
అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించాలి: ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలల రాజధాని ‘అమరావతి’కి తిరుగులేని చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గ్రీన్‌ఫీల్డ్ నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తించాలని కోరుతూ శనివారం అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 (2) ను సవరించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు సభ ఆమోదం తెలిపింది.
చట్టంలో స్పష్టత కోసమే ఈ ప్రతిపాదన
సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుత విభజన చట్టం ప్రకారం, పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు ముగిసిన తర్వాత ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు కావాలని ఉంది తప్ప, ఆ స్థలం పేరు స్పష్టంగా లేదు. ఈ అనిశ్చితిని తొలగించేందుకు సెక్షన్ 5, సబ్-సెక్షన్ 2లో ‘అమరావతిలో’ అనే పదాన్ని చేర్చాలని తీర్మానం కోరింది. అదేవిదంగా ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ -2014) పరిధిలోని ప్రాంతమే అమరావతి అని చట్టం వివరణలో పొందుపరచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
అంగుళం కూడా కదిలించలేరు: సీఎం
తీర్మానంపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ "ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నది ఒకే ఒక్క రాజధాని అది అమరావతి మాత్రమే. ఇది కేవలం నగరం కాదు, ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక. దీనిని ఎవరూ తాకలేరు, ఒక్క అంగుళం కూడా కదలించలేరు. అమరావతి శాశ్వత రాజధాని అని పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పించుకోవడం మన హక్కు అని ఆయన కుండబద్దలు కొట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గందరగోళానికి చెక్ పెట్టి మదుపరులలో నమ్మకం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వేగవంతం కానున్న మౌలిక వసతుల పనులు
రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్న ఈ నిర్ణయం అమరావతి నిర్మాణానికి పెద్ద ఊతాన్ని ఇవ్వనుంది. పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో ఈ సవరణ జరిగితే రాజధాని ప్రాజెక్టులకు అంతర్జాతీయ స్థాయిలో నిధుల సేకరణ సులభతరం అవుతుంది. ఇప్పటికే నిలిచిపోయిన భవన నిర్మాణ పనులు భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఈ చట్టబద్ధత ఒక రక్షణ కవచంలా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తీర్మానాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి పంపి కేంద్ర కేబినెట్ ఆమోదం పొందేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
