Let's talk: editor@tmv.in
అమరావతిని పచ్చని మెగా సిటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి నారాయణ

అమరావతిని పచ్చని మెగా సిటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి నారాయణ

Panthagani Anusha
4 డిసెంబర్, 2025

రాజధాని అమరావతిని పచ్చని, అందమైన నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. గ్రీన్‌ఫీల్డ్ రాజధానిలో 30 శాతం పచ్చదనం సాధించాలన్నది ముఖ్య లక్ష్యమని, ఈ మేరకు సమగ్ర మొక్కలు నాటడం, సుందరీకరణ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు.

రాజధాని ప్రాంతంలో 133.3 చ.కి.మీ. విస్తీర్ణంలో పెద్ద ఎత్తున మొక్కల నాటకం, పార్కుల ఏర్పాటు, గ్రీన్ కారిడార్‌లు, బఫర్ జోన్ల అభివృద్ధి చేపడుతున్నట్లు చెప్పారు. అమరావతిలోని 22 ప్రధాన రహదారుల రెండువైపులా గ్రీనరీ అభివృద్ధి ఇప్పటికే కొనసాగుతోందని ఆయన వివరించారు. ఋతువుల ప్రకారం పూలు పూసే మొక్కలను ఉపయోగించి సీజనల్ బ్యూటిఫికేషన్ చేయనున్నామని తెలిపారు.

శకమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండ ప్రాంతాలకు ‘గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్’ ఆధారంగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని నారాయణ తెలిపారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ జనవరి చివరి నాటికి పూర్తవుతుందని పేర్కొన్నారు. రాజధాని పరిధిలో కొత్త పార్కుల అభివృద్ధి వేగంగా సాగుతోందని తెలిపారు.

రాజధానిలో భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి స్పష్టం చేశారు. భూ సమీకరణ పథకం కింద ఇంకా 2,168 మంది రైతులకు 7,743 ప్లాట్‌ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన రైతులకు ఫోన్ ద్వారా అధికారులు సమాచారం అందిస్తున్నారని పేర్కొన్నారు.

అదేవిదంగా భూములు ఇచ్చిన రైతులకు కేటాయించాల్సిన 719 ఎకరాల విలువైన ప్లాట్‌లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి వివరించారు. భూ సమీకరణలో భాగస్వామ్యం కాని 29 గ్రామాల రైతులు ఇప్పటికైనా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులు సహకరించకపోతే రాజధాని అభివృద్ధి ఆలస్యమవుతుందన్న కారణంతో ప్రభుత్వం భూ స్వాధీనం చేపట్టాల్సి రావచ్చని హెచ్చరించారు.

రైతుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సీఆర్‌డీఏ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిని పచ్చని రాజధానిగా మార్చే ఈ ప్రాజెక్టులో రైతుల సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్

గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కొత్తగా, శూన్య స్థితి నుంచి ప్రారంభించే అభివృద్ధి ప్రాజెక్ట్.

అంటే ముందుగా ఎలాంటి భవనాలు, నిర్మాణాలు, రహదారులు, పాత మౌలిక వసతులు లేని ప్రాంతంలో పూర్తిగా కొత్తగా ప్రణాళిక రూపొందించి, మొదటి నుంచీ నిర్మించే ప్రాజెక్ట్‌ను గ్రీన్‌ఫీల్డ్ అని అంటారు.

ఇలాంటి ప్రాజెక్ట్‌లలో

• పాత నిర్మాణాలు తొలగించడం అవసరం లేదు

• పూర్తిగా కొత్త డిజైన్ ప్రకారం నిర్మించవచ్చు

• ఆధునిక మౌలిక వసతులు సులభంగా అమలు చేయవచ్చు

• దీర్ఘకాలిక ప్లానింగ్‌కు అనుకూలంగా ఉంటుంది

ఇందుకే అమరావతి రాజధానిని కూడా గ్రీన్‌ఫీల్డ్ రాజధాని ప్రాజెక్ట్గా అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే అది పూర్తి ఖాళీ భూమిపై కొత్తగా ప్లాన్ చేసి నిర్మించే రాజధాని.