
అమెరికాలో రాజకీయ హింస
అమెరికాలో రాజకీయ హింస జరుగుతోందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. కన్సర్వేటివ్ ఉద్యమకారుడు చార్లీ కిర్క్ హత్య తర్వాత కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశాన్ని ఐక్యం చేసే ప్రయత్నాలు చేయకుండా విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెన్సిల్వేనియాలోని ఎరీలో జెఫర్సన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒబామా మాట్లాడారు. దేశంలో అంతర్గతంగా విభేదాలు, తీవ్రమైన చర్చలు ఉన్నప్పటికీ, హింస లేకుండా ఉండాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇదే ప్రధాన సూత్రమని తెలిపారు. మనకు వ్యతిరేకంగా ఉన్న వారైనా హింసకు గురైతే, అది ఎప్పటికైనా మనకు కూడా ముప్పుగా మారుతుందని చెప్పారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
దేశంలో విభజన పెంచిన ట్రంప్
ఒబామా తన అధ్యక్ష పదవి ముగిసిన తర్వాత రాజకీయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. కానీ, చార్లీ కిర్క్ హత్య తర్వాత ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని తీవ్ర స్థాయిలో దురుసు వ్యాఖ్యలు చేయడం ద్వారా దేశంలో విభజనను మరింత పెంచారని ఆయన విమర్శించారు. 2015లో సౌత్ కరోలినాలోని చార్లెస్టన్ చర్చిలో తొమ్మిది మంది నల్లజాతీయుల హత్య, 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల సమయంలో జార్జ్ బుష్ నాయకత్వాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. సంక్షోభ సమయంలో అధ్యక్షుడు దేశాన్ని ఐక్యం చేసే బాధ్యతను గుర్తు చేయాలని ఒబామా స్పష్టం చేశారు. కిర్క్ హత్య తర్వాత ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులపై దాడులు పెంచడం, వాషింగ్టన్లో నేషనల్ గార్డ్ను మోహరించడం, లాస్ ఏంజిల్స్లో ఫెడరల్ ఏజెంట్ల ద్వారా తనిఖీలు నిర్వహించడం వంటి చర్యలను ఒబామా విమర్శించారు. ఈ చర్యలు గత అధ్యక్షులు పాటించిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయన్నారు. ఇది దేశానికే ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
చార్లీ హత్యను ఖండించిన ఒబామా
టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ స్థాపకుడు, ట్రంప్ సన్నిహితుడైన చార్లీ కిర్క్ హత్య తర్వాత ట్రంప్ "తీవ్రవాద వామపక్షం"పై దాడులు పెంచారు. ఇది రాజకీయ వ్యతిరేకతను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారనే భయాలను రేకెత్తించింది. ట్రంప్ పరిపాలనపై ఒబామా తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ను ఆధునిక రాజకీయ విభజనకు కారకుడిగా పేర్కొన్నారు. కిర్క్ హత్య కేసులో 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ అనే వ్యక్తిపై హత్యా నేరం అభియోగం మోపారు. అతను కిర్క్ను హత్య చేసినట్లు, తన స్నేహితుడికి ఫోన్లో సందేశాల ద్వారా విషయాన్ని తెలిపినట్లు కోర్టులో సమర్పించిన ఆధారాల్లో పేర్కొన్నారు. ఒబామా కిర్క్ హత్యను ఖండిస్తూ, రాజకీయ హింస ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. చార్లీ కిర్క్ అభిప్రాయాలతో ఏకీభవించడం లేదని, ఆయన కుటుంబం కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఒబామా వ్యాఖ్యానించారు. ఉటా గవర్నర్ స్పెన్సర్ కాక్స్ ఈ హత్యపై సంయమనంతో స్పందించినందుకు ఒబామా ప్రశంసించారు.
రాజకీయ వ్యతిరేకతపై అణచివేత
చార్లీ కిర్క్ హత్య తర్వాత అమెరికా రాజకీయ వాతావరణంలో జరుగుతున్న పరిణామాలు దేశంలో లోతైన రాజకీయ విభజనను సూచిస్తున్నాయి. చార్లీ కిర్క్, మిన్నెసోటా రాష్ట్ర ప్రతినిధి మెలిస్సా హార్ట్మన్ హత్య వంటి సంఘటనలను గమనిస్తే అమెరికాలో రాజకీయ హింస పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఒబామా ఈ హింసను ప్రజాస్వామ్యానికి ముప్పుగా హెచ్చరించారు. ఇటువంటి హింసాత్మక సంఘటనలు రాజకీయ చర్చలను మరింత ఉద్రిక్తం చేయవచ్చు. ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా అభివర్ణించడం, నేషనల్ గార్డ్ మోహరింపు, గుర్తింపు తనిఖీలు వంటి చర్యలు రాజకీయ వ్యతిరేకతను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయనే ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.
ఇది ప్రజాస్వామ్య సంస్థలపై ఒత్తిడి పెంచవచ్చు. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ సంయమనం, ఐక్యత ఎంతో ముఖ్యం. ట్రంప్, రాజకీయ ప్రత్యర్థుల పరస్పర ఆరోపణలు రాజకీయంగా మరిన్ని సమస్యలను సృష్టించవచ్చు. ట్రంప్ చర్యలపై అధికార దుర్వినియోగం,ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇది అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపవచ్చు. కిర్క్ హత్య కేసు రాజకీయ హింసను ఖండించడానికి ఒక అవకాశంగా మారవచ్చు. కానీ ట్రంప్ దీనిని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటే దేశంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
