


అమరావతికి కేంద్ర చట్టబద్ధత
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి అత్యున్నత చట్టసభలో శాశ్వత గుర్తింపు లభించింది. ఏప్రిల్ 1న లోక్‌సభ ఆమోదం పొందిన " ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026" ఏప్రిల్ 2న రాజ్యసభలోనూ నెగ్గడం రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చట్టంతో గత పదేళ్లుగా నెలకొన్న అనిశ్చితి వీడటమే కాకుండా, రాజధాని నిర్మాణానికి మార్గం సుగమమైంది.
రాజ్యసభలో బిల్లు ఆమోదం - ప్రధానికి లోకేష్ ధన్యవాదాలు
రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలువురు ఎంపీ లతో వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చూపిన చొరవ వల్లనే ఇది సాధ్యమైందని, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా గుర్తించాలన్న ఐదు కోట్ల ప్రజల ఆశయం నేరవేరిందని ఆయన పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి బాట పడుతుందని లోకేష్ ఆకాంక్షించారు.
ఈ బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార కూటమిలోని బీజేపీ, టీడీపీలతో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా బిల్లుకు మద్దతు తెలపడం విశేషం. విభజన హామీలను నెరవేర్చే క్రమంలో అమరావతికి న్యాయపరమైన రక్షణ అవసరమని అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే, గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ సభ నుండి వాకౌట్ చేసింది.
రేపే గెజిట్ నోటిఫికేషన్ - రాష్ట్రపతి సంతకం
పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లును వెంటనే రాష్ట్రపతి భవన్‌కు పంపారు. శుక్రవారం (ఏప్రిల్ 3) నాటికి భారత రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేయనున్నారు. రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీనివల్ల అమరావతికి రాజ్యాంగబద్ధమైన హోదా లభించి, భవిష్యత్తులో రాజకీయ మార్పులు సంభవించినా రాజధానిని మార్చే అవకాశం లేకుండా చట్టపరమైన కవచం ఏర్పడుతుంది.
సుదీర్ఘ పోరాటానికి లభించిన విజయం
2014 విభజన తర్వాత అమరావతి పునాది పడింది. అయితే 2019లో అధికార మార్పిడి తర్వాత "మూడు రాజధానుల" నిర్ణయంతో ఈ ప్రాజెక్టు స్తంభించిపోయింది. వేలాది ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు 1600 రోజులకు పైగా పోరాటం చేశారు. ఇప్పుడు పార్లమెంటు ద్వారా వచ్చిన ఈ చట్టబద్ధత ఆ రైతుల త్యాగాలకు దక్కిన గౌరవంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజధానిపై ఇకపై ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఉండవని స్పష్టమైంది.
అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించడంతో అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి సంస్థలు గతంలోనే అమరావతికి నిధులు ఇచ్చేందుకు మొగ్గు చూపాయి. ఇప్పుడు చట్టబద్ధమైన గ్యారెంటీ ఉండటంతో, నిధుల కొరత తీరి పనులు పరుగులు పెడతాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. సెల్ఫ్-ఫైనాన్సింగ్ మోడల్‌లో రాజధానిని నిర్మించేందుకు ఐటీ శాఖ కసరత్తు చేస్తోంది.
వైఎస్సార్సీపీ అభ్యంతరాలు - వాదనలు
బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ, అమరావతి నిర్మాణం వల్ల రాష్ట్ర ఖజానాపై విపరీతమైన భారం పడుతుందని వాదించింది. భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, కేవలం ఒక ప్రాంతానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇతర ప్రాంతాలు వెనుకబడిపోతాయని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, కేంద్రం మాత్రం సమగ్ర అభివృద్ధికి ఈ బిల్లు దోహదపడుతుందని స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు
అమరావతి బిల్లు ఆమోదం పొందిన వార్త తెలియగానే ఆంధ్రప్రదేశ్ అంతటా సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా తుళ్లూరు, వెలగపూడి ప్రాంతాల్లోని రైతులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. "ఇది మా పోరాటానికి దక్కిన విజయం" అని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. అలాగే సోషల్ మీడియా ఎక్స్‌లో మంత్రి లోకేష్ ఇచ్చిన పిలుపుమేరకు ఇన్నాళ్ళకు గ్రహణం వీడిందని అందరూ వారి వారి ముంగిళ్ళలో దీపాలు వెలిగించి సంతోషం వ్యక్తం చేశారు.
కేంద్రం కీలక పాత్ర - రాజకీయ వ్యూహం
ఈ బిల్లు ఆమోదంలో కేంద్రం క్రియాశీలక పాత్ర పోషించింది. వివిధ రాజకీయ పార్టీలను సమన్వయం చేయడంలో ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఏపీలో రాజకీయ స్థిరత్వం ఏర్పడాలంటే రాజధాని సమస్య పరిష్కారం కావాలని కేంద్రం గుర్తించింది. ఈ సవరణ బిల్లుతో 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని లోపాలను సవరించినట్లయింది.
చట్టబద్ధత లభించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు నిర్మాణాలను పూర్తి చేయడం. ఆగిపోయిన ఐకానిక్ భవనాలు, సచివాలయం, హైకోర్టు కాంప్లెక్సులను గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు సమీకరించాల్సి ఉంది.
అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అది ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక. పార్లమెంటు ఆమోదంతో ఈ నగరానికి శాశ్వతత్వం సిద్దించింది. రేపు రాష్ట్రపతి సంతకంతో కొత్త గెజిట్ విడుదల కానున్న నేపథ్యంలో, ఏపీ రాజధాని ప్రస్థానంలో ఒక చీకటి అధ్యాయం ముగిసి, సువర్ణాధ్యాయం మొదలైనట్లయిందని పలువురు మంత్రులు వారి వారి సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో భావోద్వేగ పోస్ట్ లు చేశారు.
