
అమరావతిని ‘ఫ్రీ జోన్’గా ప్రకటించండి: సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో వేగం పెంచడంతో పాటు, దానిని అంతర్జాతీయ స్థాయి ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తక్షణమే ‘ఫ్రీ జోన్’గా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. మంగళవారం ఆయన అమరావతి అభివృద్ధిపై మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం అమరావతి వైపు ప్రపంచ స్థాయి కంపెనీలు మొగ్గు చూపుతున్న తరుణంలో ఈ ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా మార్చడం వల్ల భారీగా పెట్టుబడులు రావడమే కాకుండా, స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రామకృష్ణ పేర్కొన్నారు. రాజధాని అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటోందని, ఆ అప్పులను తీర్చాలన్నా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలన్నా ఇక్కడ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
రైతుల పట్ల వివక్ష వద్దు
భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) కింద భూములిచ్చిన రైతుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం సరికాదని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. "ఒకవైపు పాలకులు, మంత్రులు తమ నివాసాలు నిర్మించుకుంటుంటే రాజధాని కోసం త్యాగాలు చేసిన రైతులు ఇంకా తమ ప్లాట్ల కోసం ఎదురుచూడటం దురదృష్టకరం. రైతులకు వెంటనే ప్లాట్లు కేటాయించి వారు సొంత ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
అదేవిదంగా కేంద్ర ప్రభుత్వం అమరావతిని ఫ్రీ జోన్‌గా గుర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తూ రాజధానిని ఒక పరిపాలనా కేంద్రంగానే కాకుండా ఆర్థిక హబ్‌గా మార్చినప్పుడే ఈ ప్రాంత ప్రజల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని రామకృష్ణ పేర్కొన్నారు.
ఇక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి అభివృద్ధికి నిరంతరం ఆటంకాలు కలిగిస్తున్నారని అధికారం కోల్పోయినప్పటికీ రాజధాని విషయంలో గందరగోళం సృష్టించి పనులను అడ్డుకోవాలని జగన్ చూస్తున్నారని ముఖ్యమంత్రి గారు జగన్ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొని అమరావతి అభివృద్ధికి ఎటువంటి విఘాతం కలగకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అని సూచించారు.
