
అమెరికాలో.. నేటి ఉద్యోగం
అమెరికాలో పని చేయాలనే ఆలోచన ఒక్కసారిగా భారంగా మారింది. ట్రంప్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న హెచ్–1బీ వీసా ఫీజు పెంపు నిర్ణయం గందరగోళానికి దారితీసింది. లక్ష డాలర్లు ఫీజు నిర్ణయంతో ప్రతి సంవత్సరం దాదాపు ఒక లక్షా 40 వేల ఉద్యోగాలు కనుమరుగవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయులు, ఐటీ రంగంలో ఉన్నవారు ఎక్కువగా దెబ్బతింటారు. ఇప్పటివరకు అమెరికాలో కలల ఉద్యోగాల కోసం వెళ్ళిన వారు, కొత్తగా వెళ్ళాలనుకునేవారు, అందరి ముందూ ఒక పెద్ద గోడలా ఈ ఫీజు నిలుస్తుంది. ఉద్యోగాల ప్రవాహం తగ్గిపోతూ, ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద తుఫాన్ రాబోతుందనే భయం మొదలైంది.
ఈ ఫీజు పెంపు వల్ల అమెరికా కంపెనీలే ఎక్కువగా నష్టపోతున్నాయి. కొత్త ఉద్యోగులను నియమించుకోవడంలో వారు వెనకడుగు వేయాల్సి వస్తుంది. క్రమంగా పనులు ఆలస్యం అవుతాయి.. అప్పుడు ప్రొడక్టవిటీ తగ్గిపోతుంది. చివరికి ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిని అడ్డుకునే ఒక పెద్ద గోడలా నిలుస్తుంది. భారతీయుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల పాటు చదువుకుని, డాలర్లలో సంపాదించాలని కలలుకంటూ కుటుంబాలు పెట్టుబడి పెడతాయి. ఆ కలలు ఒక్కసారిగా చీలిపోతాయి. ఒక లక్ష డాలర్ల ఫీజు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి అందని స్థాయిలో ఉంటుంది. తల్లిదండ్రులు అప్పులు తీసుకుని పిల్లలను అమెరికాకు పంపించడం సాధ్యంకాకుండా పోతుంది. దీంతో ఆశలు ఆగిపోతాయి, వీసా దరఖాస్తులు తగ్గిపోతాయి, కలలతో నిండిన యువత నిరాశలో మునిగిపోతారు.
ఇక అమెరికా కంపెనీలు కూడా ఆలోచన మార్చుకోవాల్సిన సమయం వస్తుంది. ఇప్పటికే లేఆఫ్‌కు గురైన ఉద్యోగులను మళ్లి వెనక్కి పిలిచి పనిచేయాలని కంపెనీలు కోరుతున్నట్టుగా సమాచారం. కొత్త ఉద్యోగి కోసం లక్ష డాలర్ల వరకు ఫీజు చెల్లించే బదులు, ఇప్పటికే వీసా కలిగి ఉండి ఉద్యోగం కోల్పోయిన పాత నిపుణులను తిరిగి నియమించుకోవడం వైపే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. నిజానికి అమెరికాలో ఉద్యోగి ఖర్చు పెరిగితే వారు అల్టెర్‌నెట్‌గా భారత్, ఫిలిప్పీన్స్, మెక్సికో వంటి దేశాలకు ఉద్యోగాలను ఔట్‌సోర్స్ చేస్తారు. అంటే అమెరికాలో ఉద్యోగాలు తగ్గిపోతాయి. స్థానికులకు ఇచ్చే అవకాశాలు పెరుగుతాయని చెప్పినా, వాస్తవానికి కొత్త ఉద్యోగాలు సృష్టించే ఆసక్తి తగ్గిపోతుంది. ఈ విధానం చివరికి అమెరికా నేల మీదే ఉద్యోగాలు లేకుండాపోవడానికి కారణమవుతుంది. ఇటు ఈ నిర్ణయం వెనక ఉన్న రాజకీయ లెక్కలు కూడా గమనించాల్సినవే. 'అమెరికన్లకే ఉద్యోగాలు' అనే నినాదాన్ని ముందుకు తెచ్చి ట్రంప్ తన రాజకీయ బలం పెంచుకోవాలనుకుంటున్నారు. కానీ తాత్కాలికంగా కనిపించే ఈ విజయం, దీర్ఘకాలంలో అమెరికా ప్రతిభను కోల్పోవడానికి దారితీయవచ్చు.
గ్లోబల్ ప్రతిభను నిరాకరించడం వల్ల అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోతుందనే భయం కూడా మొదలవుతోంది. ఇలా చూస్తే అమెరికా భవిష్యత్ దృశ్యం మరింత ఆందోళనకరం. వీసా ఫీజు పెంపు కొనసాగితే అమెరికా టెక్నాలజీ రంగం ప్రతిభా వనరులను కోల్పోతుంది. కొత్త ఆవిష్కరణలు తగ్గిపోతాయి, ప్రపంచంలో పోటీ పడే శక్తి తగ్గుతుంది. భారతీయులు, ఇతర దేశాల ప్రతిభావంతులు వేరే మార్గాలను ఎంచుకుంటారు. కెనడా, యూరప్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు వారి ప్రతిభను ఆకర్షించుకుంటాయి. మొత్తంగా చూస్తే.. ఈ ఒక నిర్ణయం కేవలం వీసాల వ్యవహారం మాత్రమే కాదు.. వేలాది మంది జీవితాలను, అమెరికా కంపెనీల దిశను, ఆర్థిక వ్యవస్థ బలాన్ని కదిలించే తుఫాన్ లాంటిదిగా నిలుస్తోందని చెప్పవచ్చు.
