం చేయడం లేదని ప్రశ్నించారు. అమరావతిపై తీసుకువచ్చింది బిల్లునా లేక కేవలం తీర్మానమా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు (మావిగన్) మోడల్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తూమాటి తెలిపారు. ఈ మూడు నగరాలను అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేయడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుందని ఇది నిజమైన అభివృద్ధి వృద్ధి ఇంజిన్‌గా మారుతుందని పేర్కొన్నారు. కాగా ఈ ప్రతిపాదనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం బాధ్యతారాహిత్యమని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు

మరోవైపు రాష్ట్రంలో సంక్షేమం కుంటుపడిందని ఆరోగ్యశ్రీ సేవలు అందక పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని గత పాలనలో జగన్ సంక్షేమం-అభివృద్ధిని సమతూకంలో నడిపించారని గుర్తుచేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే భయంతోనే ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని కేవలం 22 నెలల్లోనే భారీగా అప్పులు చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.

అమరావతిపై సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరి: ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు - Tholi Paluku