
అమరావతిపై అసెంబ్లీ తీర్మానం ప్రజల దృష్టి మరల్చే రాజకీయ ఎత్తుగడ: సజ్జల రామకృష్ణ రెడ్డి
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే పేరుతో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుతున్న రాజకీయ నాటకమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం తన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ తరహా విన్యాసాలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సజ్జల ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన అటకెక్కిందని, లేఅవుట్లు అభివృద్ధి చేయకుండా, రైతులకు అనుకూలం కాని చోట ప్లాట్లు చూపించి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తిని ప్రశ్నలను అణచివేసేందుకే ఈ తీర్మానం ద్వారా కొత్త డ్రామాకు తెరలేపారని ఆయన మండిపడ్డారు.
కాగా అమరావతిని తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని కేవలం అక్కడ జరుగుతున్న అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని సజ్జల స్పష్టం చేశారు. అమరావతికి ఎవరు అభ్యంతరం చెప్పారు? నిర్మాణాన్ని ఎవరు అడ్డుకున్నారు? గతంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కూడా అమరావతికి వ్యతిరేకం కాదు కేవలం వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షించారు అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చర్చకు నిజంగా సిద్ధమైతే శాసన మండలిని కూడా ఎందుకు సమావేశపరచడం లేదని అక్కడ సమాధానం చెప్పలేకనే తప్పించుకుంటున్నారని నిలదీశారు.
గత 2014-19 మధ్య కాలంలో అమరావతి ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీ జరిగిందని సజ్జల ఆరోపించారు. తాత్కాలిక భవనాల నిర్మాణ వ్యయాన్ని చదరపు అడుగుకు రూ.3,500 నుంచి రూ.19,000కు పెంచి ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు ప్రస్తుతం మళ్లీ అదే కమీషన్ల పర్వం కొనసాగుతోందని, కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో కమీషన్లపై వచ్చిన ఐటీ నోటీసులకు సమాధానం లేదని, చంద్రబాబు విధానాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందని ఆయన హెచ్చరించారు.
