
అమరావతికి చట్టబద్ధత సరే.. నిధుల మాటేమిటి? వైఎస్ షర్మిల
రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టపరమైన ప్రామాణికత కల్పిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సానుకూలంగా స్వాగతించారు. అయితే ఇదే సమయంలో కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక మద్దతు, ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం గెజెట్ నోటిఫికేషన్లతో అమరావతి నిర్మాణం సాధ్యం కాదని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టడంలో ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ఆమె ప్రశ్నించారు.
ఈ మేరకు శనివారం ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాజధాని విషయంలో సెక్షన్ 5 సవరణ కోరడం న్యాయమైన చర్యేనని పేర్కొన్నారు. "అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న తపన స్వాగతనీయం. కానీ పునఃవ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(3) ప్రకారం కేంద్రం నుంచి నిధులు సాధించడంలో ఆ తొందరపాటు ఎందుకు కనిపించడం లేదు?" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిలదీశారు. అమరావతి నిర్మాణానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ఆ భారాన్ని ప్రజలపై వేయడం సరికాదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. .
గిన్నెడు నీళ్లు, పిడికెడు మట్టితో సరిపెట్టలేరు
ప్రధాని మోదీ గతంలో అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రతీకాత్మకంగా ఇచ్చిన గిన్నెడు నీరు, మట్టి వంటి చర్యలు రాజధాని నిర్మాణానికి సరిపోవని షర్మిల ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణ బాధ్యతను కేంద్రం పూర్తిగా స్వీకరించేలా అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. "కేవలం తీర్మానాలతో సరిపెట్టుకుంటారా? లేక ఆర్థిక సాయం కోసం కేంద్రంపై గట్టిగా పోరాడతారా? అని ఆమె ప్రశ్నించారు.
వైసీపీ విమర్శలు: ఇదొక 'రాజకీయ నాటకం'
మరోవైపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఈ తీర్మానం కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆడుతున్న "రాజకీయ నాటకం" అని అభివర్ణించారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూనే గతంలో జరిగిన అవినీతి అధిక ఖర్చులు, పురోగతి లేకపోవడాన్ని ప్రజలు గమనించాలని కోరారు. అయితే రాజధానిపై సాగుతున్న ఈ రాజకీయ రచ్చతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఒకవైపు చట్టపరమైన ప్రక్రియలు జరుగుతుండగా మరోవైపు నిధుల సమీకరణే అతిపెద్ద సవాలుగా మారుతోంది.
