
అమరావతికి చట్టబద్దత కల్పించండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి, రాజకీయ, ఆర్థిక స్థిరత్వానికి ఇది అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు న్యూఢిల్లీ లోని అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభిస్తే అభివృద్ధి వేగవంతమవుతుందని ప్రజల ఆకాంక్షలు నెరవేరడమే కాకుండా పెట్టుబడిదారుల విశ్వాసం మరింత బలపడుతుందని చంద్రబాబు వివరించారు.
ఇక తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)’ జీ రామ్ జీ పథకంలోని ఆర్థిక నిబంధనలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్ర నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడంతో ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌పై అదనపు భారం పడుతోందని దీని వల్ల పథకం సమర్థవంతంగా అమలయ్యే అవకాశాలు దెబ్బతింటాయని అమిత్ షాకు వివరించారు.
రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని “జీ రామ్ జీ” పథకంలో ప్రత్యామ్నాయ ఆర్థిక సహాయం లేదా నిధుల విషయంలో వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే అందిస్తున్న సహకారాన్ని గుర్తుచేసిన ఆయన ఇదే తరహా మద్దతు భవిష్యత్తులోనూ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తాజా రాజకీయ, పాలనా పరిణామాలపై చర్చించిన సీఎం విధాన పరమైన స్పష్టత, కేంద్ర–రాష్ట్ర సమన్వయం పెరిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదిలాఉండగా ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న కేంద్ర బడ్జెట్ 2026కు ముందుగా ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్‌డీఏలో కీలక మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు, రాబోయే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన మద్దతు, ప్రత్యేక సహకారం అందించాలని కోరినట్లు సమాచారం.
