Let's talk: editor@tmv.in
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం

అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం

Panthagani Anusha
21 జనవరి, 2026

ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని పారిశ్రామికవేత్తలకు మన రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దావోస్‌ పర్యటనలో రెండో రోజు జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా ‘ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై జరిగిన సీఐఐ బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పాలసీలను ఇక్కడి సానుకూల పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఈ సందర్భంగా ఆహ్వానించారు.

హైదరాబాద్ అనుభవంతో అమరావతి నిర్మాణం

నాడు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపిన అనుభవం తనకుందని గుర్తు చేస్తూ ఇప్పుడు అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ మరియు అందమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నట్లు సీఎం ధీమా వ్యక్తం చేశారు. అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా ఆర్థిక సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ మహా యజ్ఞంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, నిపుణులు భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. మా నినాదం

ప్రపంచ దేశాలన్నీ వృద్ధాప్య సమస్యతో సతమతమవుతుంటే భారత్ మాత్రం యువ శక్తితో (డెమోగ్రాఫిక్ డివిడెండ్) దూసుకుపోతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారతదేశం ఒకప్పుడు నిద్రిస్తున్న దిగ్గజంలా ఉండేది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ సమర్థ నాయకత్వంలో ఇప్పుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. రాబోయే 25-30 ఏళ్ల పాటు ఈ వృద్ధి ఇలాగే కొనసాగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కేవలం వ్యాపార సౌలభ్యం గురించి మాత్రమే చర్చించేవాళ్లమని అయితే ఇప్పుడు తన ప్రభుత్వం ‘వ్యాపార వేగం’ పై దృష్టి సారించిందని చంద్రబాబు వెల్లడించారు. అంతేకాక దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్ ఆకర్షించడం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌కు నిదర్శనమన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతుందని అందులో ఏపీ అగ్రభాగాన నిలుస్తుందని పేర్కొన్నారు.

టెక్నాలజీ డ్రోన్ విప్లవం

ఏపీలో సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. వ్యవసాయం,వైద్య రంగాల్లో డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తామని 2026 నాటికి ఏపీ నుంచే ‘డ్రోన్ అంబులెన్స్’ సేవలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని కీలక ప్రకటన చేశారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటేనే అద్భుత ఫలితాలు వస్తాయని తెలుగు ప్రజలు కొత్త ఆవిష్కరణలను అందుకోవడంలో ఎప్పుడూ ముందుంటారని తెలిపారు.

గ్రీన్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్

రాష్ట్రానికి ఉన్న 1,054 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్రతీరం, సౌర, పవన శక్తి వనరులు ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తాయని వివరించారు. గ్రీన్ అమ్మోనియా, ఎనర్జీ స్టోరేజ్ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. వీటితో పాటు పోర్టులు, విమానాశ్రయాలు, హైవే కనెక్టివిటీ స్పేస్ సిటీ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పారిశ్రామికవేత్తలకు వివరించారు.

మరోవైపు చంద్రబాబు నాయుడు గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక శక్తుల కేంద్రంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. రాష్ట్రంలోని (సోలార్ ఎనర్జీ) సూర్యశక్తి, విండ్ ఎనర్జీ నిల్వ సామర్థ్యాలను వినియోగించి పెట్టుబడులను ఆకర్షించడం అమరావతి, ఇతర నగరాలను ప్రపంచ స్థాయి, స్మార్ట్, సుస్థిర నగరాలుగా మార్చడం ఆయన లక్ష్యం. గ్రీన్ ఎనర్జీ ద్వారా పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఉద్గారాలు తగ్గించడం సుస్థిర అభివృద్ధి సాధించడం ప్రధాన ఉద్దేశ్యం. అదనంగా ఈ రంగంలో పెట్టుబడులు కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు, శక్తి స్వావలంబన వంటి ఆర్థిక ప్రయోజనాలను కూడా చూడటం ఆయన దృష్టిలో ఉంది. సాంకేతిక ఆవిష్కరణలు, గ్లోబల్ స్థాయి పెట్టుబడులు క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్‌లో భారతదేశం ఆంధ్రప్రదేశ్‌ను నాయకులుగా నిలిపేలా వృద్ధి చేయడం చంద్రబాబు నాయుడు గ్రీన్ ఎనర్జీ వ్యూహం. మరోవైపు గ్లోబల్ స్థాయిలో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు వేగంగా పెరుగుతున్నాయి. సౌరశక్తి, గాలిశక్తి, గ్రీన్ అమోనియా వంటి రంగాల్లో పెట్టుబడులు కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు, పెద్ద లాభాలను సృష్టిస్తున్నాయి. అంతేకాక అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, గ్లోబల్ ఫండ్స్ ఈ రంగంలో మరింత ఆసక్తి చూపిస్తూ పెట్టుబడులకు అవకాశాలు పెంచుతున్నారు.

ప్రకృతి సేద్యం నాలెడ్జ్ ఎకానమీ

రాబోయే 3-4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని నాలెడ్జ్ ఎకానమీ ద్వారానే సంపద సృష్టి జరుగుతుందని యువశక్తిని సమర్థంగా వాడుకోవడంలో భారత్ ముందుందని తెలిపారు. కలిసి ఎదుగుదాం... కలిసి పయనిద్దాం... భవిష్యత్‌ని కలిసి నిర్మిద్దాం అనే నినాదంతో పారిశ్రామిక లోకాన్ని ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.