ఉద్దండరాయునిపాలానికి చంద్రబాబు దంపతులు
అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై ఉద్ధండరాయునిపాలెంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించిన నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రైతుల సంబరాల్లో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. ఉద్ధండరాయునిపాలెం వెళ్లిన చంద్రబాబు దంపతులకు అక్కడి రైతులు, మహిళలు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమరావతి పునాదికి చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. గతంలో ఇదే చోట రాజధానికి శంకుస్థాపన జరిగింది. ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని చంద్రబాబు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు
‘ఇంటికి తిరిగి వచ్చిన' అనుభూతి కలిగిందన్న లోకేష్
రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, సుదీర్ఘ రాజకీయ అనిశ్చితి, ఐదేళ్ల అభివృద్ధి స్తబ్ధత తర్వాత అమరావతికి రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధమైన హోదా లభించడం ఏపీ ప్రజలకు 'ఇంటికి తిరిగి వచ్చిన' అనుభూతిని కలిగిస్తోందని హర్షం వ్యక్తం చేశారు
2014 విభజన సమయంలో తీవ్ర అన్యాయానికి గురైన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి రైతులు కేవలం 58 రోజుల్లోనే 35,000 ఎకరాల భూమిని ఇచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన 'మూడు రాజధానుల' విఫల నమూనా వల్ల ఐదేళ్లు వృథా అయ్యాయని, రాజధాని కోసం పోరాడిన మహిళలు, రైతులు అనేక అవమానాలు, వేధింపులు భరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీయే "ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని" విధానానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
అభివృద్ధి ప్రణాళికలపై స్పందిస్తూ, ఇప్పటికే రూ. 50,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, రెండేళ్లలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి ప్రధాన కట్టడాల మొదటి దశను పూర్తి చేస్తామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటికే సుమారు రూ. 18,000 కోట్లు విడుదల చేసిందని, భవిష్యత్తులో ఈ చట్టాన్ని మార్చడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన అన్నారు.
వికేంద్రీకరణ అంటే కేవలం రాజధానుల మార్పు కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పెట్టుబడులను ఆకర్షించడమేనని చెబుతూ.. ప్రస్తుతం దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన వాటాను సాధిస్తోందని వివరించారు. ఈ చట్టం సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, త్వరలోనే ఏపీ 'వికసిత భారత్' లక్ష్యానికి వెన్నెముకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
త్యాగంతో పునరుజ్జీవించిన ప్రజల రాజధాని అన్న పవన్ కళ్యాణ్
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ, త్యాగాన్ని చూసిన మట్టి నుంచి, ఆశలను తేవిన కన్నీటి నుండి, అనిశ్చితిని సహించిన నిశ్శబ్దం నుంచి అమరావతి గౌరవంతో ఎదిగి, కోట్ల ఆశలను కదిలిస్తుంది. ఈ రోజు మన ఆధ్యాయంలో సాధారణ రోజు కాదు, ఇది పునరుద్ధరణ ఘట్టం. అమరావతి బిల్లును పార్లమెంట్‌లో రెండూ హౌసులలో ఆమోదించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం అందింది. అమరావతి ఏకైక శాశ్వత రాజధానిగా నిలిచింది. ఈ విజయం, ఎన్డీఏ ప్రభుత్వంపై స్థిర నమ్మకంతో నిలిచిన ప్రతి పౌరుడి విజయం అన్నారు.
ఈ ప్రజల విజయం, రాష్ట్రానికి, భారతంలో భాషా రాష్ట్రాల ఏర్పాటుకు బలమైన పునాదులు వేయించిన అమరజీవి పొట్టి శ్రీరాములుకి అంకితమిస్తూ, గౌరవాన్ని అందిస్తాను. ఆయన జీవితం చూపిన ధైర్యం, నిబద్ధత గొప్ప మార్పులకు అవసరమని గుర్తుచేస్తుంది.
అమరావతి ఆత్మ రైతుల త్యాగంలో ఉంది. 33,000 ఎకరాలు భూమి బలవంతంగా కాకుండా విశ్వాసంతో, భవిష్యత్తుపై ఉన్న దృష్టితో, అందించబడింది. ఆ విశ్వాసం ఈ రోజు గౌరవించబడిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, అమరావతి అభివృద్ధిలో చూపిన స్పష్టమైన దృష్టి, నిరంతర పట్టుదల కోసం ఆయనకు నా కృతజ్ఞతలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకీ, ఎన్డీఏ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి కీలక సమయంలో నిలిచినందుకు ధన్యవాదాలు. బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు తెలిపిన అన్ని నాయకులు, పార్టీలకు కూడా నా కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఎన్నో సంవత్సరాల పాటు అమరావతి అనిశ్చితిలో ఉండగా, రైతులు వంచింపబడ్డారు, ఆశలు నిలిపివేయబడ్డాయి. అయినప్పటికీ ప్రజలు ఒప్పుకోవలేదు. వారి సంకల్పం ఇప్పుడు ప్రతిఫలితమైంది. ఇది కేవలం రాజధాని పునరుజ్జీవనమే కాదు. స్వీయ గౌరవ పునరుద్ధరణ. త్యాగంతో నిర్మించబడిన, సంకల్పంతో బలపరచబడిన, కోట్ల కలల ద్వారా నడిచిన రాజధాని. ఈ క్షణం నుండి అమరావతి స్థిరత్వం, ప్రగతి, ప్రజల రాజధాని, భవిష్యత్తు తరాల కోసం వంతెనగా నిలుస్తుందని రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ,మేధావులు, సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.
