Let's talk: editor@tmv.in
అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించాలి: టీడీపీ ఎంపీ

అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించాలి: టీడీపీ ఎంపీ

Panthagani Anusha
28 జనవరి, 2026

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను బలంగా ప్రస్తావించింది. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలకాలని అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తించేలా ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టాలని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్‌ చేశారు.

మూడు రాజధానుల నిర్ణయంతో అయోమయం

గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును అయోమయంలోకి నెట్టిందని శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. ఈ పరిస్థితి వల్ల పరిపాలన, అభివృద్ధి తీవ్రంగా దెబ్బతిన్నాయని అమరావతికి చట్టబద్ధమైన భద్రత కల్పించడం ద్వారానే రాష్ట్రానికి స్థిరత్వం వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సోషల్‌ మీడియాపై కఠిన నియంత్రణలు అవసరం

భేటీలో భాగంగా సామాజిక భద్రతకు సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్‌ మీడియా ప్రభావం ఆందోళనకరంగా ఉందని ఆస్ట్రేలియా వంటి దేశాలు అమలు చేస్తున్న విధంగా భారత్‌లోనూ కఠిన నియంత్రణలు తీసుకురావాలని డిమాండ్ చేసారు.

ప్రజాప్రతినిధుల బాధ్యత పెంచే చట్టం కావాలి

ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతను పెంచేందుకు ప్రధాని ముఖ్యమంత్రి సహా కీలక పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు 30 రోజులకుపైగా జైలులో ఉంటే పదవిని కోల్పోయేలా చట్టం చేయాలని అదేవిదంగా భారత్‌ ఇతర దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశీయ రైతులు, చిన్న వ్యాపారాలపై చూపే ప్రభావంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరగాలని ప్రతిపాదించినట్లు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర సహకారం

నీటిపారుదల రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అండగా నిలవాలని ‘పూర్వోదయ’ పథకం కింద రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించాలని, నదుల అనుసంధాన కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించాలని విన్నవించింది. అదేవిధంగా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న కొనుగోలు సమస్యలను కూడా అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించినట్లు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. రైతులను ఆదుకునేలా కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జనవరి 28న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రాల సమస్యలు, జాతీయ అంశాలపై రాజకీయంగా కీలక చర్చలు జరగనున్నాయి. బడ్జెట్‌ సమావేశాలకు ముందు నిర్వహించిన ఈ అఖిలపక్ష సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్‌ రిజిజుతో పాటు వివిధ రాజకీయ పార్టీల జాతీయ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.