Let's talk: editor@tmv.in
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి… 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి… 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

Panthagani Anusha
17 మార్చి, 2026

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం అజరామరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. సోమవారం పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని గుంటూరు సమీపంలోని శాకమూరు పార్క్‌లో ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టి తుదిశ్వాస వరకు పోరాడిన శ్రీరాములు వల్లే నేడు మనం ఈ స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు.

కాగా మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతాలను విడదీసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో 1952లో శ్రీరాములు చేపట్టిన దీక్ష ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆయన బలిదానం దేశవ్యాప్తంగా భాషాపరమైన రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిందని తద్వారా తెలుగు వారికి ఒక ప్రత్యేక గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. దశాబ్దాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అనేక భౌగోళిక మార్పులకు లోనై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా విడిపోయినప్పటికీ తెలుగు జాతి ఐక్యతను చాటిచెప్పేలా ఈ స్మారకాన్ని తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు.

శాకమూరు పార్క్‌లో సుమారు 6.8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల భారీ వ్యయంతో ఈ స్మారక ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ పర్యవేక్షణలో కేవలం ఆరు నెలల రికార్డు సమయంలోనే ఈ భారీ విగ్రహాన్ని నిర్మించడం విశేషం. కాగా ఈ విగ్రహ నిర్మాణానికి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఇనుమును వినియోగించారు. 58 రోజుల దీక్షకు గుర్తుగా విగ్రహం ఎత్తును కూడా 58 అడుగులుగా నిర్ణయించినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. తొలి దశ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు అమరావతి ప్రాంతంలో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలవనుంది.

వచ్చే ఏడాదిలో ప్రాజెక్టు రెండో దశ పనులను వేగవంతం చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో భాగంగా అమరజీవి జీవిత విశేషాలను తెలిపే మ్యూజియం, ఫోటో గ్యాలరీతో పాటు అత్యాధునిక ఆడిటోరియంను నిర్మించనున్నారు. అంతేకాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఇక్కడ ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కేవలం విగ్రహానికే పరిమితం కాకుండా, పొట్టి శ్రీరాములు ఆశయాలను ప్రతిబింబించేలా ఈ సముదాయాన్ని ఒక విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సహా వివిధ మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి… 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం - Tholi Paluku