Let's talk: editor@tmv.in
అమరావతికి చట్టబద్దత..రాష్ట్రపతికి ఎన్డీయే బృందం కృతజ్ఞతలు

అమరావతికి చట్టబద్దత..రాష్ట్రపతికి ఎన్డీయే బృందం కృతజ్ఞతలు

Panthagani Anusha
14 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నెలకొన్న సుదీర్ఘ అనిశ్చితికి తెరపడింది. అమరావతిని రాష్ట్ర ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తించే ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026’కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. పార్లమెంటు ఉభయ సభలు ఇటీవల ఆమోదించిన ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో అమరావతికి ఇప్పుడు అధికారికంగా చట్టబద్ధమైన గుర్తింపు లభించింది.

ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపేందుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీల బృందం సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అమరావతికి ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం లభించడం ఐదు కోట్ల ఆంధ్రుల కల సాకారమవ్వడమేనని పేర్కొన్నారు. ఈ చట్టంతో ఇకపై "మా రాజధాని అమరావతి" అని ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకోగలరని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

రైతుల పోరాటాన్ని కొనియాడిన ముర్ము

బృందంతో జరిగిన సంభాషణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాల భూములను స్వచ్ఛందంగా అందించిన రైతుల త్యాగాలను ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. "పోరాడి సాధించుకున్న విజయమే ఎప్పటికీ నిలిచిపోతుంది అని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విజనరీ లీడర్ గా అభివర్ణిస్తూ ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

అభివృద్ధికి మార్గం సుగమం

ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో అమరావతి నిర్మాణానికి ఉన్న అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. అమరావతిలో ఇప్పటికే సుమారు రూ. 57,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ చట్టబద్ధతతో అంతర్జాతీయ పెట్టుబడులు పెరగడమే కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అమరావతి కీలక ఇంజిన్‌గా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

భేటీ అనంతరం అమరావతి చరిత్ర మరియు మాస్టర్ ప్లాన్ విశేషాలతో కూడిన ఒక ప్రత్యేక కాఫీ టేబుల్ పుస్తకాన్ని మంత్రి లోకేష్ రాష్ట్రపతికి బహుకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు.