
అమెరికాలో బహిరంగంగానే అవినీతి!
అమెరికాపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాలో అవినీతి బహిరంగంగానే జరుగుతుందని, ఆ దేశ నేతలు అత్యంత అవినీతిపరులని ఆరోపించారు. పాక్పై ఉగ్రవాదం, పారదర్శకత లేమి, అవినీతికి సంబంధించి పలు ఆరోపణలు వస్తున్న తరుణంలో ఖవాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయంశంగా మారాయి. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, అమెరికాలో రాజకీయ నేతలు ఇజ్రాయెల్ నుంచి బహిరంగంగానే లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అంతే కాకుండా తాను లంచం తీసుకోవాల్సి వస్తే ఎక్కడో దాక్కొని తీసుకుంటానని ఖవాజా వ్యాఖ్యానించారు. పాక్లోని ఓ ప్రముఖ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఈ విధంగా స్పందించారు.
ఒక్కరినే టార్గెట్ చేయొద్దు
అమెరికా రాజకీయాల్లో ఇజ్రాయెల్ లంచాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఖవాజా తెలిపారు. అవినీతి చేయని నాయకులు ఎవరూ లేరని చెప్పడం లేదని, ఒక్కరినే టార్గెట్ చేయడం న్యాయం కాదని చెప్పారు. ఇప్పటికే పాకిస్థాన్లో ప్రభుత్వ అధికారులు, దౌత్య వేత్తలు విదేశాలకు బ్లాక్ మనీ తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖవాజా అసిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవలే ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేస్తూ దేశంలోని ఉన్నతాధికారులే అక్రమంగా డబ్బు తరలిస్తున్నారని, వీరిని ఎవరూ ప్రశ్నించడం లేదని పేర్కొన్నారు. రాజకీయ నాయకులపై మాత్రం నిత్యం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇరు దేశాల స్పందనపైనే ఆధారం
ఇజ్రాయెల్ ఇటీవల గాజాపై దాడులు ప్రారంభించగా అమెరికా వారికి మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో అసిఫ్ మాటలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికాలో రాజకీయ నేతలపై ఇజ్రాయెల్ ప్రభావం ఉందని, అందుకే ఇలాంటి మద్దతులు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు ఇటీవల ఖతార్లో జరిగిన ముస్లిం దేశాల సమావేశంపై ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి ఓ రక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇది నాటో తరహాలో ఉండాలని అభిప్రాయపడ్డారు. పాక్లో కొందరు అసిఫ్ను విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం ఆయన మాటలు నిజమేనంటూ మద్దతిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్, అమెరికా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఖవాజా అసిఫ్ వ్యాఖ్యలు దేశంలో అవినీతి చర్చను మరింత ఉధృతం చేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంబంధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపాయి. అమెరికా ఇజ్రాయెల్ నుంచి లంచాలు తీసుకున్నట్లు గతంలో సైతం కెనడా, ఆస్ట్రేలియా సమా పలు సంస్థలు ఆరోపించాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవు. డొనేషన్ల రూపంలో, అమెరికాలో ఎన్నికలు జరిగినప్పుడు ఇజ్రాయెల్ నుంచి భారీగా నిధులు రావడం జరుగుతూనే ఉంది. కానీ, ఇది చట్ట విరుద్ధం కాదు. పాక్ ఆరోపణలపై అమెరికా, ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
