
అమరావతికి రాష్ట్రపతి రాజముద్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి అధికారిక ముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) చట్టం-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో మంగళవారం కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పరిణామంతో గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడటమే కాకుండా రాజ్యాంగబద్ధంగా అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా స్థిరపడింది.
2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ పదేళ్ల గడువు ముగియడంతో తెలంగాణకే పరిమితమైంది. తాజాగా పార్లమెంట్ ఆమోదించిన సవరణ చట్టం ద్వారా 2014 చట్టంలోని నిబంధనలకు కీలక మార్పులు చేశారు. అందులో "అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది" అనే స్పష్టమైన వాక్యాన్ని చేర్చారు. మార్చి 28న రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం ఏప్రిల్ 1న లోక్‌సభ మరుసటి రోజే రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.కాగా కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
గెజిట్ ప్రచురణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. "ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి" అంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్ర ప్రజల తరఫున, తమ చిరకాల కలను నెరవేర్చినందుకు రాష్ట్రపతికి ఆయన లోతైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలదని ముఖ్యంగా అమరావతి కోసం త్యాగాలు చేసిన రైతులదని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబాటుకు, బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలు, నాయకులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
మొత్తానికి చట్టపరమైన చిక్కులన్నీ తొలగిపోవడంతో అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెరగనుంది. రాష్ట్ర ఏకైక రాజధానిగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ఇకపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంది. ఏపీ ప్రజలు, ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు ఈ గెజిట్ విడుదలను ఒక చారిత్రక విజయంగా భావిస్తున్నారు.
